గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Jun 17, 2020 , 00:36:56

కొండంత వైభవం

కొండంత వైభవం

n సీఎం కేసీఆర్‌ రాకతో కొండపోచమ్మ దేవాలయానికి మహర్దశ

n ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

n 2 ఎకరాల్లో ఆలయ పునర్నిర్మాణానికి ఏర్పాట్లు

n 105 ఎకరాల భూసేకరణ, రూ.10 కోట్లు కేటాయించిన ప్రభుత్వం..

జగదేవ్‌పూర్‌: కొండపోచమ్మ క్షేత్రానికి మహర్దశ వచ్చింది. ఇటీవలే ఈ దేవాలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్‌ ఆలయ అభివృద్ధికి పూనుకున్నారు. మర్కుక్‌ రిజర్వాయర్‌కు కొండపోచమ్మ సాగర్‌గా నామకరణం చేయడం, అదే సమయంలో అమ్మవారి సన్నిదిలో నవచండీయాగం చేపట్టడంతో పాటు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని సీఎం చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే రూ.10ట్లు కేటాయించారు. 2 ఎకరాల విస్తర్ణంలో ఆలయ పునర్నిర్మాణం, భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద 105 ఎకరాల భూసేకరణకు అధికారులు ప్రణాళిక తయారు చేసి పనులు చేపట్టనున్నారు. జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌నర్సాపూర్‌లోని దట్టమైన నల్లసరం కొండల్లో కొండపోచమ్మ దేవాలయం వెలసింది. ఏటా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.  

మారనున్న ఆలయ రూపురేఖలు...

మర్కూక్‌ రిజర్వాయర్‌కు కొండపోచమ్మ అమ్మవారి పేరున కొండపోచమ్మ సాగర్‌గా సీఎం కేసీఆర్‌ నామకరణం చేయడంతోనే ఆలయం అభివృద్ధిపై భక్తులు అంచనాలు పెరిగాయి. పైగా కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే సమయంలో ఆలయ అభివృద్ధిపై కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, దేవాదాయశాఖ అధికారులతో ఆలయ అభివృద్ధిపై ఆరా తీశారు. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ పునర్నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు.

పునర్నిర్మాణంపై ప్రత్యేక పర్యవేక్షణ...

సీఎం కేసీఆర్‌ సూచనలతో ఇటీవల మంత్రి తలసాని స్థానిక నేతలతో కలిసి వచ్చి ఆలయ అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయం వద్ద పాత భవనాలు తొలిగించి నూతనంగా కాటేజీలు నిర్మించాలని, ఆలయ ప్రాంగణం విశాలంగా చేయాలని, గుడి ముందు చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చెప్పారు. ఇందుకుగానూ 273 సర్వే నంబర్లో 245 ఎకరాల భూమి ఉండగా, కొంత మేర ప్రభుత్వ భూమి ఉంది. దాంట్లో 105 ఎకరాల సీలింగ్‌ భూమిని తీసుకొని ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆలయం పరిసరాలను ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి, సర్పంచ్‌ రజితరమేశ్‌లు పరిశీలించి ఆలయ నిర్మాణం చర్చలు జరిపారు. 

సమస్యలు పరిష్కారం కానున్నాయి..

నా హయాంలో సీఎం కేసీఆర్‌ కొండపోచమ్మకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం పునర్నిర్మాణ పనులూ చేపట్టడం సంతోషంగా ఉంది. ఎన్నో ఏండ్లుగా భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం కానున్నాయి. నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌ సార్‌కు కృతజ్ఞతలు.

- కొండపోచమ్మ ఆలయ చైర్మన్‌,రాచమల్ల ఉపేందర్‌రెడ్డిlogo