సోమవారం 26 అక్టోబర్ 2020
Medak - Jun 17, 2020 , 00:19:11

కోరలు చాస్తున్న కరోనా రక్కసి

కోరలు చాస్తున్న కరోనా రక్కసి

n ఉమ్మడి జిల్లాలో ఒకేరోజు 19 కేసులు నమోదు

n మెదక్‌ జిల్లాలో కొత్తగా మరో పద్నాలుగు, సంగారెడ్డి జిల్లాలో 4 పాజిటివ్‌ కేసులు..

n సిద్దిపేట జిల్లాలో ఒక కేసు..

n మెదక్‌లో ఏఎన్‌ఎం, తూప్రాన్‌లో ఇద్దరు వైద్యులకు నిర్ధారణ

n పటాన్‌చెరులో పాజిటివ్‌ బారిన చేపల వ్యాపారి కుటుంబం

n జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు 

మెదక్‌/ పాపన్నపేట : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఒక్క మెదక్‌ జిల్లాలోనే మంగళవారం ఏకంగా పద్నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 28కి చేరాయని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు తెలిపారు. కరోనాతో సోమవారం సాయంత్రం తూప్రాన్‌కు చెందిన వ్యాపారి ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. మెదక్‌ జిల్లాలో కరోనాతో తొలి మరణం సంభవించడం ఇదే. జిల్లాలో గతంలో 14 మం దికి కరోనా పాజిటివ్‌ రాగా, అందులో ఐదుగురు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మిగతా వారు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా, మంగళవారం మరో 14 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో మెదక్‌కు చెందిన ఓ వ్యక్తిని వారం కింద కరోనా లక్షణాలతో సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానకు తరలించారు. ఆయన కుటుంబంలో ఐదుగురి రక్త నమూనాలు సేకరిం చి పరీక్షలు నిర్వహించగా.. తల్లి, భార్య, కూతురు, ఇద్దరు కొడుకులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కరోనాతో మృతిచెందిన తూప్రాన్‌ పట్టణానికి చెందిన  వ్యాపారి కుటుంబ సభ్యుల రక్తన మూనాలు సేకరించిన వైద్యాధికారులు, మంగళవారం మెదక్‌లోని నిర్ధారణ కేం ద్రంలో పరీక్షలు చేశారు.అందులో మృతుడి భార్యతో పాటు ఇద్దరు కొడుకులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు నిర్ధారించారు. పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి సబ్‌సెంటర్‌లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంకు, తూప్రాన్‌ సీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వైద్యులతో పాటు వారి తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మెదక్‌ పట్టణంలోని వెలుగు హాస్టల్‌లో పనిచేస్తున్న స్టాఫ్‌ నర్సు భర్తకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. ఇందులో కొంత మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతుండగా, మిగతా వారు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారని డీఎంహెచ్‌వో తెలిపారు. కాగా, సిద్దిపేట జిల్లాకేంద్రంలో మంగళవారం ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో 4 కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. 

కట్టుదిట్టంగా కంటైన్‌మెంట్‌ సెంటర్లు...

కరోనా కేసులు పెరుగుతుండడంతో కంటైన్‌మెంట్‌ కేంద్రాలు పెరుగుతున్నాయి. తూప్రాన్‌లో పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఇదివరకే కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. మెదక్‌ పట్టణంలో కూడా కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించి కట్టుదిట్టం చేస్తున్నారు. ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయా జోన్లలోకి ప్రజల రాకపోకలు నిలిపివేశారు. 

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 4 కేసులు.. 

సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలో కరోనా కేసులు కలవరం రేపుతున్నాయి. మంగళవారం జిల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు 4 నమోదు అయ్యాయని వైద్యాధికారులు తెలిపారు. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో 2 కేసులు నమోదు కాగా, వీరిని చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. హత్నూర మం డలం దౌల్తాబాద్‌లో ఒక కరోనా పాజిటివ్‌ కేసుగా గుర్తించి హైదరాబాద్‌ కింగ్‌కోఠి దవా ఖానకు తరలించారు. పటాన్‌చెరు మండలం బీడీఎల్‌ టౌన్‌షిప్‌లో ఒకరికి కరోనా పాజిటిట్‌ కేసు నమోదు కాగా, గాంధీకి పంపినట్లు వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో సోమవారం వరకు మొత్తం 76 కేసులు 76 నమోదు కాగా, కొత్తగా 4 కేసులతో కలిపి 76కు చేరుకున్నాయ. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. 

చేపల వ్యాపారి కుటుంబంలో ఇద్దరికి.. 

పటాన్‌చెరు: చేపలవ్యాపారి కుటుంబంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. పటాన్‌చెరు మం డలం ఇస్నాపూర్‌లో మార్కెట్‌ రోడ్డుపై చేపలు అమ్మే వ్యక్తి కుటుంబంలో భార్య(36), కూతురు (17)కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వ్యాపారి, అతని భార్య, కూతురును గాంధీ దవాఖానకు అధికారులు తరలించారు. 

కాకతీయనగర్‌లో మరొకరికి.. 

రామచంద్రాపురం : ఆర్సీపురం డివిజన్‌లోని కాకతీయనగర్‌లో రోడ్డునెం-4లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని బల్దియా ఉపకమిషనర్‌ బాలయ్య తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి నగరంలోని గ్లోబల్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. అతనికి ప్రైమరీ కాంటాక్ట్‌ అయిన వారిని కొండాపూర్‌లోని ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. కాలనీలో రెండు కరోనా కేసులు నమోదుకావడంతో  సోడి యం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. 

దౌల్తాబాద్‌లో ఒకరికి.. 

హత్నూర:  హత్నూర మండలం మేజర్‌ గ్రామ పంచాయతీ దౌల్తాబాద్‌లో ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్ధారించగా, మంగళవారం పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

మరో నాలుగురికి.. 

రాయపోల్‌: మండలంలో ఇటీవల సర్పంచ్‌కి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మంగళవారం సర్పంచ్‌ కుటుంబ సభ్యులకు జిల్లా డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో పవన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు చేయగా, నలుగురికి సభ్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు ధ్రువీకరించారు. 

హోం క్వారంటైన్‌లో తొమ్మిది మంది

చేర్యాల: ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన తొమ్మిది మందిని హోం క్వారంటైన్‌కి పంపించామని చేర్యాల సీహెచ్‌సీలోని పీపీపీ యూనిట్‌ హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మురళి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ నుంచి వ్యాపారులు, అస్సాం నుంచి ఆర్మీ ఉద్యోగి చేర్యాలలోని వారి గృహాలకు ఇటీవల రావడంతో వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు తెలిపారు.  

43మందికి హోంక్వారంటైన్‌

చిన్నశంకరంపేట: 43 మంది కార్మికులను హోంక్వారంటైన్‌కు పంపామని మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రావణి తెలిపారు. మండలంలోని కామా రం గ్రామ శివారులోని గర్గుస్టీల్‌ పరిశ్రమలో పనులు నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన 43 మంది కార్మికులను 14రోజుల పాటు హోంక్వారంటైన్‌కు పంపామన్నారు.

మిట్టపల్లిలో మరొకరికి కరోనా.. 

సిద్దిపేట అర్బన్‌: సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లిలో 70 ఏండ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ రాగా, మంగళవారం అతని భార్యకు పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటిని సిద్దిపేట ట్రాఫిక్‌ ఏసీపీ, ఇన్‌చార్జి సిద్దిపేట ఏసీపీ బాలాజీ, సిద్దిపేట రూరల్‌ ఎస్సై శంకర్‌, పోలీస్‌సిబ్బందితో కలిసి సందర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి కావాల్సిన అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు.   


logo