శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Jun 15, 2020 , 23:49:48

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

  • మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ శ్రీనివాస్‌

పెద్దశంకరంపేట: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీపీ జంగం శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు. అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పెద్దశంకరంపేటలో విద్యుత్‌ సాంకేతిక సమస్యతో పాటు అధికంగా వచ్చిన కరెంటు బిల్లుల ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించాలని విద్యుత్‌శాఖ ఏఈకి ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు సూచించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం సూచించిన పంటలను విత్తుకోవాలని వారు అన్నారు. రైతుబంధు, రూ.25 వేల రుణమాఫీపై రైతులకు అవగాహన కల్పించాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. మండల వైద్యాధికారి పుష్పలత ఎప్పుడు చూసినా దవాఖానలో కనిపించడం లేదని, గ్రామాల్లో సైతం పర్యటించడం లేదని, ఎంపీటీసీ దత్తు సభ దృష్టికి తీసుకువచ్చారు. పీహెచ్‌సీలో అందుబాటులో ఉండాలని, గ్రామాల్లో పర్యటించి కోవిడ్‌-19పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీపీ సూచించారు.  బుజ్రాన్‌పల్లి గ్రామంలో ఎస్సీకాలనీలో నీటిసమస్య ఉన్నదని, బుజ్రాన్‌పల్లి గ్రామ సర్పంచ్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు తెలిపారు. ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లో ఉపాధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ నెలలో ప్రారంభం కానున్న హరితహరాన్ని విజయవంతం చేయాలన్నారు. మండలంలో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని పీఆర్‌ఏఈ మొగులయ్యకు జెడ్పీటీసీ విజయరామరాజు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయరామరాజు, ఎంపీడీవో రాజమల్లయ్య, తహసీల్దార్‌ మనోహర్‌ చక్రవర్తి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.


logo