ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jun 15, 2020 , 23:29:18

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో చెక్‌డ్యాంల నిర్మాణాలు

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో చెక్‌డ్యాంల నిర్మాణాలు

  • n సంగారెడ్డిలో 11, మంజీర, హల్దీవాగులపై 15చెక్‌డ్యాంలు
  • n నిధులు మంజూరు చేసిన సర్కారు
  • n అన్నదాతకు అందననున్న సాగునీరు

మెదక్‌ / సంగారెడ్డి : తెలంగాణను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. ప్రతి నీటిబొట్టును అన్నదాతలు సాగుకు వినియోగించుకునే విధంగా చెక్‌డ్యాంలను నిర్మించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా వాననీరు నిల్వ ఉండే ప్రాంతాలను, వాగులు, వంకల్లో వృథాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేయడం కోసం అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి చెక్‌డ్యాంలను నిర్మిస్తున్నది. మెదక్‌లోని మంజీర, పసుపులేరు నదులపై 15చెక్‌డ్యాంలు, సంగారెడ్డిలో 11 చెక్‌డ్యాంలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వీటిలో కొన్ని చెక్‌డ్యాంలు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని చెక్‌డ్యాంల నిర్మాణాలు పూర్తి దశకు చేరుకున్నాయి. చెక్‌డ్యాంల నిర్మాణాలు శరవేగంగా జరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మంజీర, హల్దీవాగులపై చెక్‌డ్యాంలు..

మెదక్‌ జిల్లాలోని మంజీర, హల్దీవాగులపై 15 చెక్‌డ్యాంల నిర్మాణాలకు ఇటీవలే ఇరిగేషన్‌శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. వాటికి అనుమతులు మంజూరు చేయడంతో పాటు నిధులను కూడా కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో అధికారులు చెక్‌డ్యాంల నిర్మాణాలను చేపట్టారు. హవేళిఘనపూర్‌ మండలంలోని కూచన్‌పల్లిలో గతేడాదే చెక్‌డ్యాం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో ఆ పరిధిలోని రైతులు విస్తారంగా పంటలు పండించారు. హవేళిఘనపూర్‌ మండలం సర్దన గ్రామంలో నిర్మించనున్న మరో చెక్‌డ్యాంకు ఇటీవలే మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ వానకాలంలో పూర్తయిన చెక్‌డ్యాంలు నిండుకుండలా మారనున్నాయని అధికారులు చెబుతున్నారు. 

సంగారెడ్డిలో 11 చెక్‌డ్యాంల నిర్మాణం..

జిల్లాలో 11చెక్‌డ్యాంల నిర్మాణానికి  అధికారులు రూపకల్పన చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. దీంతో చెక్‌డ్యాం నిర్మాణాల కోసం రూ.45.55కోట్ల నిధులను మంజూరు చేసింది. 2018లో మంజీర నదిపై 4చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.23.86కోట్ల నిధులు కేటాయించింది. 2020లో మరో 7చెక్‌డ్యాంలను మంజూరు చేయడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మంజీరపై నాలుగు చెక్‌డ్యాంలు..

సంగారెడ్డి మండల పరిధిలోని మంజీర ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల్లో నీటి నిల్వలు పెంచేందుకు ప్రభుత్వం చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపట్టిన విషయం తెలిసిందే. 2018 సంవత్సరంలో జిల్లాలో నాలుగు చెక్‌డ్యాంలు మంజూరు కాగా, పసల్‌వాది శివారులోని మంజీర బ్రిడ్జి వద్ద నిర్మిస్తున్న చెక్‌డ్యాం పూర్తయింది. పసల్‌వాది - వెండికోల్‌ గ్రామాల వద్ద రూ.6.65 కోట్లతో చెక్‌డ్యాం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. హత్నూర మండలం పన్యాలలో రూ.7.81కోట్లతో నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులు 50 శాతం పూర్తయ్యాయని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. నవాపేట్‌ శివారులో రూ.7.85కోట్లతో చెక్‌డ్యాం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. 

టెండర్‌ ప్రక్రియలో ఏడు చెక్‌డ్యాంలు.. 

ప్రభుత్వం నుంచి జిల్లాకు మంజూరైన ఏడు చెక్‌డ్యాంలను అన్ని రకాల అనుమతులు ఇవ్వడంతో టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లాకు మంజూరైన చెక్‌డ్యాంల నిర్మాణ పనులను సంబంధిత కాంట్రాక్టర్లకు అప్పగించి నిర్మాణాలను త్వరగా చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన చెక్‌డ్యాంలు నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని సిర్గాపూర్‌ మండలం పోచాపూర్‌ గ్రామంలోని నల్లవాగుపై రూ.3.07కోట్లు, కల్హేర్‌ మండల కేంద్రంలోని నల్లవాగుపై రూ.1.65కోట్లు, అదేవిధంగా బీబీపేట గ్రామ శివారులో రూ.1.56కోట్లతో, మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామ శివారులో దబ్బవాగుపై రూ.1.95కోట్లు, బోడ్‌పల్లి గ్రామ శివారులో దబ్బవాగుపై రూ.1.92కోట్లు, హత్నూర మండలం లింగాపూర్‌ శివారులో మంజీర నదిపై రూ.6.37కోట్లు, రెడ్డిఖానాపూర్‌ శివారులో మంజీర నదిపై  చెక్‌డ్యాంల నిర్మాణాల కోసం రూ.6.17కోట్లు మంజూరు చేసింది. 

జిల్లాలో 15 చెక్‌డ్యాంలు.. 

మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 15 చెక్‌డ్యాంల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.119 .11కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఇప్పటికే 7 చెక్‌డ్యాంలు పూర్తి కాగా, ఇంకా 6 చెక్‌డ్యాంలు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 2 చెక్‌డ్యాంలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. 

- ఏసయ్య, ఇరిగేషన్‌ శాఖ ఈఈ , మెదక్‌ జిల్లాlogo