శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Jun 13, 2020 , 23:31:15

ఆదర్శ సాగులో.. జ’హీరో’బాద్‌ రైతన్న

ఆదర్శ సాగులో.. జ’హీరో’బాద్‌ రైతన్న

జహీరాబాద్‌:  సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు బిందుసేద్యం విధానంలో వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. అల్లం, ఆలుగడ్డ, పసుపు, అరటి, బొప్పాయి, చెరుకుతో పాటు కూరగాయలు సాగుచేసి పలు రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్‌ ధరలకు అనుగుణంగా పంటలు సాగుచేయడం, ఒక పంటను ఒకేసారి వేయకుండా 20రోజులు తేడాతో సాగు చేస్తున్నారు. దీంతో తీసే సమయంలో పంట ఒకేసారి వస్తే ధర ఉండదు. కూలీల సమస్య ఉంటుందని, వారం రోజుల నుంచి 20 రోజుల తేడాతో పండిస్తున్నారు. జహీరాబాద్‌ డివిజన్‌లోని జహీరాబాద్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌, కోహీర్‌, ఝరాసంగం మండలంలో రైతులు అధికంగా వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఇటీవల జహీరాబాద్‌ ప్రాంత రైతులు తాము పండించిన అల్లం పంటను తీసుకెళ్లి సీఎం కేసీఆర్‌కు చూపించి ఆయన చేత శభాష్‌ అనిపించుకున్న సంగతి తెలిసిందే. 

వాణిజ్య పంటలకు కేంద్రం...

జహీరాబాద్‌ ప్రాంతంలో గతంలో రైతులు అధికంగా చెరుకు పంట సాగు చేసేవారు. మార్కెట్‌లో చెరుకు పంటకు డిమాండ్‌ తగ్గిపోవడంతో పాటు చక్కెర పరిశ్రమలు సరైన ధర ఇవ్వకపోవడంతో రైతులు రానురాను సాగుకు విముఖత చూపుతున్నారు. చెరుకు పంటను తగ్గించుకొని, శీతాకాలంలో రైతులు అధికంగా ఆలుగడ్డను సాగు చేస్తున్నారు. 90 రోజుల్లో ఆలుగడ్డ పంట చేతికి వస్తున్నది. ఆలు విత్తనం తెలంగాణలో లేకపోవడంతో రైతులు ఢిల్లీ, ఆగ్రా నుంచి తీసుకువచ్చి సాగు చేస్తున్నారు. వానకాలంలో రైతులు తమ పొలంలో జనుము సాగు చేస్తున్నారు. జనుమును భూమిలో దున్ని ఆలుగడ్డ విత్తనం వేస్తున్నారు. తద్వారా భూసారం పెరిగి పంట దిగుబడి పెరుగుతుందని రైతులు తెలిపారు. ఎకరా భూమిలో ఆలు సాగు చేసేందుకు రైతులకు 7 క్వింటాల విత్తనం అవసరం పడుతుంది. ఎకరా భూమిలో ఆలు దిగుబడి 100 క్వింటాల వరకు వస్తుంది. విత్తనాన్ని రైతులు రూ. 500కు క్వింటాలు కొనుగోలు చేస్తున్నారు. పంట తీసి అమ్మకాలు చేసే సమయంలో మార్కెట్‌ డిమాండ్‌ చూసి రైతులు విక్రయిస్తున్నారు. ఆలు నిల్వ చేసేందుకు తెలంగాణలో శీతల గిడ్డంగులు లేవు. దీంతో పంటను తీసిన వెంటనే రైతులు మార్కెట్‌లో అమ్మకాలు చేస్తున్నారు. దీంతో పాటు పసుపు, బొప్పాయి, అరటి పంటలు సాగుచేస్తున్నారు. పుసుపును అధికంగా వికారాబాద్‌, హైదరాబాద్‌, కర్ణాటక, మహారాష్ట్రలో విక్రయిస్తున్నారు. బొప్పాయిని ఢిల్లీ మార్కెట్‌కు తరలిస్తున్నారు. వ్యాపారులు నేరుగా రైతుల పొలం వద్ద బొప్పాయిని కొనుగోలు చేసి ఢిల్లీ మార్కెట్‌కు తరలిస్తున్నారు. అరటి స్థానిక మార్కెట్‌తో పాటు హైదరాబాద్‌, బీదర్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. 

కూరగాయల సాగుకు మొగ్గు... 

కూరగాయలు సాగు చేసేందుకు ఎక్కువ మంది రైతులు ముందుకు వస్తున్నారు. కూరగాయలను సైతం బిందుసేద్యంతో సాగు చేస్తున్నారు. సీజన్‌లో ఏ పంట సాగు చేస్తే అధిక ధర ఉంటుందో, ఆ పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. టమాట, వంకాయ, బీర, మిర్చి, క్యాబేజీతో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. రైతులు పండించిన కూరగాయలను అధికంగా జహీరాబాద్‌, హైదరాబాద్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. సేంద్రియ ఎరువులు వేసి పంటలు సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులు తగ్గించి, సేంద్రియ ఎరువులతో సాగు చేయడంతో పెట్టుబడులు తగ్గుతున్నాయి. దీంతో పాటు కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నట్లు రైతులు తెలుపుతున్నారు.  

అల్లం సాగువైపు రైతుల చూపు... 

జహీరాబాద్‌ ప్రాంతంలో రైతులు అధికంగా ఈ ఏడాది అల్లం పంటను సాగు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో అధికంగా 5 వేల ఎకరాల్లో అల్లం పంటను రైతులు పండిస్తున్నారు. మార్కెట్‌లో అల్లం పంటకు మంచి డిమాండ్‌ ఉండడంతో రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సేంద్రియ ఎరువులను వాడి అల్లం పంటను పండిస్తున్నారు. ఎకరా భూమిలో అల్లం పంటను సాగుచేసేందుకు రైతులు రెండు నుంచి నాలుగు లారీల పశువుల ఎరువు వినియోగిస్తున్నారు. ఎకరా భూమిలో అల్లం సాగు చేసేందుకు 8 క్వింటాళ్ల విత్తనం అవసరం పడుతుంది. ఎకరంలో అల్లం సాగు చేసేందుకు రూ. 1.25 లక్షల వరకు రైతులకు ఖర్చు అవుతున్నది. 9 నెలల్లో అల్లం పంట తీసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఎకరం భూమిలో 70 నుంచి 100 క్వింటాల అల్లం దిగుబడి వస్తున్నది. రైతులు మార్కెట్‌లో క్వింటాలు అల్లం పంటకు రూ.4 వేల నుంచి 5 వేలకు  ధర వస్తున్నది. మార్కెట్‌ ధర ప్రకారం ఎకరం భూమిలో రైతు ఏడాదిలో రూ. 3.5 లక్షల అమ్మకాలు చేస్తారు. రైతు ఏడాదికి రూ. 1.25 లక్షలు ఖర్చు చేస్తే, రూ.2 లక్షల లాభం వస్తున్నది. దీంతో రైతులు అల్లం పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అల్లం పంటను తీసిన రైతులు.. హైదరాబాద్‌, నాగ్‌పూర్‌, కరీంనగర్‌, కర్ణాటక, మహారాష్ట్రలోని మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్నారు. అధికంగా హైదరాబాద్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. 

రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం..

జహీరాబాద్‌లో అల్లం సాగుచేసే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. రైతులు బిందుసేద్యంతో సాగు చేసేందుకు సబ్సిడీ ఇస్తున్నది. అల్లం పంట జహీరాబాద్‌లో 5,500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అధికంగా రైతులు జహీరాబాద్‌, కోహీర్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌, ఝరాసంగం మండలంలో సాగుచేస్తున్నారు. రైతులకు వాణిజ్య పంటల సాగుపై అవగాహన కలిపించి, అధిక దిగుబడులు సాధించేందుకు కృషి చేస్తున్నాం.  -అనూష, ఉద్యానశాఖ అధికారి, జహీరాబాద్‌


logo