సోమవారం 19 అక్టోబర్ 2020
Medak - Jun 13, 2020 , 00:35:04

పచ్చని పల్లెలే లక్ష్యం

పచ్చని పల్లెలే లక్ష్యం

  • ఆరో విడుత హరితహారానికి సన్నద్ధం
  •  19 నర్సరీల్లో మొక్కల పెంపకం
  • 7.15 లక్షలు సిద్ధం  

మెదక్‌ రూరల్‌ : భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధిహామీ ద్వారా అన్ని పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో మొత్తం 7 లక్షల 15 వేల మొక్కలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మొక్కలు ఎండిపోకుండా నిత్యం మొక్కలకు నీరందిస్తున్నారు. ఇటీవల కలెక్టర్‌ ధర్మారెడ్డితో పాటు డీఆర్డీవో శ్రీనివాస్‌ మండలంలోని నర్సరీలను సందర్శించి పరిశీలించారు. వర్షాలు కురువగానే ఆరో విడుత హరితహారం కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ దిశగా అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటూ నిరంతరం నర్సరీలను సందర్శించి తగు సూచనలు చేస్తున్నారు. 

ఖాళీ ప్రదేశాల్లో నాటేందుకు చర్యలు 

మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల ఆవరణాలతో పాటు ప్రభుత్వ భూముల్లో మొక్కలు నాటేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

అందుబాటులో 40 రకాలు..

నర్సరీల్లో 40 రకాల మొక్కలు పెంచుతున్నారు. కానుగ, చింత, టేకు, దానిమ్మ, మునుగ, జామ, బొప్పాయి, కరివేపాకుతో పాటు తదితర పూల మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. 

విరివిగా మొక్కలు నాటుతాం 

అన్ని గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించే ప్రదేశాలతో పాటు ఇంటి ఆవరణ, రహదారులకు ఇరువైపులా, వ్యవసాయ పొలాల గట్లపైన మొక్కలు నాటుతాం. మండలానికి ఇచ్చిన లక్ష్యం నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, ప్రజలు హరితహారంలో భాగస్వాములు కావాలి.                 -నారాయణ, ఏపీవో logo