గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Jun 13, 2020 , 00:32:08

కరోనా పాజిటివ్‌తో కలకలం

కరోనా పాజిటివ్‌తో కలకలం

రామాయం పేటలో బాధిత కుటుంబంతో పాటు 

60 మంది హోం క్వారంటైన్‌ థర్మల్‌ స్క్రీనింగ్‌, 

స్టాంపులు వేసిన వైద్య సిబ్బంది

ఇద్దరు చిన్నారులను చికిత్స

కోసం హైదరాబాద్‌కు తరలింపు

పరిసరాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ

రామాయంపేట : మెదక్‌ జిల్లా రామాయంపేటలో కరోనా కలకలం సృష్టించింది. పట్టణానికి చెందిన ఓ బట్టల వ్యాపారికి కరోనా పాజిటివ్‌ రావడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని గురువారం రాత్రి అతని కుటుంబీకులు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ దవాఖానకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. శుక్రవారం రామాయంపేట మున్సిపల్‌ పాలక వర్గం అప్రమత్తమై వ్యాపారి దుకాణం ఉన్న ప్రాంతం, నివాసముంటున్న 8,12 వార్డుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టింది. వ్యాపారి కుటుంబీకులతో పాటు దుకాణంలో పనిచేసే వ్యక్తులు, అద్దెకు ఉన్న వారికి 60 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు చేసి చేతులకు హోం క్వారంటైన్‌ స్టాంపు వేశారు.రెండు వార్డుల వాసులు ఎక్కడకు వెళ్లవద్దని పోలీస్‌, మున్సిపల్‌ శాఖ అధికారులు సూచించారు. 60 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. ఏ అవసరాలు వచ్చినా బయటకు రావొద్దని, అన్ని తాము సమకూరుస్తామని తెలిపారు. వ్యాపారి కూ తుర్లు ఇద్దరికి సైతం కరోనా టెస్టులు చేసి స్థానిక అధికారులు యశోద దవాఖానకు తరలించారు.రెండు వార్డుల కు రాకపోకలు సాగించకుండా దిగ్బంధించారు. ఇరు వైపు లా బారికేడ్లను ఏర్పాటు చేసి గ్రామ సేవకులను కాపలా గా ఉంచారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పట్టణంలో వ్యా పారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పరిస్థితిని మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, సీఐ నాగార్జున గౌడ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పుట్టి విజయలక్ష్మి సమీక్షించారు.

 ప్రభుత్వ దవాఖానలో సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ

 రామాయంపేటలోని ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం అగ్నిమాపక సిబ్బంది సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. నూతనంగా నిర్మాణం చేపట్టిన దవాఖానతో పాటు పాత దవాఖాన, 108 అంబులెన్సులో రసాయనాలతో పిచికారీ చేశారు. ఐసీఎస్‌ఎఫ్‌వో కిష్టయ్య, సిబ్బంది నరేందర్‌, చంద్రాగౌడ్‌, ఎల్లం, ప్రదీప్‌, నర్సాగౌడ్‌ పాల్గొన్నారు.

కిష్టయ్యపల్లిలో కలకలం

జిన్నారం : గడ్డపోతారం గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టయ్యపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం కొన్నేండ్లుగా మూసాపేట్‌ భరత్‌నగర్‌లో నివాసం ఉంటుంది. వారం క్రితం కుటుంబ పెద్ద కిష్టయ్యపల్లిలోని తన ఇంటికి వచ్చి రెండు రోజులు ఉండి పొలం పనులు చేయించి వెళ్లాడు. భరత్‌నగర్‌ వెళ్లిన మరుసటి రోజే దవాఖానలో చేరి చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం ఆయన మృతిచెందాడు. మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో కిష్టయ్యపల్లిలో కరోనా కలకలం రేపింది. గ్రామంలో ఆయన ఇంటి సమీపంలో శుక్రవారం సర్పంచ్‌ ప్రకాశ్‌చారి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది రసాయనాలు పిచికారీ చేశారు. మృతుడు గ్రామంలో ఉన్న సమయంలో ఎవరెవరిని కలిసాడో వీఆర్వో, వైద్య సిబ్బంది ఆరాతీస్తున్నారు.

గుడికందులలో అవగాహన

తొగుట : మండలంలోని గుడికందుల గ్రామంలో కరో నా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో మండల వైద్య, పంచాయతీ అధికారులు అప్రమత్తం అయ్యారు. మండ ల పంచాయతీ అధికారి రావూఫ్‌ అలీ శుక్రవారం గ్రా  మంలో పర్యటించి పారిశుధ్య కార్యక్రమాలతో పాటు రసాయనాలు పిచికారీ చేయించారు. సర్పంచ్‌ మల్లయ్య ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు గ్రామంలో చెత్తాచెదారం తొలగించి, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. తొగుట ఆయు ష్‌ వైద్యుడు నాగార్జున, సూపర్‌ వైజర్‌ స్వామి గ్రామంలో పర్యటించారు. కరోనా పాజిటివ్‌ బాధితుడి ఇంటిని హోం కార్వెంటైన్‌కు ఆదేశించారు. 

తూప్రాన్‌లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే 

తూప్రాన్‌ రూరల్‌ : తూప్రాన్‌ పట్టణంలో ఓ వ్యక్తికి కరో నా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో స్థానిక పీహెచ్‌సీ వైద్యురాలు భావన ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది శుక్రవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. పట్టణంలోని పలు కాలనీల్లోని ఇంటింటికీ తిరుగుతూ ఆయా కుటుంబాల్లోని సభ్యుల పేర్లు సేకరించారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే తమకు సమాచారం అందించాలని వైద్యురాలు భావన ప్రజలకు సూచించారు. సర్వేలో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

రెడ్‌జోన్‌గా శాంతినగర్‌ 

జహీరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు అధికారులు శుక్రవారం శాంతినగర్‌ను రెడ్‌జోన్‌గా ప్రకటించి రోడ్లు మూసివేశారు. కాలనీ వాసులు ఇండ్ల నుంచి బయటకు రాకుండా దిగ్బంధించారు. మున్సిపల్‌ అధికారులు రోడ్లు మూసివేసి, రసాయనాలు పిచికారీ వేశారు. కాలనీలో పారిశుధ్య పనులు చేపట్టారు. కరోనా వైరస్‌తో చనిపోయిన మహిళ కుటుంబా సభ్యులను క్వారంటైన్‌కు పంపించారు. జహీరాబాద్‌లో కరోనా పాజిటివ్‌తో మహి ళ మృతిచెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.  


logo