ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jun 11, 2020 , 02:56:28

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం

n అన్నదాత బాగు కోసమే నియంత్రిత సాగు విధానం

n వానకాలం సాగుకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

n 13వరకు ‘రైతుబంధు’ కోసం దరఖాస్తు చేసుకోవాలి

n యాసంగిలోగా రైతు వేదికలు సిద్ధం చేయాలి

n కరోనాపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి

n జిల్లా పరిషత్‌ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

n సంగారెడ్డి జడ్పీ నూతన భవనం ప్రారంభం 

‘సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రైతు సంక్షేమానికి తెలంగాణ సర్కారు అత్యంత ప్రాధాన్యమిస్తున్నది.. అన్నదాత బాగు కోసం యేటా రూ.70వేల కోట్లు వెచ్చిస్తున్నది.. రైతు సంక్షేమ కార్యక్రమాలతోనే గోదాముల్లో పట్టనంత పంట పండుతున్నది’.. అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డిలోని గోకుల్‌ ఫంక్షన్‌ హాలులో సంగారెడ్డి గణపతి చక్కెర పరిశ్రమ చెరుకు అభివృద్ధి మండలి, సదాశివపేట మార్కెట్‌ కమిటీ పాలక వర్గాల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అంతకు ముందు జడ్పీ సమావేశంలో పాలొన్నారు. జడ్పీ నూతన భవనాన్ని ప్రారంభించారు.

(సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ)

సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, రైతు సంక్షేమానికే సర్కారు ఏటా రూ.70 వేల కోట్లు వేచ్చిస్తున్నదని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జడ్పీ నూతన భవనంలో జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వ్యవసాయం, వైద్యం, ఉపాధి హామీలపై సమీక్ష నిర్వహించారు. వానకాలం పంటల సాగుకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌ల ద్వారా గ్రామాలకే ఎరువులు సరఫరా చేయాలన్నారు. జిల్లాలో 116 రైతు వేదికల నిర్మాణం యాసంగి వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. 

 ఎరువులు అందుబాటులో ఉండాలి

జిల్లాలో సాగుచేసిన పంటలకు వచ్చే నెల వరకు సరిపడా 39వేల టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. వైజాగ్‌ ఓడరేవుకు ఎరువులు వచ్చాయని, హమాలీల్లో ఒకరికి కరోనా రావడంతో బస్తాలు దింపడం ఇబ్బందిగా మారిందని, కరోనా నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని, అందుకే ముందు

 జాగ్రత్త పడాలని, సరిపడా ఎరువులు తెచ్చిపెట్టుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాకు 17 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా రాగా, 8 వేల వరకు రైతులు తీసుకున్నారని, మిగతా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి నరసింహరావు మంత్రికి చెప్పారు. రైతుల బాగుకోసమే ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని తెచ్చిందని, వానకాలంలో కత్తెర పురుగుతో మొక్కజొన్నకు నష్టం వాటిల్లుతుందని, అందుకే మొక్కజొన్న సాగు వద్దని ప్రభుత్వం సూచిస్తున్నదన్నారు. జహీరాబాద్‌ ప్రాంతంలో మొక్కజొన్నకు బదులు సోయాబీన్‌ సాగుచేస్తామంటున్న రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని జేడీఏ నరసింహరావును ఆదేశించారు.  3.62 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానుండగా, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు.

13 తేదీలోగా రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి..

ప్రతి రైతుకు ‘రైతుబంధు’ అందుతుందని మంత్రి భరోసానిచ్చారు. ఇప్పటికే రైతు బంధు అందుతున్న వారు మినహా పాసుపుస్తకాలు ఉండి, రైతుబంధు రాని వారు, కొత్త పాసుపుస్తకాలు వచ్చిన వారు ఈ నెల 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విషయం తెలియని వారికి చెప్పి దరఖాస్తు చేసుకునేలా చూసే బాధ్యత ఎంపీపీ, జడ్పీటీసీలదని మంత్రి అన్నారు. 

 రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయండి.. 

 మాట ప్రకారం ప్రభుత్వం రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేసిందని, మొదటగా రూ.25 వేల వరకు ఉన్న రుణాలను ఒకే సారి మాఫీ చేసిందని మంత్రి చెప్పారు. రూ.25 వేల లోపు రుణాలు ఉన్నవారు 25,503 మంది ఉన్నారని, వారికి రూ.30.53 కోట్లు చెల్లించాల్సి ఉండగా 9,352 మందికి అందించామని, మిగతా వారికి సంబంధించి కుటుంబ వివరాల సేకరణ ప్రక్రియ జరుగుతున్నదని జేడీఏ నరసింహరావు మంత్రికి వివరించారు. జిల్లాలో కొందరు రైతులకు ఆధార్‌ నంబర్లు లేకపోవడంతో ఇబ్బంది ఏర్పడుతున్నదన్నారు. ఆ ఇబ్బందులను అధిగమించి, అన్నీ పూర్తి చేస్తామని కలెక్టర్‌ హనుమంతరావు మంత్రికి చెప్పారు. ఇదిలా ఉండగా, పలు చోట్ల పందుల బెడద ఉన్నదని ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 

 యాసంగికి రైతు వేదికలు సిద్ధం చేయాలి

యాసంగి వరకు రైతు వేదికలను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో 116 వేదికలను స్థలాలు గుర్తించామని కలెక్టర్‌ చెప్పగా, ఒక్కో వేదిక నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 లక్షలు అందిస్తున్నదని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ నిధులకు మరిన్ని జోడించి పెద్దగా భవనాలను నిర్మిస్తే, వాటికి దాతల పేరు పెడతామని హామీ ఇచ్చారు. కిర్బీ, పెన్నార్‌ వంటి రేకుల కంపెనీలు జిల్లాలోనే ఉన్నాయని ఆ కంపెనీలతో మాట్లాడి తక్కువ రేటుకు వచ్చేలా చూసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. జిల్లాలో ఉపాధి హామీ పనులు బాగా సాగుతున్నాయని, రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో ఉన్నదన్న మంత్రి అధికారులను అభినందించారు. ఉపాధి హామీ నుంచి మేకలు, గొర్రెలు, కోళ్ల షెడ్లు నిర్మించుకోవాలని రైతులకు అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఉపాధి హామీ నుంచి చెరువుల పూడిక తీత పనులు చేపట్టాలని డీఆర్‌డీవో శ్రీనివాసరావుకు మంత్రి సూచించారు. 

 రైతు సంక్షేమానికి ఏటా రూ.70వేల కోట్లు

రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.70వేల కోట్లు వెచ్చిస్తున్నదని మంత్రి చెప్పారు. రైతుబంధుకు రూ.14వేల కోట్లు, ఉచిత కరెంట్‌కు రూ.10 వేల కోట్లు, రైతు బీమాకు రూ.1200 కోట్లు, పంటల మద్దతు ధరకు రూ.4వేల కోట్లు, విత్తన సబ్సిడీలకు రూ. 600 కోట్లు, రుణమాఫీకి రూ.6 వేల కోట్లు, రైతు వేదికలకు రూ.500 కోట్లు, ప్రాజెక్టులకు రూ.20 వేల కోట్లు, హార్టికల్చర్‌, ఇతర సబ్సిడీలకు ఇస్తున్నదన్నారు. రైతు సంక్షేమ విషయం ప్రభుత్వం నిధులకు వెనుకాడటం లేదని స్పష్టం చేశారు.  ఎమ్మెల్యేలు చెప్పినా వినిపించుకోకుండా, వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న జిల్లా వైద్య సిబ్బందిపై ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అడిగిన 48గంటల్లో పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ల ద్వారా గ్రామాలకు ఎరువులు సరఫరా చేస్తామని ప్రజాప్రతినిధులకు డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌ స్పష్టం చేశారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ జడ్పీ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపుతున్నట్లు కలెక్టర్‌ హనుమంతరావు వెల్లడించారు.

డీడీలు కట్టినవారికి గొర్రెలు ఇప్పించాలని వినతి 

సంగారెడ్డి టౌన్‌ : ప్రభుత్వం గొల్లకుర్మలకు అందజేస్తున్న గొర్రెల పథకానికి డీడీలు కట్టిన వారందరికీ గొర్రెలు ఇవ్వాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్‌ నాయకులు బుధవారం మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెల యూనిట్ల కోసం డీడీలు కట్టి రెండు సంవత్సరాలు అవుతుందన్నారు. సంగారెడ్డిలో 2562, సిద్దిపేటలో 526, మెదక్‌లో 800 యూనిట్లకు డీడీలు కట్టడం జరిగిందన్నారు.  వినతిపత్రం అందజేసిన వారిలో నవాబుగారి భూమయ్య, ఆదిలింగం యాదవ్‌, శ్రీహరి, గూడెం మల్లయ్య, పైతర మీనాక్షి సాయికుమార్‌, పార్వతి కృష్ణ  ఉన్నారు. 

సీఎం సహాయ నిధికి రూ.లక్ష విరాళం

సంగారెడ్డి : కరోనా బాధితులను ఆదుకోవాలని సీఎం సహాయ నిధికి రూ. లక్ష   చెక్కును  మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. బుధవారం సంగారెడ్డిలో నూతన జిల్లా పరిషత్‌ భవన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన  ఆయనకు ఎల్‌ఐసీ ఏంజెట్లు తమవంతు బాధ్యతగా విరాళాన్ని ఇచ్చారు.  మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ఎల్‌ఐసీ ఏజెంట్లు ఉన్నారు. 

 జడ్పీ నూతన భవనం ప్రారంభం

జడ్పీ నూతన భవనాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం అదే భవనంలో మొదటి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి నూతన జడ్పీ వేదిక కావాలని మంత్రి ఆకాంక్షించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా, ఎవరికి వారు జాగ్రత్త వహించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, మదన్‌రెడ్డి, క్రాంతి కిరణ్‌, కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, జడ్పీ సీఈవో రవి తదితరులు పాల్గొన్నారు.logo