శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Jun 10, 2020 , 23:57:01

వర్షం.. హర్షం

వర్షం.. హర్షం

ఉమ్మడి జిల్లాల్లో కురిసిన వర్షం..  సంతోషం వ్యక్తంచేసిన రైతన్నలు

బంగాళాఖాతంలో  ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాల్లోని పలు మండలాల్లో బుధవారం వర్షం కురిసింది. ఈ వర్షంతో  రైతుల్లో ఆశలు చిగురించాయి. కొన్నిచోట్ల రైతులు దుక్కులు సాగుకు సిద్ధం చేయగా, మరికొన్ని చోట్ల విత్తనాలు వేస్తున్నారు.  పలు ప్రాం తాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేల కూలాయి.

సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలో బుధవారం వర్షం కురిసింది. రైతులు  పొలం పనులు చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కొన్నిచోట్ల దుక్కులు దున్ని విత్తనాలు వేస్తున్నారు.ప్రభుత్వం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబా టులో ఉంచింది.  

తూప్రాన్‌ పట్టణంలో... 

తూప్రాన్‌ రూరల్‌: తూప్రాన్‌ పట్టణంతోపాటు మండలంలోని కిష్టాపూర్‌, ఘనపూర్‌, యావాపూర్‌, వెంకటాయపల్లి, ఇస్లాంపూర్‌ తదితర గ్రామాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరాల్లో అంతరాయం ఏర్పడింది.

న్యాల్‌కల్‌లో..

న్యాల్‌కల్‌: మండలంలోని హద్నూర్‌, రుక్మాపూర్‌, రాంతీర్థం, గంగ్వార్‌ తదితర గ్రామాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. రైతులు విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకొని వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. 

కౌడిపల్లిలో.. 

కౌడిపల్లి : కౌడిపల్లి మండల కేంద్రంలో  ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఈ వర్షం దుక్కిలు దున్నడానికి ఎంతగానో ఉపయోగపడుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.