ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jun 10, 2020 , 23:54:28

ఒకేరోజు 9 పాజిటివ్‌

ఒకేరోజు 9 పాజిటివ్‌

- చికిత్స పొందుతున్న  14మంది బాధితులు

-అప్రమత్తమైన వైద్యాధికారులు

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో బుధవారం ఒక్కరోజే 9 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 23 కేసులుండగా కొత్తగా మరో తొమ్మిది నమోదు కావడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో నమోదైన కేసుల్లో 14మంది గాంధీ దవాఖాన, సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తొమ్మిది మంది హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఇప్పటికే జీఎచ్‌ఎంసీ పరిధిలోని అమీన్‌పూర్‌, ఆర్‌సీపురంలో 3 కేసులుండగా బుధవారం ఆర్‌సీపురం సాయినగర్‌లో 4, సదాశివపేట మండలం ఆరూర్‌లో 5 కేసులు వచ్చాయని సమాచారం. మూడు రోజుల క్రితం ఆరూర్‌ గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ప్రచారం జరుగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలోని బాధితుని నివాస ప్రాంతంతోపాటు వీధుల్లో సోడియం హైడ్రోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు.  

మూడునెలల బాలుడికి కరోనా..

వట్‌పల్లి : మండలంలోని కొడేకల్‌ గ్రామానికి చెందిన మూడునెలల బాలుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తాలెల్మ పీహెచ్‌సీ వైద్యురాలు సంధ్య బుధవారం తెలిపారు. కాగా బాబు తల్లిదండ్రుల వైద్య పరీక్షలకు సంబంధించి రిపోర్ట్స్‌ రావాల్సి ఉందన్నారు. అందోల్‌ మండలం కొడేకల్‌ గ్రామానికి చెందిన దంపతులకు మూడు నెలల క్రితం బాబు జన్మించాడు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో సంగారెడ్డిలోనే ఉంటూ ఓ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో వైద్యులు బాబును మంగళవారం హైదరాబాద్‌ నిలోఫర్‌కు పంపారు. అక్కడ జరిపిన పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే గాంధీ దవాఖానాకు తరలించి, తల్లిదండ్రుల శాంపిల్స్‌ తీసుకున్నారు. బుధవారం వైద్యసిబ్బంది కొడేకల్‌ గ్రామానికి వెళ్లి బాధితులతో సన్నిహితంగా ఉన్నవారి వివరాలు సేకరించారు. పాజిటివ్‌ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారందరినీ గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తామన్నారు. 

ఆర్సీపురంలో కలకలం..

రామచంద్రాపురం : ఆర్సీపురం డివిజన్‌లోని శ్రీనివాస్‌కాలనీ పరిధిలో ఉండే కాశిరెడ్డిపల్లిలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని బుధవారం బల్దియా ఉపకమిషనర్‌ బాలయ్య, పీహెచ్‌సీ డాక్టర్‌ రజినీ తెలిపారు. 1వ తేదీన ఆ మహిళ నగరంలోని బోయిన్‌పల్లిలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. 8వ తేదీన ఆరోగ్యం బాగా లేకపోవడంతో కాంటినెంటల్‌ దవాఖానకు వెళ్లడంతో అక్కడ వైద్యులు పాజిటివ్‌గా నిర్ధారించారని అధికారులు తెలిపారు. 

అమీన్‌పూర్‌లో మరొకరికి..

అమీన్‌పూర్‌ : అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలో ఎన్‌ఎస్‌ఎల్‌ కాలనీకి 32ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు బుధవారం గుర్తించారు. ఆయన గచ్చిబౌలిలోని నోవా కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు.


logo