బుధవారం 21 అక్టోబర్ 2020
Medak - Jun 10, 2020 , 04:03:46

రంది లేదిక!

రంది లేదిక!

n రైతులకు అందుబాటులో ఎరువులు, విత్తనాలు 

n జోరుగా కొనుగోలు చేస్తున్న రైతులు 

n గ్రామాల వారీగా పంటల సాగు వివరాలు  సేకరిస్తున్న వ్యవసాయ శాఖ 

n జిల్లాలో వానకాలం సాగు అంచనా 4,99,963 ఎకరాలు

n అత్యధికంగా పత్తి 2,73,401 ఎకరాల్లో సాగుకు ప్రణాళిక

n వరి 1,50,368 ఎకరాల్లో.. 60శాతం సన్నరకం  సాగు ప్రణాళిక  ఖరారు  

n విత్తనాలు కొనుగోలు చేసిన రసీదును  భద్రపర్చుకోవాలి : అధికారులు 

వానకాలం సాగుకు గాను రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. నియంత్రిత సాగును  ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, ఆ మేరకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను సరఫరా చేస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 347 లైసెన్స్‌ పొందిన దుకాణాల ద్వారా రైతులకు వీటిని అందిస్తున్నారు. ఇటీవల జిల్లాలో అక్కడక్కడ కురిసిన తొలకరి వర్షాలకు రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. గ్రామాల వారీగా పంటల వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరిస్తున్నారు. జిల్లాలో 4,99,963 ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేసేందుకు వ్యవసాయశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో 1,50,368 ఎకరాల్లో వరి, 2,73,401 ఎకరాల్లో పత్తి, 70,120 ఎకరాల్లో కందులు, మిగతా పంటలు సాగు చేయనున్నారు.

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : 

సిద్దిపేట జిల్లాలో నియంత్రిత పద్ధతిలో భాగంగా వరి, పత్తి, కందులు, జొన్నలు, పెసర్లు, మినుములు, ఆముదాలు ఇతర పంటలు సాగుచేయాలని ప్రభుత్వం సూచించింది. వానకాలంలో మొక్కజొన్న ఆశించిన దిగుబడి రాదు. యాసంగిలో మొక్కజొన్న వేసుకోవాలని రైతులకు వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. 1,50,368 ఎకరాల్లో వరి సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు.  ఇందులో 60శాతం సన్నరకాలు సాగుచేయాలని రైతులకు ప్రభుత్వం సూచించింది. 2,73,401 ఎకరాల్లో పత్తి, 70,120 ఎకరాల్లో కందులు, 710 ఎకరాల్లో జొన్నలు, 2,504 ఎకరాల్లో పెసర్లు, 540 ఎకరాల్లో మినుములు, 505 ఎకరాల్లో ఆముదాలు, 1,815 ఎకరాల్లో ఇతర పంటలు.. మొత్తం జిల్లాలో 4,99,963 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించింది. ఈ పంటలకు గాను 41,025 మెట్రిక్‌ టన్నుల యూరియా, 22,791 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 13,324 మెట్రిక్‌ టన్నుల ఎంవోపీ, 36,466 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరం ఉంటాయని ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ మేరకు జిల్లాకు ఎరువులు, విత్తనాలను అధికారులు అందుబాటులో ఉంచారు. జిల్లాలో ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన 347 కేంద్రాల నుంచి రైతులకు విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. 

వరి సాగు 1,50,368 ఎకరాల్లో.. 

సిద్దిపేట జిల్లాలో 1,50,368 ఎకరాల్లో వరిసాగు చేయనున్నారు. దీంట్లో 60శాతం.. 90,200 ఎకరాల్లో సన్నరకం వరి సాగు  చేయనున్నారు. ప్రభుత్వం జిల్లాకు సరిపడా విత్తనాలను పంపిణీ చేసింది. తెలంగాణ సోనా 40,428 ఎకరాల్లో చేయనున్నారు. ఇందుకు గాను 10,107 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. బీటీ -5204 రకం 10,245 ఎకరాల్లో సాగు చేస్తారు. ఇందుకు 2,561 క్వింటాళ్ల విత్తనాలు, ప్రైవేటు హైబ్రిడ్‌ విత్తనాలైన (జైశ్రీరామ్‌, కావేరిచింటు, గంగా కావేరి, ఇతర రకాలు) 49,220 ఎకరాల్లో సాగుకు గాను 4,922 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచారు. రైతులు ఇప్పటికే ఆయా సెంటర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. 

 తెలంగాణ సోనా...

తెలంగాణ సోనా సాగుకు జూలైలో నార్లు పోయాలని జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది. ఈ పంట వానకాలం, యాసంగి సీజన్లకు అనుకూలమైంది. నారు పోసిన 20 రోజుల తర్వాత దీనిని నాటుకోవాలి. తక్కువ నత్రజనితో అధిక దిగుబడినిస్తుంది. అన్నం నాణ్యత, రుచిని కలిగి ఉంటుంది. అగ్గి తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాలపరిమితి తక్కువే. వానకాలంలో 125 రోజులు, యాసంగిలో 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరానికి సుమారుగా 25 నుంచి 30 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. గింజ సన్నగా ఉంటుంది. బియ్యం శాతం 67 నుంచి 70మధ్యన ఉంటుంది. అమైలోజ్‌ 20శాతం, ప్రోటీన్‌ 8 శాతం, ైగ్లెసిమిక్‌ సూచి 51శాతం ఉంటుంది. తెలంగాణ సోనా ప్రత్యేకత అగ్గితెగులును తట్టుకొని పొట్టకుళ్లు తెగులును సైతం కొంత వరకు తట్టుకుంటుంది. తెలంగాణ సోనా ధాన్యంలో గ్లూకోజ్‌ శాతం తక్కువగా ఉండడంతో మధుమేహ(షుగర్‌) వ్యాధిగ్రస్తులకు అనుకూలం. దీంతో బ్లడ్‌ గ్లూక్లోజ్‌ లెవల్స్‌ పెరగవు.  

పల్లెలకు ఎరువులు... 

జిల్లావ్యాప్తంగా ముందస్తుగానే రైతులకు ప్రభుత్వం ఎరువులను అందుబాటులో ఉంచింది. అనుమతి పొందిన డీలర్ల నుంచి, సొసైటీల ద్వారా ఎరువులను అందిస్తున్నారు. యూరియా, డీఏపీ, ఎంవోపీ, ఎస్‌ఎస్‌పీ, కాంప్లెక్స్‌ అన్ని ఎరువులు కలిపి 25,433 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే 9,964 మెట్రిక్‌ టన్నుల ఎరువులను రైతులు కొనుగోలు చేశారు. యూరియా 13,506 మెట్రిక్‌ టన్నులు రాగా.. 4,140 మెట్రిక్‌ టన్నులు రైతులు కొనుగోలు చేశారు. డీఏపీ 1,478 మెట్రిక్‌ టన్నులకు గాను.. 472 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 1,064 మెట్రిక్‌ టన్నులకు గాను 560 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ 9,385 మెట్రిక్‌ టన్నులకు గాను 4,771 మెట్రిక్‌ టన్నుల ఎరువులను రైతులు కొనుగోలు చేశారు. 

2,73,401 ఎకరాల్లో పత్తి సాగు అంచనా 

ఈ వానకాలంలో జిల్లాలో 2,73,401 ఎకరాల్లో పత్తి సాగుచేయాలని వ్యవసాయశాఖ లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందుకు గాను 5,46,802 పత్తి ప్యాకెట్లు అవసరమవుతాయి. 5,57,093 పత్తి ప్యాకెట్లను జిల్లాలో అందుబాటులో ఉంచారు. 1,35,753 పత్తి ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారు. ఎకరానికి రెండు వరకు ప్యాకెట్లు అవసరమవుతాయి. ఒక్కో పత్తి ప్యాకెట్‌ 450 గ్రాములు ఉంటుంది. అత్యధికంగా గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, చేర్యాలలో ఎక్కువగా కొనుగోలు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారుల లెక్కల ద్వారా తెలిసింది. 

70,120 ఎకరాల్లో కంది సాగు అంచనా.. 

వానకాలంలో జిల్లాలో కంది సాగును ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఈసారి 70,120 ఎకరాల్లో సాగు అంచనా పెట్టుకున్నారు. ఇందుకు గాను 2,805 క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరపడుతాయి. ఈ మేరకు జిల్లాలో విత్తనాలను అందుబాటులో ఉంచారు. జూలైలో కందులు వేసుకునే అవకాశం ఉంటుంది. 

రైతులకు అందుబాటులో ఎరువులు, విత్తనాలు.. 

జిల్లాలో నియంత్రిత పద్ధతితో సాగుచేయ డానికి రైతులు ముందుకు వస్తున్నారు. 4,99,963 ఎకరాల్లో వివిధ పంటల సాగు అంచనా ఉంది. దీంట్లో 1,50,368 ఎకరాల్లో వరి సాగుకు గాను 60శాతం సన్నరకం సాగు అంచనా. ఇప్పటికే గ్రామాల వారీగా నియంత్రిత సాగు పై అవగాహన సదస్సులు నిర్వహించాం. ప్రధానంగా తెలంగాణ సోనా సాగును ప్రోత్సహిస్తున్నాం. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ప్రత్యేకంగా నిఘా పెట్టాం. రైతు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రసీదు తప్పనిసరి తీసుకోవాలి. పంట కాలం పూర్తయ్యే వరకు ఆ రసీదును భద్రంగా పెట్టుకోవాలి. నిరంతరం ఏవోలు, ఏఈవోలు పర్య వేక్షిస్తున్నారు. 

- శ్రవణ్‌కుమార్‌, 

జిల్లా వ్యవసాయశాఖ అధికారి, 

సిద్దిపేట  


logo