శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Jun 10, 2020 , 00:06:37

సైక్లింగే అతడికి ప్రాణం..

 సైక్లింగే అతడికి ప్రాణం..

n జాతీయస్థాయిలో రాణిస్తున్న ఉదయ్‌కుమార్‌ 

n స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ అకాడమీలో చేరిక 

n ఐదుసార్లు దక్కిన మెడల్స్‌ 

n ఆరుసార్లు  జాతీయస్థాయి చాంపియన్‌షిప్‌లో పోటీ

n ఒలింపిక్‌, ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు నిత్య సాధన

సైక్లింగ్‌ అంటే అతడికి ప్రాణం.. నిత్య సాధనతో రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలోనూ రాణిస్తున్నాడు. సికింద్రాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ అకాడమీలో సీటు సంపాదించి అంతర్జాతీయంగా రాణించేందుకు ముందుకెళ్తున్నాడు. ఒలింపిక్‌, ఆసియా క్రీడలే లక్ష్యంగా నిత్యసాధన చేస్తున్నాడు హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన వరయోగుల ఉదయ్‌కుమార్‌.

హుస్నాబాద్‌ : నిరుపేద కుటుంబానికి చెందిన వరయోగుల అనంతస్వామి-లావణ్య దంపతుల రెండో కుమారుడు ఉదయ్‌కుమార్‌. చిన్నప్పటి నుంచి ఇష్టంగా చేసే సైకిల్‌ రైడింగ్‌ ‘శాట్స్‌' అకాడమీకి చేర్చింది. కోచ్‌ల సహకారంతో జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొన్నాడు. ఆర్థిక స్థోమత అంతంత మాత్రమైనా తండ్రి అనంతస్వామి రోడ్‌రేస్‌ సైకిల్‌ను కొనిచ్చాడు. రూ.లక్షలు ఖరీదు చేసే ట్రాక్‌రేస్‌ సైకిల్‌ను  కొనేందుకు ఎవరైనా దాతలు ఆదుకుంటే అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లోనూ సత్తా చాటుతానంటున్నాడు ఉదయ్‌కుమార్‌.

2017లో శాట్స్‌కు ఎంపిక.. 

ఉదయ్‌కుమార్‌ పదో తరగతి చదువుతున్న సమయంలో 2017 మార్చి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌ అకాడమీ(శాట్స్‌)కు ఎంపికయ్యాడు ఉదయ్‌కుమార్‌. తక్కువ సమయంలోనే రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభను చాటాడు. జూనియర్‌ విభాగంలో అకాడమీ తరఫున అనేక చాంపియన్‌షిప్‌ల్లో పాల్గొన్నాడు. ఇంటర్‌ చదువుతూనే పోటీల్లో రాణిస్తున్నాడు. అకాడమీ కోచ్‌ విజయభాస్కర్‌రెడ్డి, వార్డెన్‌ విజయ్‌కుమార్‌ ప్రోత్సాహంతో సైక్లింగ్‌లో ముందుకు సాగుతున్నాడు. 

జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌లలో.. 

n 2019లో మహారాష్ట్రలో జాతీయస్థాయి ట్రాక్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో మూడో స్థానం

n ఎస్‌జీఎఫ్‌ రోడ్‌ రేస్‌ చాంపియన్‌షిప్‌లో ఏడోస్థానం.

n ట్రాక్‌రేస్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానం.

n 2018 ఎస్‌జీఎఫ్‌ ట్రాక్‌సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఐదోస్థానం.

n 2019లో రాజస్థాన్‌లో జరిగిన ట్రాక్‌రేస్‌ చాంపియన్‌షిప్‌లో మూడోస్థానం.

n అస్సాంలోని గుహావటిలో జరిగిన ఖేలో ఇండియా ట్రాక్‌రేస్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానం.

n రంగారెడ్డి జిల్లాలో 2018లో జరిగిన రాష్ట్రస్థాయి మాస్‌స్టార్ట్‌ అండర్‌-16 విభాగం పోటీల్లో గోల్డ్‌మెడల్‌ కైవసం.

n రంగారెడ్డి జిల్లాలో జరిగిన  ఎస్‌జీఎఫ్‌ ట్రాక్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లోనూ గోల్డ్‌ మెడల్‌.

అంతర్జాతీయ క్రీడల్లో సత్తాచాటాలని ఉంది.. 

ఒలింపిక్స్‌, ఆసియా క్రీడల్లో సత్తా చాటాలని ఉంది. తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అకాడమీ వార్డెన్‌ విజయ్‌కుమార్‌, కోచ్‌ విజయ్‌భాస్కర్‌రెడ్డి నిత్యం సాధన చేయిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ పతకాలు సాధించాను. తెలంగాణ సర్కార్‌ సహకరించి ట్రాక్‌ సైకిల్‌తో పాటు సూట్‌ను అందించాలని కోరుతున్నా. - ఉదయ్‌కుమార్‌ 


logo