బుధవారం 21 అక్టోబర్ 2020
Medak - Jun 09, 2020 , 00:54:52

కరోనా.. భయాందోళన

కరోనా.. భయాందోళన

n తూప్రాన్‌ పట్టణంలో మున్సిపల్‌ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

n ఆర్సీపురంలో ఒకరికి.. 

n ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 66 మంది హోంక్వారంటైన్‌  

తూప్రాన్‌ రూరల్‌/రామచంద్రాపురం/పెద్దశంకరంపేట/చిన్నశంకరంపేట/సంగారెడ్డి: తూప్రాన్‌ మున్సిపాలిటీలో వాటర్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్‌ దవాఖానకు వెళ్లాడు. సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గాంధీ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న తూప్రాన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది కాలనీలో పర్యటించారు. అతడితో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న 13 మందిని గుర్తించడంతో పాటు సెకండరీ కాంటాక్ట్‌లో ఉన్న 44 మంది, ముగ్గురు మున్సిపల్‌ సిబ్బందిని హోంక్వారంటైన్‌లో ఉంచారు.  

మున్సిపల్‌ చైర్మన్‌తో  డాక్టర్‌ భావన సమావేశం

మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌తో పీహెచ్‌సీ డాక్టర్‌ భావన సమావేశం నిర్వహించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తి ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యారో వారి వివరాలు అందించాలని తెలిపారు. మున్సిపల్‌ సిబ్బంది, ఉద్యోగులు భౌతిక దూరం పాటించాలని మున్సిపల్‌ చైర్మన్‌కు డాక్టర్‌ భావన సూచించారు.

ప్రభుత్వ కార్యాలయవర్గాల్లో కలవరం...

తూప్రాన్‌ పట్టణంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ప్రభుత్వ కార్యాలయ వర్గాల్లో కలవరం మొదలైంది. ఆర్డీవో, తాసిల్దార్‌ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్తున్న వ్యక్తులకు శానిటేషన్‌ చేస్తూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. అత్యవసర పనుల నిమిత్తం మాత్రమే కార్యాలయాలకు రావాలని, అవసరమైతే ఫోన్‌లో వివరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్సీపురం డివిజన్‌లోని సాయినగర్‌ కాలనీలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు బల్దియా ఉపకమిషనర్‌ బాల య్య తెలిపారు. శేరిలింగంపల్లిలోని రైతుబజార్‌లో చేపల వ్యాపారం నిర్వహించే వ్యక్తికి మొదట జ్వరం రావడంతో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ వైద్యు లు అతడి రక్త నమూనా పంపించడంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆదివారం రిపోర్టు వచ్చిందని ఉపకమిషనర్‌ తెలిపారు. దీంతో అధికారులు ఆ వ్యక్తిని గాంధీ దవాఖానకు తరలించగా, అతడి తల్లిదండ్రులను సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు పంపించారు. సోమవారం  అదనపు కలెక్టర్‌ రాజర్షి షా కాలనీని సందర్శించారు. పెద్దశంకరంపేట మండలంలోని కమలాపురం గ్రామంలో ఐదుగురిని హోంక్వారంటైన్‌ చేసినట్లు తాసిల్దార్‌ మనోహర్‌ చక్రవర్తి, ఎస్సై సత్యనారాయణ తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలోని కామారం గిరిజన తండాకు చెందిన వ్యక్తి దుబాయ్‌ నుంచి గ్రామానికి రావడంతో అతడిని హోంక్వారంటైన్‌లో ఉంచారు. సదా శివపేట మండలం ఆరూర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌  వచ్చిందని కలకలం రేగింది. అధికారులు అప్రమత్తమై  అతడి ఇంటి పరిసరాల్లో  సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. గ్రామస్తులు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. logo