శుక్రవారం 30 అక్టోబర్ 2020
Medak - Jun 08, 2020 , 00:21:58

పల్లెలు, పట్టణాలు శుభ్రం

పల్లెలు, పట్టణాలు శుభ్రం

నేటితో ముగియనున్న పారిశుధ్య కార్యక్రమాలు 

అధికారులు, ప్రజాప్రతినిధులు,  ప్రజల భాగస్వామ్యంతో ముందుకు..

గ్రామాలు, మున్సిపాలిటీల్లో  ముమ్మరంగా స్పెషల్‌ డ్రైవ్‌

మెదక్‌ : జిల్లాలోని పల్లెలు, మున్సిపల్‌ పట్టణాలు పరిశుభ్రంగా మారాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన పారిశుధ్య కార్యక్రమాలు నేటితో ముగియనున్నాయి. ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు స్వచ్ఛందంగా పాల్గొని చెత్తాచెదారాన్ని తొలగించారు. సీజన్‌ వ్యాధులు సోకకుండా జాగ్రత్తగా ఉండాలన్న ప్రభుత్వ సూచన మేరకు పల్లెల్లో వీధివీధిని శుభ్రం చేశారు. డెంగీ, స్వైన్‌ఫ్లూ, విష జ్వరాలు రాకుండా పట్టణాలను పరిశుభ్రం చేసేందుకే ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ కార్యక్రమ ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. 

పల్లెల్లో...

మెదక్‌ జిల్లాలోని 469 గ్రామపంచాయతీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో వాటర్‌ ట్యాంక్‌లను క్లోరినేషన్‌ చేయడం, చెత్తాచెదారాన్ని తొలగించడం, రోడ్లను శుభ్రం చేయడం, వార్డుల్లో మిగిలిన పనులను పూర్తి చేయడం, గుంతలమయంగా ఉన్న రోడ్లను పూడ్చడం వంటి  పనులను చేస్తున్నారు. పల్లె ప్రగతి పనులతో గ్రామాల రూపురేఖలు మారాయి.  రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను మంజూరు చేయడం పల్లెలకు వరంగా మారింది. తాగునీటి సరఫరా, డ్రైనేజీల నిర్మాణాలు, డంపుయార్డులు తదితర  మౌలిక సదుపాయాలకు నిధులను కేటాయించింది. దీంతో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు ఉత్సాహంగా పనిచేస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించారు. గత ఏడాది సెప్టెంబర్‌ 6వ తేదీ నుంచి అక్టోబర్‌ 5 వరకు 30 రోజుల ప్రత్యేక పల్లె ప్రగతి కార్యక్రమం కొనసాగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా జనవరి 2వ తేదీ నుంచి 11 వరకు రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు, ట్యాంకర్‌, ట్రాలీలు ఇవ్వడంతో పారిశుధ్యంతోపాటు పచ్చదనాన్ని పెంచేందుకు ఉపయోగపడింది. 

జిల్లాలోని మున్సిపాలిటీల్లో...

మెదక్‌ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు మెదక్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌, రామాయంపేట ఉన్నాయి. మున్సిపాలిటీల్లో ముఖ్యంగా శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. రోడ్లపై చెత్తా చెదారం వేయకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గత పట్టణ ప్రగతిలో మున్సిపాలిటీలను స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దారు. మూడో విడుత పల్లెప్రగతిలో భాగంగా ముఖ్యంగా డ్రైనేజీలు, మురుగు కాల్వలు, తాగునీటి సరఫరా, రోడ్లకు ఇరువైపులా ఉన్న కలుపుమొక్కలను తొలగిస్తున్నారు. వానకాలంలో దోమలు వృద్ధి చెందకుండా డ్రైనేజీల్లో ఆయిల్‌ బాల్స్‌ వదులుతున్నారు. అంతేకాకుండా ప్రతి రోజు సాయంత్రం ఫాగింగ్‌ మిషన్‌తో ఫాగింగ్‌ చేస్తున్నారు.