బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Jun 08, 2020 , 00:10:44

దర్శనానికి వేళాయె

దర్శనానికి వేళాయె

నేటి నుంచి తెరుచుకోనున్న ఆలయాలు

పుణ్యక్షేత్రాలను శుద్ధి చేయించిన ఆలయవర్గాలు

ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు దర్శనాలు

సిద్ధంగా ఉన్న శానిటైజర్లు, థర్మల్‌ స్క్రీన్‌ గన్స్‌, ఫేస్‌మాస్క్‌లు

పాపన్నపేట : మెదక్‌ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయల వనదుర్గాభవానీమాత ఆలయాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించి రావాలని ఈవో శ్రీనివాస్‌ వెల్లడించారు. భక్తులు పాదరక్షలను తమ వాహనాల్లోనే వదిలి, దర్శనానికి రావాలని, ఆరు అడుగుల మేర దూరం పాటించాలని, ఆలయంలోకి వెళ్లేటప్పుడు శానిటైజర్లు ఉపయోగించాలని తెలిపారు. అమ్మవారి దర్శనం చేసుకునే వారికి శఠగోపం పెట్టడం గానీ, తీర్థప్రసాదాలు అందజేయడం.. బొట్టు పెట్టడం జరుగదన్నారు. లడ్డూప్రసాదం మాత్రం నిర్ణీత కేంద్రాల్లో అమ్మనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ధర్మసత్రాలు అందుబాటులో ఉండవన్నారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని భక్తులు సహకరించాలని కోరారు. నేటి నుంచి అమ్మవారి ఆలయం తెరువనుండడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వర్గల్‌ : సిద్దిపేట జిల్లా వర్గల్‌ విద్యాధరి సరస్వతీ అమ్మవారు, నాచగిరి లక్ష్మీ నృసింహస్వామి నేటి నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు. కరోనా నేపథ్యంలో మూతపడిన ఆలయాలు నేటి ఉదయం మూల దేవతలకు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఆలయాల కార్యనిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం తగు ఏర్పాట్లు చేశారు. రెండు ఆలయాల్లో గంటకు 50 నుంచి 60మంది భక్తులకు దర్శనం కల్పించ ను న్నారు. దైవ దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరి మాస్క్‌లు ధరించాల న్నారు. భౌతిక దూరం పాటించేలా ఆలయాల్లో వలయాలు ఏర్పాటు చేశారు. తీర్థప్రసాదాలు, ఇతర ప్రత్యేక పూజలను నిషేధించారు. కేవలం దేవతా మూర్తుల దర్శనం మాత్రమే చేసుకోవాలని ఆలయ వర్గాలు తెలిపాయి.

ఉమ్మడి జిల్లా నెట్‌వర్క్‌  :  కరోనా.. లాక్‌డౌన్‌తో మూతపడ్డ ఆలయాల్లో నేటి నుంచి గంటలు మోగనున్నాయి. రెండు నెలలకు పైగా మూసి ఉన్న దేవాలయాలు తెరుచుకోనున్నాయి. ఆలయాలకు భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, ఆలయాల్లో భక్తులకు దర్శన భాగ్యం కలుగనున్నది. కరోనా వైరస్‌ నేపథ్యంలో దేవాలయాల్లో పక్కా ప్రణాళికతో దర్శన ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. అయితే దేవాలయాల్లో హారతి, తీర్థం వంటివి ఉండవని ఆలయవర్గాలు తెలిపాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ ఆలయాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

తప్పనిసరిగా శానిటైజర్లు, మాస్క్‌లు..

భక్తులు ఆలయాల్లోకి ప్రవేశించే ముందు తప్పకుండా శానిటైజర్లు, మాస్క్‌లు ధరించాలి. ఆలయాల్లోకి వెళ్లిన భక్తులు కనీసం ఒకరి మధ్య ఒకరికి మూడు అడుగుల దూరం పాటించేలా క్యూ పద్ధతిలో వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కొబ్బరికాయలు, పుష్కరిలో స్నానాలు లేవు..

ఆలయాలకు వచ్చే భక్తులకు దేవాలయం నుంచి అందించే అర్జీత సేవలు లేవు. భక్తులకు బొట్టు పెట్టడం, తీర్థం ఇవ్వడం, శఠగోపం, హారతి, నిత్య కల్యాణం,  పుష్కరిణిలో స్నానాలు, బోనం సమర్పణ, కొబ్బరి కాయలు కొట్టడాన్ని నిలిపివేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు నేరుగా స్వామి వారి వద్దకు వెళ్లి దర్శించుకొని దండం పెట్టి, ప్రసాదాలు కొనుగోలు చేసుకొని వెళ్లిపోవాల్సి ఉంటుంది.

సంతోషంలో పూజారులు..

నేటి నుంచి ఆలయాలు తెరుచుకోనుండటంతో పూజారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా రెండు నెలలకు పైగా ఆలయాలు మూతపడడంతో పూజారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అంతేకాకుండా పెండ్లిండ్లు, శుభకార్యాలు కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. కాగా, నేటి నుంచి పెద్ద పెద్ద దేవాలయాలే కాకుండా గ్రామాల్లో ఉన్న గ్రామదేవతలకు సైతం ధూపదీప నైవేద్యాలను సమర్పించనున్నారు.

నేటి నుంచి కేతకీలో పూజలు..

ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నుంచి గతంలో మాదిరిగా భక్తులు స్వామివారికి దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో మోహన్‌రెడ్డి అన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు భౌతిక దూరం పాటించేలా ఆలయ సిబ్బంది సూచనలు చేస్తారన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయత్రం 7 గంటల వరకు ఆలయంలో పూజలు నిర్వహిస్తారన్నారు. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులకు ఆలయ దర్శనం అనుమతి లేదన్నారు.

చేర్యాల : కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని ఆలయవర్గాలు సిద్ధం చేశాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆలయ ఈవో వెంకటేశ్‌, ఏఈవో శ్రీనివాస్‌, సుదర్శన్‌, సూపరింటెండెంట్‌ శేఖర్‌, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌ చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం నుంచి మల్లన్న ఆలయంలో ఇక నిత్యం భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. రోజువారీగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు స్వామి వారి ని భక్తులు దర్శించుకోవాల్సి ఉంటుంది. భక్తుల మధ్య కనీసం 6ఫీట్ల దూరం ఉండేలా ఆలయ రాజగోపురం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్లే మార్గంలో సర్కిల్స్‌ ఏర్పాటు చేశారు. రాజగోపురం, గంగరేగు చెట్లు, ప్రధాన ఆలయం, మహా మండపం, క్యూలైన్లు, ప్రసాదాల తయారీ, విక్రయశాల, ఆలయ ప్రధాన వీధుల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని స్ప్రే చేయించారు.

అందుబాటులో ప్రసాదాలు..

భక్తులకు లడ్డూ, పులిహోరను ప్రసాదాల విక్రయశాలల ద్వారా నిత్యం విక్రయించనున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్లే ప్రధాన మార్గంలో ప్రవేశ సమయంలో భక్తులు తమ చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు ఏర్పాటు చేయడంతో పాటు థర్మల్‌ స్క్రీన్‌ గన్స్‌తో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆలయం నిర్వహించే పూజలు భక్తులు పాటించే జాగ్రత్తలను వివరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.


logo