బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Jun 06, 2020 , 23:49:39

‘గౌరవెల్లి’.. కల్పవల్లి

‘గౌరవెల్లి’.. కల్పవల్లి

మెట్ట ప్రాంతానికి వరప్రదాయిని  గౌరవెల్లి రిజర్వాయర్‌ 

వడివడిగా సాగుతున్న పనులు.. 85శాతం మేర పూర్తయిన నిర్మాణం

త్వరలోనే తరలిరానున్న గోదావరి జలాలు 

కుడి, ఎడమ కాల్వల ద్వారా 1.06 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు 

సిద్దిపేట, కరీంనగర్‌, జనగామ, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలకు ప్రయోజనం

ఆనందంలో రైతాంగం

మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరితగతిన పనులు పూర్తిచేసి దసరాలోపు రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు విడుదల చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పం. దానికి అనుగుణంగా పనులు జెట్‌స్పీడ్‌తో సాగుతున్నాయి. ఈ రిజర్వాయర్‌ కుడికాల్వ ద్వారా 90వేల ఎకరాలకు, ఎడమకాల్వ ద్వారా 16వేల ఎకరాలకు..మొత్తంగా 1.06 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తారు. సిద్దిపేట, కరీంనగర్‌, జనగామ, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలకు ఈ రిజర్వాయర్‌తో ప్రయోజనం కలుగనున్నది. ప్రధానంగా మెట్ట ప్రాంతం హుస్నాబాద్‌కు వరప్రదాయినిగా ఈ ప్రాజెక్టు మారనున్నది.  

సిద్దిపేట, నమస్తే తెలంగాణ / అక్కన్నపేట :  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధి అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు 85శాతానికి పైగా పూర్తయ్యాయి. వచ్చే దసరాలోపు ఈ రిజర్వాయర్‌ను గోదావరి జలాలతో నింపాలని సీఎం కేసీఆర్‌ సంకల్పం. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అధికారులు, వర్క్‌ ఏజెన్సీ పనులను మరింత వేగవంతం చేసింది. ఇటీవల హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు అధికారులతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. 

సస్యశ్యామలం కానున్న 1.06 లక్షల ఎకరాలు.. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని  రాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయం నుంచి సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండలం తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌కు గోదావరి జలాలు గతేడాది వచ్చి చేరాయి. అక్కడి నుంచి ఓపెన్‌ కెనాల్‌, సొరంగం ద్వారా గౌరవెల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాలు తరలి రానున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో గౌరవెల్లి రిజర్వాయర్‌ సామర్థ్యం 1.410 టీఎంసీలు ఉండగా, ప్రాజెక్టుల రీడిజైన్‌లో భాగంగా 8.230 టీఎంసీల సామర్థ్యానికి పెంచారు. ఈ రిజర్వాయర్‌ కింద 1.06 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానున్నది. సిద్దిపేట, కరీంనగర్‌, జనగామ, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లోని పలు మండలాలకు  రిజర్వాయర్‌తో ప్రయోజనం చేకూరనున్నది. తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌ నుంచి సుమారు 11 కిలోమీటర్లు ఓపెన్‌ కెనాల్‌, నారాయణపూర్‌ నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరం సొరంగం ద్వారా రేగొండ సర్జిపూల్‌ పంపునకు నీళ్లు చేరుతాయి. రేగొండ వద్ద 110 మీ. లోతు, 25 మీ. వెడల్పు, 50 మీ. పొడవుతో సర్జిపూల్‌ పంపును నిర్మించారు. ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సర్జిపుల్‌ నుంచి 130 మీ. లోతు, 17 మీ. వెడల్పు, 65 మీ. పొడవుతో నిర్మించిన పంపుహౌస్‌లోకి గోదావరి జలాలు వస్తాయి. ఇక్కడ 32 మెగావాట్లతో 3 మోటర్లను బిగించనున్నారు. త్వరలోనే మోటర్లు కూడా రానున్నాయి. ఇక్కడ నుంచి లిఫ్ట్‌ చేసి గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను విడుదల చేస్తారు. 

85 శాతానికిపైగా పనులు పూర్తి... 

గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 85శాతం పైగా పనులు పూర్తిచేశారు. దసరాలోపు రిజర్వాయర్‌లో గోదావరి జలాలు నింపాలన్న లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. ఓపెన్‌ కెనాల్‌, సొరంగం పనులు పూర్తయ్యాయి. సర్జిపూల్‌, పంపుహౌస్‌ పనులు చివరి దశలో ఉన్నాయి. రిజర్వాయర్‌ బండ్‌ నిర్మాణంలో భాగంగా 112.65 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిపని, 24,281 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌, 24,830 క్యూబిక్‌ మీటర్ల రిబిట్‌మెంట్‌, 4,82,979 క్యూబిక్‌ మీటర్ల ఇసుక పనులు పూర్తిచేశారు.

గౌరవెల్లి రిజర్వాయర్‌ సామర్థ్యం 8.23 టీఎంసీలు..

గౌరవెల్లి రిజర్వాయర్‌ సామర్థ్యం 8.23 టీఎంసీలు. రిజర్వాయర్‌ బండ్‌ పొడవు 10.56 కి.మీ. సరాసరిగా బండ్‌ ఎత్తు 41 మీ. ఉంటుంది. బండ్‌ నిర్మాణంలో భాగంగా అక్కడక్కడ గుట్టలను కలుపుకొని బండ్‌ నిర్మించారు. అంతా కలుపుకొని గుట్టల పొడవు సుమారు 2 కి.మీ ఉంటుంది. ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికి 3,870 ఎకరాల భూమి అవసరం కాగా, 3,420 ఎకరాల భూసేకరణ పూర్తిచేశారు. ఈ రిజర్వాయర్‌ కింద పూర్తిగా ముంపునకు గురవుతున్న గుడాట్‌పల్లి, తెనుగుపల్లి, మద్దెలపల్లి, కొత్తపల్లితో పాటు తండాలు సోమాజితండా, సేవ్యానాయక్‌తండా, బొంద్యానాయక్‌తం డా, జాలుబాయితండా, చింతల్‌తండా, తిరుమల్‌నాయక్‌తండాలు ఉన్నాయి. రిజర్వాయర్‌ కుడి కాల్వ ద్వారా 90 వేల ఎకరాలకు, ఎడమ కాల్వ ద్వారా 16 వేల ఎకరాలకు సాగునీటిని  సిద్దిపేట, కరీంనగర్‌, జనగామ, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలకు అందిస్తారు.

త్వరలోనే  గోదావరి జలాలు.. 

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తున్నారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్‌ నియోజకవర్గానికి గోదావరి జలాలు అందించేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రానున్నాయి. సీఎం కేసీఆర్‌ స్వయంగా రిజర్వాయర్‌ను సందర్శించి 1.410 టీఎంసీలు ప్రాజెక్టు సామర్థ్యాన్ని రీ డిజైన్‌ చేసి 8.23 టీఎంసీలకు పెంచారు. గౌరవెల్లి రిజర్వాయర్‌ ఈ ప్రాంతానికి వరప్రదాయినిగా మారనున్నది. 

- వొడితెల సతీశ్‌కుమార్‌, 

హుస్నాబాద్‌ 


logo