మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Jun 05, 2020 , 23:20:04

ప్రభుత్వ చర్యలతో పల్లెల్లో ‘స్వచ్ఛ’త

ప్రభుత్వ చర్యలతో పల్లెల్లో ‘స్వచ్ఛ’త

పచ్చదనం, పరిశుభ్రతతో అద్భుత ఫలితాలు  

జ్వరాలు, ఇతర వ్యాధులు తగ్గాయి 

 ప్రజాప్రతినిధులు, అధికారులు బాగా పనిచేస్తున్నారు..  

డంప్‌యార్డులు, వైంకుఠధామాల నిర్మాణం పూర్తి చేయాలి  

ట్రాక్టర్ల రాకతో పారిశుధ్య నిర్వహణ సులభతరం  

అధికారులతో కలిసి సంగారెడ్డి జిల్లాలో పర్యటన 

(సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ)

‘గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేసి ఉద్యమ రూపంలో మొక్కల పెంపకంతో ఆకుపచ్చని తెలంగాణ ఆవిష్కృతమవుతున్నది.. ఓ వైపు మొక్కల పెంపకంతో పచ్చదనం.. మరో వైపు పారిశుధ్య నిర్వహణతో పల్లెలు స్వచ్ఛమయంగా మారుతున్నాయి.. ఈ క్రమంలో జ్వరాలు, వ్యాధులకు గ్రామ సీమలు దూరం అవుతున్నాయి’.. అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. పల్లెలను బాగు చేసుకోవడంలో సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పోటీపడుతున్నారని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలని,  ఇదే స్ఫూర్తితో పని చేస్తే త్వరలోనే కాలుష్యం లేని గ్రీన్‌ తెలంగాణను చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. పంచాయత్‌రాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందన్‌రావు, సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు, డీపీవో వెంకటేశ్వర్లుతో కలిసి సోమేశ్‌కుమార్‌ జిల్లాలో పర్యటించారు. కంది మండలం ఎద్దు మైలారం, కొండాపూర్‌ మండలం గుంతపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించారు. గ్రామాల్లోని నర్సరీలు, డంప్‌యార్డులు, వైకుంఠధామాలు, మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ఎద్దుమైలారంలోని డంప్‌యార్డులో తడి,పొడి చెత్తను వేరుచేసే విధానాన్ని చూశారు. డంప్‌యార్డులు, వైకుంఠ ధామాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయించాలని కలెక్టర్‌ హనుమంతరావును సీఎస్‌ ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ బాగుందని, ఇదే స్ఫూర్తి తో పని చేయాలని కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

 పారిశుధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియ

గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ ఒక రోజుతో అయిపోదని, నిరంతరంగా కొనసాగాలని సోమేశ్‌కుమార్‌ అన్నారు. గుంతపల్లిని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే రెండు విడుతల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం మంచి ఫలితాలిచ్చిందన్నారు. పల్లెప్రగతితో పల్లెల్లో సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యాయన్నారు. ఈ నెల 8 వరకు ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమం గ్రామాల్లో కొనసాగుతున్నది. పనులు ఎలా జరుగుతున్నాయి? రెండు విడుతల పల్లెప్రగతి ఫలితాలు ఎలా ఉన్నాయో..? చూడాలని ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక పర్యటన పెట్టుకున్నామని చెప్పారు. ప్రతి ఊరికి ట్రాక్టర్‌, ట్యాంకర్‌, డోజర్‌ పంపిణీ వంటి కార్యక్రమాలు దేశంలోనే ఎక్కడా లేదని సీఎస్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా పల్లెలు ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయన్నారు.

 త్వరలో అందుబాటులోకి వైకుంఠధామాలు 

కలెక్టర్‌ హనుమంతరావు ప్రత్యేక చొరవతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో డంప్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం దాదాపుగా పూర్తి కావస్తున్నదని, త్వరలోనే అవి అందుబాటులోకి రానున్నాయని చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ అన్నారు. ఎద్దుమైలారంలో పూర్తయిన డంప్‌యార్డును పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

 ప్రతి గ్రామంలో గ్రీన్‌పార్క్‌ ఉండాలి 

అన్ని గ్రామాల్లో కొంత స్థలంలో గ్రీన్‌పార్క్‌ ఉండేలా చూడాలని కలెక్టర్‌కు సీఎస్‌ సూచించారు. కంది మండలం ఎద్దుమైలారంలో పచ్చటి మొక్కలతో కూడిన చిన్న పార్క్‌ను చూసి బాగుందని సర్పంచ్‌ మల్లారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఆ పార్క్‌లో పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. హెలికాప్టర్‌లో పటాన్‌చెరు గీతం యూనివర్సిటీలో దిగిన సీఎస్‌, వర్సిటీ ఆవరణలో మొక్క నాటారు. అనంతరం గ్రామాల్లో పర్యటించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో కొద్దిసేపు సమీక్షించారు.logo