ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jun 04, 2020 , 23:23:14

ఇంటిలాగే వీధులను శుభ్రంగా ఉంచుకోవాలి

ఇంటిలాగే వీధులను శుభ్రంగా ఉంచుకోవాలి

సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు

నేరడిగుంటలో పల్లెప్రగతి పనుల పరిశీలన

విద్యార్థిని ఇంటికెళ్లి చదువుపై ఆరా..

వట్‌పల్లి : ఇంటిని ఎంత అందంగా ఉంచుకుంటామో, వీధుల్లోనూ చెత్త వేయకుండా అంతేలా పరిశుభ్రంగా ఉంచాలని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. గురువారం ఆయన అందోల్‌ మండలం నేరడిగుంట గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం, డంప్‌యార్డులతో పాటు పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యభద్రత కల్పించేది పరిశుభ్రత ఒక్కటేనన్నారు. పరిశుభ్రతకు మించిన మందులేదని, ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. వానకాలం ప్రారంభమవుతున్నందున దోమలు వ్యాపించకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. గ్రామంలో ఎక్కడా నీళ్లు నిల్వ ఉండకుండా చేయడంతో పాటు మురికి కాలువలను శుభ్రంచేసి, మందులు పిచికారీ చేయాలని సర్పంచ్‌, అధికారులను ఆదేశించారు. గ్రామంలో నిర్మించిన ఇంకుడు గుంతను, పారిశుధ్య పనులను పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న విద్యుత్‌ స్తంభాలను మార్చి, తీగలను సరి చేయాలన్నారు. గ్రామంలో పారిశుధ్య పనుల నిర్వహణతో పాటు హరితహారం మొక్కలను సంరక్షిస్తున్నారని, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం నాణ్యతతో కట్టారని సర్పంచ్‌ చందూలత, కార్యదర్శి వెంకట్‌రామ్‌ను కలెక్టర్‌ అభినందించారు. ‘ఫోకస్‌' కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన పదో తరగతి జ్యోతి ఇంటికెళ్లి, ఆమె చదువు గురించి ఆరా తీశారు. పరీక్షలు సమీపిస్తున్నందున్న చదువుపై దృష్టి పెట్టాలని, 10జీపీఏ సాధించాలని జ్యోతికి కలెక్టర్‌ సూచించారు. ఆయన వెంట ఇన్‌చార్జి తహసీల్దార్‌ నరేందర్‌, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీటీసీ కృష్ణాగౌడ్‌ తదితరులు పాల్గొ న్నారు.  

పోతిరెడ్డిపల్లి, కొండారెడ్డిపల్లిలో అదనపు కలెక్టర్‌ సమీక్ష 

అందోల్‌ మండలం పోతిరెడ్డిపల్లి, కొండారెడ్డిపల్లి గ్రామాల్లో అదనపు కలెక్టర్‌ రాజర్షిషా గురువారం పర్యటించి పల్లెప్రగతి పనులపై సమీక్షించారు. అనంతరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల వద్దకు వెళ్లి మొక్కలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం అందోల్‌- జోగిపేట మున్సిపాలిటీలో సమావేశం ఏర్పాటు చేసి పట్టణప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులను అడిగితెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ మీర్జాఫసహత్‌ అలీ బేగ్‌, చైర్మన్‌ గూడెం మల్లయ్య, ఎంపీవో స్వాతి తదితరులు పాల్గొన్నారు.


logo