గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Jun 04, 2020 , 23:20:11

పచ్చిరొట్ట సాగుతో లాభాలెన్నో..

పచ్చిరొట్ట సాగుతో లాభాలెన్నో..

గజ్వేల్‌ /అక్కన్నపేట : వ్యవసాయం ఒక ప్రయోగం. తన పొలం ఓ ప్రయోగశాల అయితే, ప్రతి రైతు  ఓ శాస్త్రవేత్తగా మారుతాడు. పంట పండించడంలో ప్రతిసారి ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడం కోసం నిరంతరం సాగే ప్రయత్నం. శ్రమను తగ్గించుకుని తక్కువ పెట్టుబడితో నాణ్యమైన ఆధిక దిగుబడులు సాధించి ఫలితాలు పొందడం పరిశోధన విజయ రహస్యం. నాణ్యతతో కూడిన అధిక దిగుబడులతో పాటు ఆరోగ్యకరమైన వ్వవసాయ ఉత్పత్తులపై ప్రాధాన్యత పెరుగుతున్న ప్రస్తుత సమయంలో పాతకాలం సాగు పద్ధతలకు స్వస్తి చెప్పి నూతన సాగు విధానాలను ఆచరించడం అవసరం. ఈ అవసరాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్‌  సేంద్రియ సాగు విధానాన్ని ప్రోత్సహిస్తుండగా వినియోగదారులు సేంద్రియ ఉత్పత్తులపై ఆసక్తి చూపడంతో మార్కెటింగ్‌ అవకాశాలు పెరుగుతున్నాయి. వీటికి తోడు రసాయనిక ఎరువుల వాడకంతో భూమిలో మార్పులు చోటు చేసుకోవడం,  రైతుకు పెట్టుబడి భారం పెరుగడంతో ప్రత్యామ్నాయంగా సేంద్రియ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. 

 పచ్చి రొట్ట రకాలు..

ప్రధాన పంటల సాగును బట్టి పచ్చిరొట్ట రకాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాలు భూసారం కోసమే పనిచేయగా మరికొన్ని పశుగ్రాసం గాను, పంట దిగుబడులు కూడా పొంది భూసారాన్ని పెంచుకోవచ్చు. జీలుగ పచ్చిరొట్టగాను జనుము, పిల్లిపెసర పచ్చిరొట్ట, పశుగ్రాసంగా ఉపయోగపడగా, అలసంద, ఉలువ, పెసర, మినుము, బీర్నీస్‌ తదితర పంటలు పంట దిగుబడులతో పాటు పశుగ్రాసంగా పచ్చిరొట్టగా ఉపయోగపడుతాయి. వరిసాగు చేసే పొలంలో జూన్‌ మొదటి వారంలో జీలుగ, జనుము పచ్చిరొట్ట పైరును సాగు చేస్తే నాటు సమయానికి పొలంలో దున్నినాట్లు వేసుకోవచ్చు. పెసర సాగు చేస్తే ఒకటి రెండు సార్లు కాయలు కోసి కలియదున్నవచ్చు. వరిసాగు చేసే రైతులు రకాలను బట్టి ఎప్పుడు నాట్లు వేస్తారో అంచనా వేసి ఆ సమయానికి పచ్చిరొట్ట పైరు పూత దశలో ఉండే విధంగా సాగు పనులను ఆచరించాలి. 

జీలుగ : ఎకరా సాగుకు 15కిలోల విత్తనాలు సరిపోగా 7వారాల్లో ఒకటిన్నర మీటర్ల ఎత్తు పెరుగుతుంది. భూసారాన్ని బట్టి 75రోజుల తర్వాత 30టన్నుల పచ్చిరొట్టనిస్తుంది. దీనిని కలియదున్నిన తర్వాత టన్నుకు 5కిలోల నత్రజని, 6శాతం భాస్వరం 1.2శాతం పొటాష్‌లను ఇస్తుంది.

జనుము : 14కిలోల విత్తనాలు సరిపోగా పచ్చరొట్ట రకాల్లో  తొందరగా పెరిగి జనుము ఎకరాకు 25టన్నుల దిగుబడి వస్తుంది. పొలానికి టన్ను జనుము ద్వారా 4కిలోల నత్రజని, 0.5శాతం భాస్వరం, 1.8శాతం పొటాష్‌లను అందిస్తుంది. 

పెసర : ఎకరానికి 8కిలోల విత్తనాలు సరిపోగా పంట దిగుబడి పొందడంతో పాటు పశుగ్రాసంగా పచ్చిరొట్ట ఎరువుగా కూడా వాడుకోవచ్చు. ఎకరాకు 3టన్నుల దిగుబడి రాగా టన్నుకు 5కిలోల నత్రజనిని అందిస్తుంది. ఉలువ, గోరుచిక్కుడు, అలసందలు  3.5కిలోలు అందిస్తుంది. పిల్లి పెసర టన్నుకు 7.2కిలోల నత్రజని, 1కిలో భాస్వరం, 5.3కిలోల పొటాష్‌ను అందిస్తుంది. ఇంకా కానుగ తంగేడు, తదితర పచ్చి ఆకులను పొలంలో పరిచి మక్కనిచ్చి పచ్చిరొట్ట ఎరువుగా వాడుకోవచ్చు.

 పచ్చిరొట్ట సాగుతో ప్రయోజనాలు..

పంటల నాణ్యత పెరిగి ఆరోగ్యకరమైన దిగుబడులు అం దుతాయి. భూసారం పెరుగుతుంది. ఇది ఒకే పంటకు పరిమితం కాకుండా రెండు మూడు పంటలకు ఉపయోగపడి పైరుకు చీడపీడ తెగుళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. పైరుకు ఉపయోగపడే సూక్ష్మజీవుల పెంపునకు దోహదపడుతుంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గడంతో పాటు రసాయన ఎరువుల వాడకం తగ్గించడం ద్వారా పెట్టుబడి భారం తగ్గుతుంది.logo