శుక్రవారం 10 జూలై 2020
Medak - Jun 03, 2020 , 23:44:40

పల్లెలు మెరవాలి

పల్లెలు మెరవాలి

పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక  దృష్టి సారించాలి

దోమల  నివారణకు చర్యలు చేపట్టాలి

ఆయిల్‌లో ముంచిన గుడ్డ ముక్కలను మురికికాలువల్లో వేయాలి

జిల్లాలో 8 వరకు పారిశుధ్య కార్యక్రమాలు

‘నమస్తే తెలంగాణ’తో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశమున్న నేపథ్యంలో పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. మురికి కాలువలు శుభ్రం చేసుకుని, గుంతల్లో నీటినిల్వ ఉండకుండా చూడాలి. వాహనాల్లో ఉపయోగించే పాడైన ఇంజిన్‌ ఆయిల్‌లో ముంచిన గుడ్డ ముక్కలను మురికికాలువలో వేయడం ద్వారా దోమలను నివారించవచ్చని సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు సూచించారు. జిల్లావ్యాప్తంగా 647 పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 8 వరకు వారం రోజుల పాటు చేపడుతున్న ఈ పనులపై పంచాయతీ సిబ్బంది, సర్పంచ్‌లకు పలు సూచనలు చేశారు. అప్రమత్తంగా ఉంటేనే వ్యాధులు ధరిచేరవన్నారు. పారిశుధ్య నిర్వహణపై డీపీవో వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే....

కాలువలు శుభ్రంగా ఉండాలి...

ప్రతి గ్రామంలో మురికి కాలువలు శుభ్రంగా ఉండాలి. ఊరంతా ఎక్కడా కాలువల్లో నీరు నిలిచే పరిస్థితి ఉండొద్దు. కొద్దిపాటి వర్షాలకు గ్రామాల్లోని వీధుల్లో నీటి గుంతల్లో నీరు చేరుతుంది. ఆ నీటిని బయటకు వెళ్లేలా చిన్నపాటి కాలువలు తీయాలి. నీరు వెళ్లిన తరువాత గట్టి మొరం పోసిపూడ్చాలి.  

దోమలు, ఈగల వ్యాప్తిని నివారించాలి

వ్యాధులకు ప్రధానంగా దోమలు, ఈగలు కారణమవుతుంటాయి. ఈ క్రమంలోనే వాటి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. వాహనాల్లో ఉపయోగించి తీసేసిన ఇంజిన్‌ ఆయిల్‌లో ముంచిన గుడ్డ ముక్కలను మురికికాలువల్లో అక్కడక్కడ వేయాలి. ఇలా చేయడం ద్వారా నీటిపైన ఆయిల్‌ తేలుతుంది. ఆ నీటిపై ఉండే గుడ్లు, లార్వా చనిపోతుంది. దీంతో ఈగలు, దోమల వ్యాప్తిని చాలా వరకు కట్టడి చేయవచ్చు. వర్షాలు పడిన వెంటనే కొద్దిపాటి నీరు నిలువ ఉండేచోటు అయినా అక్కడ ముందుగా బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలి. మురికి కాలువపైన కూడా బ్లీచింగ్‌తో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని విధిగా చల్లాలి. ఇందుకోసం జిల్లాలోని అన్ని పంచాయతీలకు బ్లీచింగ్‌ పౌడర్‌ సరఫరా చేశాం.

తాగునీరు కలుషితం కాకుండా  చూసుకోవాలి...

వాన కాలంలో ఎక్కువగా నల్లాల ద్వారా వచ్చే నీరు కలుషితం అవుతుంటుంది. నీటికోసం ఏర్పాటు చేసుకునే గుంతలు, పైపులు లీక్‌ కావడంతో ఈ పరిస్థితి ఎదురవుతుంది. పలు ఇండ్లలో ఏర్పాటు చేసుకున్న ట్యాంకులు నిండి అందులోని వాటర్‌లో తిరిగి పైపుల్లోకి వెళ్తుంది. ఇండ్లు వదిలివెళ్లిన వారి ఇండ్లలోని ట్యాంకుల నీరు రావడంతో తాగునీరు కలుషితం అవుతుంటుంది. ఈ క్రమంలోనే పంచాయతీ సిబ్బంది పైప్‌లైన్లను పరిశీలించాలి. పైపులు లీకైతే తక్షణమే అతికించాలి. ఈ విషయంలో వాటర్‌మెన్‌లు అప్రమత్తంగా ఉండాలి. గ్రామంలోని నీళ్ల ట్యాంకులను శుభ్రం చేసుకుని క్లోరినేషన్‌ చేయాలి. ఎప్పుడు క్లోరిన్‌ చేశారో విధిగా అక్కడ పేర్కొనాలి.

వ్యక్తిగత శుభ్రత పాటించాలి

డెంగ్యూ వస్తే వేలల్లో ఖర్చు అవుతుంది. వర్షాకాలం వచ్చే వ్యాధులు ప్రాణాలను తీస్తుంటాయి కూడా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను వినియోగించాలి. ఇంటి చుట్టూ చెత్త లేకుండా చూసుకోవాలి. తడి, పొడి చెత్తను వేరుచేసి పంచాయతీ సిబ్బందికి అందించాలి. ఇంటి చుట్టు వర్షపు నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాసిక్‌ వస్తువులు, చెప్పులను ఇంటి పరిసరాల నుంచి తొలిగించాలి. 

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు..

విధి నిర్వహణ విషయంలో పంచాయతీ సిబ్బంది ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టాలి. కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్‌, నేను ఆకస్మికంగా తనిఖీలు చేపడుతున్నాం. ఆ సమయంలో సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తే చర్యలు తప్పవు. ఇప్పటికే రెండు విడుతల పల్లె ప్రగతిలో గ్రామాల్లోనే చాలా వరకు సమస్యలు పరిష్కారమయ్యాయి. పాతగోడలు కూల్చి, బోరుబావులు, పాత బావులు పూడ్చివేశాం. పిచ్చిమొక్కలు, చెత్తా చెదారం, వయ్యారిభామ మొక్కలను తొలిగించాలి. బాధ్యతగా పనిచేసి గ్రామాన్ని శుభ్రంగా ఉంచిన సిబ్బందికి గుర్తింపు ఉంటుంది. 


logo