శుక్రవారం 10 జూలై 2020
Medak - Jun 03, 2020 , 23:38:38

దండిగా ధాన్యం

దండిగా ధాన్యం

సంగారెడ్డి జిల్లాలో ముగిసిన ధాన్యం సేకరణ ప్రక్రియ

13,786 మంది రైతుల నుంచి రూ 99.87 కోట్ల వడ్ల కొనుగోలు

నేరుగా రైతుల ఖాతాల్లో రూ.91.62 కోట్ల జమ

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తి అయ్యింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు అమ్ముకున్న రైతులకు నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా 100 ఎకరాలకు పైగా వరి సాగు చేసిన గ్రామాల్లోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లాలో 93 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. బుధవారం సాయంత్రం వరకు 54,427 టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా సివిల్‌ సప్లయ్‌ అధికారులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 8 వరకు కొనుగోలుకు అవకాశం ఇచ్చినప్పటికీ.. జిల్లాలో వడ్లు లేనందున కేంద్రాలను మూసివేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.

రూ.91.62 కోట్లు రైతులకు చెల్లింపు...

జిల్లాలో మొత్తం 93 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. వీటి ద్వారా 13,786 మంది రైతుల నుంచి రూ.99.87 కోట్ల విలువచేసే 54,427 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. కొనుగోలు చేసిన వడ్లను బియ్యం నూర్పిడి నిమిత్తం 54,163 టన్నులను మిల్లులకు తరలించారు. 246 టన్నుల వడ్లు మిల్లులకు తరలించాల్సి ఉంది. బుధవారం వరకు 13,112 మంది రైతులకు సంబంధించి మొత్తం రూ.91.62 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమచేశారు. మిగతా 647 మంది రైతులకు సంబంధించిన రూ.8.24 కోట్లు చెల్లించాల్సి ఉంది. గడిచిన యాసంగిలో 24వేల ఎకరాల్లో వరిసాగైంది. క్వింటాలుకు రూ.1835 మద్దతు ధర ప్రభుత్వం చెల్లించింది. బుధవారం సాయంత్రంతో జిల్లావ్యాప్తంగా 93 కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియను నిలిపివేశారు. కేంద్రాల్లో సేకరించిన వడ్లను మిల్లుల ద్వారా నూర్పిడి చేసి జిల్లాలోని 845 రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేయనున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూడు నెలలుగా రేషన్‌కార్డు లబ్ధిదారుల్లోని ప్రతి ఒక్కరికీ 12 కిలోల చొప్పున ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే.


logo