ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jun 03, 2020 , 23:23:26

ఉమ్మడి జిల్లాలో 7.19 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అంచనా

ఉమ్మడి జిల్లాలో 7.19 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అంచనా

సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 3.67 లక్షల ఎకరాల్లో పంటవేసేందుకు ప్రణాళిక 

1.49 లక్షల ఎకరాల్లో కంది, 3.28 లక్షల్లో వరి సాగు ప్రణాళిక ఖరారు

నియంత్రిత సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు

ముగిసిన అవగాహన సదస్సులు

మద్దతు ధరల పెంపుతో రైతాంగంలో సంతోషం 

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: 

అత్యధికంగా సంగారెడ్డి  జిల్లాలో పత్తిసాగు... నియంత్రిత సాగులో భాగంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పత్తిసాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఈ మేరకు పంటల సాగు లెక్కల అంచనాలను ప్రకటించింది. ఇందులో అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 3.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానున్నది. సిద్దిపేట జిల్లాలో 2.73 లక్షల ఎకరాల్లో, మెదక్‌ జిల్లాలో 79వేల ఎకరాల్లో పత్తి సాగుకానున్నది. కాగా, కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటాలుకు రూ.260 మద్దతు ధర పెంచింది. ప్రస్తుతం సాధారణ రకం క్వింటాల్‌కు రూ.5,225 ఉన్నది. ఏ-గ్రేడ్‌ రకానికి రూ.5,550 ధర ఉన్న విషయం తెలిసిందే. రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగుకు సిద్ధం అవుతుండగా.. ఈ సమయంలో కేంద్రం సైతం కొంత మేర మద్దతు ధర పెంచడంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

కంది సాగు...

ఉమ్మడి జిల్లాలో 1.49 లక్షల ఎకరాల్లో కంది పంట సాగుచేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. కంది పంటకూ కేంద్రం క్వింటాలుకు రూ.200 మద్దతు ధర పెంచింది. ప్రస్తుతం రూ.5800 చెల్లిస్తుండగా.. పెంచిన ధరతో ఇక మీదట క్వింటాలుకు రూ.6 వేలు దక్కనున్నాయి. 

వరి...

వరికి మాత్రం తక్కువ మొత్తంలో కేవలం రూ.53 మద్దతు ధర మాత్రమే కేంద్రం పెంచింది. ఉమ్మడి జిల్లాలో 3.28 లక్షల్లో ఎకరాల్లో వరి సాగు అంచనా వేశారు. ఇందులో 1.69 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేయాలని నిర్ణయించారు. 

ముగిసిన అవగాహన సభలు...

నియంత్రిత వ్యవసాయ విధానంపై సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులు ముగిశాయి. దాదాపు 15 రోజుల పాటు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సులు నిర్వహించారు. ప్రభుత్వం సూచించిన పంటలే సాగు చేయాలని రైతుబంధు సమితి ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అన్ని గ్రామాల్లో సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి జిల్లాలో దాదాపుగా మెజార్టీ గ్రామాల్లో రైతులు ‘సర్కారు మాటే.. మా సాగు బాట’ అని తీర్మానం చేశారు. ఉమ్మడి జిల్లా రైతాంగం సర్కారు మాటకు కట్టబడడంపై సీఎం కేసీఆర్‌ కొండపోచమ్మ సాగర్‌ వద్ద మీడియా సమావేశంలో సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సూచించిన విధంగా నియంత్రిత సాగుకు రైతాంగం సానుకూలంగా స్పందించడం, ఈ సమయంలో ఆ పంటలకు కొంత మద్దతు ధర పెరగడం రైతులకు ఆర్థికంగా కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. 


logo