మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Jun 03, 2020 , 23:08:14

కరెంట్‌ షాక్‌తో వేర్వేరుచోట్ల ముగ్గురు మృతి

కరెంట్‌ షాక్‌తో వేర్వేరుచోట్ల ముగ్గురు మృతి

రామాయంపేట మండలం శివ్వాయపల్లెలో ఒకరు, 

మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లో మరొకరు, 

హవేళిఘనపూర్‌ మండలం శాలిపేటలో ఇంకొకరు మృత్యువాత

ఆగ్రహించిన శివ్వాయపల్లె గ్రామస్తులు

ఫిర్యాదు చేసినా వైర్లు సరిచేయలేదని ఏఈపై ఆరోపణ 

గ్రామస్తులను సముదాయించిన విద్యుత్‌ ఏడీఈ సంతోశ్‌కుమార్‌, ఎస్‌ఐ మహేందర్‌ 

కరెంట్‌ షాక్‌కు ముగ్గురు బలయ్యారు. ‘పల్లెప్రగతి’లో భాగంగా చాలా వరకు విద్యుత్‌ సమస్యలను పరిష్కరించినా, అధికారుల నిర్లక్ష్యంతో అక్కడక్కడ నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. పలుచోట్ల కరెంట్‌ వైర్లు కిందకు వేలాడుతుండడం ప్రమాదాలకు తావిస్తున్నాయి. మంగళవారం రాత్రి రామాయంపేట మండలం శివ్వాయపల్లె గ్రామానికి చెందిన ఒకరు, బుధవారం మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ గ్రామానికి చెందిన మరో బాలుడు, మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లో ఇంకొకరు విద్యుత్‌ షాక్‌కు గురై మృత్యువాతపడ్డారు.

రామాయంపేట : కరెంట్‌ షాక్‌తో బాలుడు మృతి చెందిన సంఘటన మండలం శివ్వాయపల్లె గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. రామాయంపేట ఎస్సై మహేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి పరశు రాములు, లక్ష్మిల కుమారుడు శ్రీకాంత్‌(17) పొలం వద్దకు పశువుల ఎరువును ట్రాక్టర్‌లో తీసుకెళ్లారు. డ్రైవర్‌ హైడ్రాలిక్‌ పైకిలేపాడు. దీంతో విద్యుత్‌ తీగలు తగిలి కిందపడ్డారు. వెంటనే 108లో రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

శివ్వాయపల్లెలో గ్రామస్తుల ఆందోళన..

విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని బుధవారం గ్రామస్తులు ఘటనా స్థలంలో భీష్మించుకుర్చున్నారు. చేతికి అందేలా కిందకు ఉన్న విద్యుత్‌ తీగలను సరిచేయాలని పలుమార్లు ఏఈకి ఫిర్యాదు చేశామన్నారు. నిజాంపేట ఏఈ బ్యాగరి సంతోశ్‌ వచ్చేవరకు మృతదేహాన్ని తరలించేది లేదని తేల్చిచెప్పారు. అక్కడే ఉన్న రామాయంపేట ఏడీఈ సంతోశ్‌కుమార్‌, ఎస్సై మహేందర్‌ విద్యుత్‌ తీగలను సరి చేయిస్తామని చెప్పి గ్రామస్తులను సముదాయించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు.   

మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లో...

మనోహరాబాద్‌ : విద్యుదాఘాతంతో విద్యార్థి మృతిచెందిన సంఘటన  కాళ్లకల్‌లోని ఓ పరిశ్రమలో జరిగింది. ఎస్సై రాజుగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నేతికుంట సాయికుమార్‌ (17) పదో తరగతి చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కాళ్లకల్‌ శివారులోని శ్రీ లక్ష్మీనర్సింహ సీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో ప్యాకింగ్‌ సెక్షన్‌లో పార్ట్‌ టైం పని చేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున పరిశ్రమ గేటు బయట ఉన్న ఓ రూం వద్ద ఇనుప పైపు పట్టుకోగా కరెంట్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

హవేళిఘనపూర్‌ మండలం శాలిపేటలో..

హవేళిఘనపూర్‌ : బోరుబావి నుంచి మోటర్‌ను బయటకు తీస్తుండగా ప్రమాదవశాత్తు పైన ఉన్న విద్యుత్‌ వైర్లకు తగిలి ఒకరు మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలోని శాలిపేటలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు నాగిరెడ్డి బోరుబావిలో ఇరుక్కుపోయిన మోటర్‌ను తీసేందుకు చిన్నశంకరంపేట మండలానికి చెందిన ఆరె మల్లేశం(38), పాండరిలను పిలిపించారు. మోటర్‌ను బయటకు తీస్తున్న క్రమంలో పైపు విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో మల్లేశం అక్కడికక్కడే మృతి చెందగా, పాండరికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని మెదక్‌ రూరల్‌ సీఐ రాజశేఖర్‌, ఎస్సై శేఖర్‌రెడ్డి పరిశీలించారు. మృతుడికి భార్య లావణ్య, ఒక కుమారుడు ఉన్నారు. 


logo