ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - May 31, 2020 , 00:50:08

కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో జీవనదులుగా రూపాంతరం

కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో జీవనదులుగా రూపాంతరం

  • కోనసీమను తలపించనున్న మెతుకుసీమ
  • మంజీర, హల్దీ వాగులపై 15 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం
  • చకచకా జరుగుతున్న  పనులు
  • 25వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
  • గోదావరి జలాలతో అలుగు పారనున్న డ్యామ్‌లు
  • సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలు

మెతుకుసీమ.. కోనసీమను తలదన్నేలా మారబోతున్నది. గోదారమ్మ సవ్వడులతో మంజీరమ్మ మైమరిచిపోనున్నది.  మహాకవి దాశరథి రాసిన మంజీర నాదాలు, హల్దీ గీతాలు మళ్లీ పాడుకోబోతున్నాం. ఐదారు నెలల కాల వ్యవధిలోనే మంజీర, హల్దీ వాగులకు మళ్లీ జలకళ రాబోతున్నది. కాళేశ్వరం జలాల రాకతో జీవనదులుగా రూపాంతరం చెందనున్నాయి. కొండపోచమ్మ సాగర్‌ జలాశయంలోకి గోదావరి జలాల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే తెలంగాణ సర్కారు ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. మంజీర, హల్దీ వాగులపై దాదాపు 15 చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తున్నారు. ఈ చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులు కూడా దాదాపు పూర్తి కావస్తున్నయి. ఈ చెక్‌ డ్యామ్‌ల ద్వారానే 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. మంజీర, హల్దీ వాగులు కాళేశ్వరం జలాలతో నిండుకుండలా మారితే, ఇక్కడి నుంచి నిజాంసాగర్‌కు కూడా నీళ్లందుతాయి. మొత్తానికి ఉమ్మడి మెదక్‌ జిల్లా గోదావరి జలాలతో సస్యశ్యామలం కానున్నది. మూడు పంటల సాగుతో రైతులు సిరులు పండించనున్నారు.

ఐదారు మాసాల తర్వాత మహాకవి దాశరథి రాసినట్లుగా మంజీర నాదాలు, హల్దీ గొప్పగొప్ప గీతాలు.. ఎండిపోని మంజీరను మనం చూడబోతున్నాం, ఎండిపోనటువంటి హల్దీనీ మనం చూడబోతున్నాం. అద్భుతమైనటువంటి హల్దీవాగు జీవనదిగా మారుతది. మంజీర కూడ జీవనదిగా మారుతది. నిజాం సాగర్‌కు అన్నంపెడుతది. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో హల్దీ, మంజీర జీవధారలు పారబోతావున్నయి. - ముఖ్యమంత్రి కేసీఆర్‌

మెదక్‌, నమస్తే తెలంగాణ : ‘కాళేశ్వరం’ జలాలు మెతుకుసీమ రైతుల కడుపు నింపనున్నాయి. మంజీర, హల్దీ వాగులు జీవనదులుగా మారనున్నాయి. కలలో కూడా ఊహించని విధంగా ఉద్యమ అధినేత సీఎం కేసీఆర్‌ ఆలోచనతో అమలు కాబోతున్నది. కొండపోచమ్మ సాగర్‌ నీటిని అన్ని చెక్‌డ్యాంలలో నింపుతూ మంజీర, హల్దీ వాగుతో నిజాంసాగర్‌ వరకు గోదావరి జలాలు పారనున్నాయి. మంజీర, హల్దీ పరీవాహక ప్రాంతం మొత్తం పచ్చని పంటలతో మెతుకుసీమంతా కళకళలాడనున్నది. అదనంగా మంజీర, హల్దీ వాగు ద్వారా 35-45 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. గజ్వేల్‌ నియోజకవర్గంలోని తునికి గ్రామ శివారులో తుఫాన్‌ఖాన్‌ చెరువు నుంచి మెదక్‌ జిల్లాకు జలాల రాక ప్రారంభమై వర్గల్‌ మండలం అంబార్‌పేట్‌, ఏలూరు, నాచారం, మెదక్‌ జిల్లా తూఫ్రాన్‌ మండలం యావాపూర్‌ చెక్‌డ్యాంకు చేరుకుని అక్కడి నుంచి కిష్టాపూర్‌, తూఫ్రాన్‌, ఇస్లాంపూర్‌, నాగులపల్లి శివారు నుంచి ప్రవహిస్తూ, వెల్దుర్తి మండలంలోని హల్దీవాగు నుంచి బొల్లారం మత్తడి నిండుకుని పసుపులేరు వాగులో కలువనున్నది.

హవేళిఘనపూర్‌ మండలాల్లోని పలు గ్రామాల మీదుగా మెదక్‌ మండలంలోని ర్యాలమడుగు సమీపంలో ప్రస్తుతం నిర్మిస్తున్న చెక్‌డ్యాంకు సమీపంలో ఉన్న మంజీర నదిలో కలుస్తుంది. అక్కడి నుంచి పోచారం, నిజాంసాగర్‌ వరకు జలాలు ప్రవహించనున్నాయి. దీంతో ఘనపురం ప్రాజెక్టు ఎంఎన్‌ కెనాల్‌ ద్వారా 13,500 ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం కానున్నది. శుక్రవారం సీఎం కేసీఆర్‌ కొండపోచమ్మ ప్రాజెక్టును ప్రారంభించిన విషయం తెలిసిందే. కొండపోచమ్మ సాగర్‌ మెతుకు సీమకు మరో వరప్రదాయని కానున్నది. ఇప్పటికే ఘనపురం ప్రాజెక్టు ద్వారా 26,500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ‘కాళేశ్వరం’ జలాలను మెతుకుసీమకు అందించేందుకు 5 ప్యాకేజీల ద్వారా పనులు నడుస్తున్నాయి. అందుకుగాను భూ సేకరణ పూర్తి కావచ్చింది. ప్యాకేజీ 13 ద్వారా 4,191 ఎకరాలు, ప్యాకేజీ 14 కొండపోచమ్మ ద్వారా 81,456 ఎకరాలు, ప్యాకేజీ 22 ద్వారా 11,696 ఎకరాలు, ప్యాకేజీ 19 ద్వారా 61,712 ఎకరాలు, ప్యాకేజీ 18 ద్వారా 15,000 ఎకరాలు జిల్లా మొత్తంగా 1 లక్ష 74వేల 55 ఎకరాలకు ఆయకట్టు సాగునీరు అందనున్నది. 

చకచకా చెక్‌డ్యాంల నిర్మాణాలు..

మంజీర, హల్దీవాగు పరీవాహక ప్రాంతాల్లో రూ.1200కోట్ల నాబార్డు నిధులతో 15 చెక్‌డ్యాంల నిర్మాణాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చెక్‌డ్యాంలు మంజూరు చేసి నిధులు సైతం ఇచ్చారు. దీంతో చెక్‌డ్యాంల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఇందులో 6 చెక్‌డ్యాంల నిర్మాణాలు పూర్తయ్యాయి. యావాపూర్‌, దామరంచా, వెల్దుర్తి, ఉప్పులింగాపూర్‌, ఎనగండ్ల, కూచన్‌పల్లి చెక్‌డ్యాంలు పూర్తయ్యాయి. మానేపల్లి, కుకునూర్‌, చిలిపిచెడ్‌ మండలం పైజాబాద్‌, చిట్కుల్‌, ర్యాలమడుగు, నాగులపల్లి, కోనాపూర్‌, పైతర చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తికావస్తున్నది. కూచన్‌పల్లిలో నిర్మించిన చెక్‌డ్యాం 8 గ్రామాల రైతులకు ఉపయోగపడింది. సంగారెడ్డి జిల్లా చిప్పల్‌తుర్తి నుంచి మెదక్‌, సర్ధన వరకు చెక్‌డ్యాంల నిర్మాణాలు జరుగుతున్నాయి.  


logo