శనివారం 31 అక్టోబర్ 2020
Medak - May 27, 2020 , 02:21:02

పల్లెలన్నీ ప్రాధాన్యతకే..

పల్లెలన్నీ ప్రాధాన్యతకే..

  • సీఎం కేసీఆర్‌ మాటకే జైకొడుతున్న రైతులు
  • తీర్మాన పత్రాలతో పాటు ప్రతిజ్ఞలు
  • మూడోరోజు ఉమ్మడి జిల్లాలో 190 గ్రామాలు
  • అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 103

పల్లెలన్నీ ‘ప్రాధాన్యత’కే పట్టుపడుతున్నాయి... ప్రభుత్వం చెప్పిన పంటలే వేస్తామంటూ రైతన్నలు ఏకమవుతున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ సారు చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామంటూ తీర్మానాలు చేస్తున్నారు. మూడో రోజైన మంగళవారం 190 గ్రామాల రైతులు ఏకగ్రీవ ప్రకటనలు చేశారు. ఇందులో అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 103 గ్రామాల్లో తీర్మానాలు చేయగా, సిద్దిపేటలో 70, మెదక్‌ జిల్లాలో 17 గ్రామాల్లో నూతన ‘సాగు’పై ప్రతిజ్ఞలు చేశారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులకు రైతులు తీర్మాన పత్రాలను అందజేశారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా 397 గ్రామాల రైతులు ప్రాధాన్యతా పంటల సాగుకే జై కొట్టారు.

మెదక్‌, నమస్తే తెలంగాణ : మెదక్‌ జిల్లాలో 17 గ్రామాల్లో నియంత్రిత పంటల సాగు విధానాన్ని పాటించాలని రైతులు, రైతుబంధు సమితి సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, సింగిల్‌ విండో చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొని తీర్మానించారు. మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం తూఫ్రాన్‌ మండలం కోనాయిపల్లి పీబీ గ్రామం, మనోహరాబాద్‌ మండలం ధర్మరాజుపల్లిలో నియంత్రిత పంటలపై రైతులు తీర్మానం చేశారు. నర్సాపూర్‌ నియోజకవర్గం వెల్దుర్తి, శివ్వంపేట, కొల్చారం, చిలిపిచెడ్‌ మండలాల్లో రైతులు స్వచ్ఛందంగా నియంత్రిత పంటల సాగుపై ప్రతిజ్ఞ చేసి తీర్మానాలు చేశారు. శివ్వంపేట మండలం కొత్తపేట, రత్నాపూర్‌, అల్లీపూర్‌, రుప్లాతండా, సీతారాంతండా, బీమ్లాతండా, పాంబండ గ్రామాల్లో నియంత్రిత పంటలనే వేస్తామని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సమక్షంలో మంగళవారం రైతులు స్వచ్ఛందంగా తీర్మానాలు చేశారు. అదేవిధంగా వెల్దుర్తి మండలంలోని లింగారెడ్డిపల్లి, బండపోసంపల్లి, మంగళపర్తి, కుకునూర్‌ గ్రామాల్లో రైతులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కొల్చారం మండలం చిన్నఘనపూర్‌, పోతంశెట్టిపల్లి గ్రామాల్లో రైతులు నియంత్రిత పంటల సాగుపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. చిలిపిచెడ్‌ మండలం రహీంగూడలో సైతం నియంత్రిత పంటల సాగు విధానంపై తీర్మానం చేశారు. 

తాజావార్తలు