గురువారం 02 జూలై 2020
Medak - May 24, 2020 , 23:45:57

వ్యవసాయాన్ని పండుగ చేద్దాం

వ్యవసాయాన్ని పండుగ చేద్దాం

  • రైతుల కోసం ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చు
  • మంగళవారం నుంచి మంగళవారం వరకు 
  • గ్రామ వ్యవసాయ ప్రణాళిక తయారు చేయాలి
  • మెదక్‌ జిల్లాలో 2 లక్షల 60వేల ఎకరాల్లో సాగు
  • రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం
  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

మెదక్‌: రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తుంది. ఇందులో నాణ్యమైన కరెంటు కోసం ఏడాదికి రూ.10వేల కోట్లు, రైతుబీమాకు రూ.1,100 కోట్లు ఇలా రైతు సంక్షేమానికి ఏడాదికి రూ.70వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం మెదక్‌ సాయిబాలాజీ గార్డెన్స్‌లో ‘నియంత్రణ సాగు విధానం, లాభసాటి వ్యవసాయం’పై ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరైన మాట్లాడారు. మెదక్‌ జిల్లాలో 2 లక్షల 60వేల ఎకరాల్లో భూములు సాగవుతున్నాయని, అయితే ఒకే రకమైన పంటలు రైతులు పండిస్తున్నారన్నారు. వ్యవసాయంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వానకాలంలో మొక్కజొన్న వేయకుండా, యాసంగిలో మాత్రమే వేసుకునేలా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇదిలావుండగా వానకాలంలో వరి పంట లక్షా 22వేల ఎకరాలు సాగు చేశారని, త్వరలో కాళేశ్వరం నీరు జిల్లాకు వస్తుండడంతో లక్షా 30వేల ఎకరాల్లో సాగు చేయాలని అంటే 13వేల ఎకరాల్లో వరి సన్నరకం సాగు పెంచుకోవాలని తెలిపారు. వానకాలంలో కోటీ 40లక్షల ఎకరాలకు రైతుబంధు పథకం అమలు చేస్తామన్నారు. వానకాలంలో సుమారు రూ.7 వేల కోట్లు, యాసంగిలో రూ.7 వేల కోట్లు రైతు బంధు పథకం ద్వారా ఇస్తామన్నారు.  

ప్రణాళికకు ‘వ్యవసాయ వారం’

మంగళవారం నుంచి మంగళవారం వరకు గ్రామ వ్యవసాయ ప్రణాళికను తయారు చేయాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏఈవోలు గ్రామాలకు వెళ్లి రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో రైతులతో మాట్లాడి వారు ఏఏ పంటలు వేయాలో అవగాహన కల్పించాలని తెలిపారు.  

మెదక్‌లో రూ.25 కోట్లతో గోదాం...

మెదక్‌ జిల్లా వ్యవసాయ రంగంలో అనేక ఉత్పత్తులను సాధిస్తుందని ఇందుకోసం మెదక్‌లో రూ.25 కోట్లతో 30వేల మెట్రిక్‌ టన్నుల గోదాంను నిర్మించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అంతేకాకుండా 200 ఎకరాల్లో ఇండస్ట్రీ కంపెనీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలత, జడ్పీ వైస్‌ చైర్మన్‌ లావణ్యరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, ఎలక్షన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ నగేశ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, అధికారులు పాల్గొన్నారు.logo