శనివారం 06 జూన్ 2020
Medak - May 23, 2020 , 00:28:13

కొత్త విధానంలో రైతేరాజు

కొత్త విధానంలో రైతేరాజు

ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు

పటాన్‌చెరు: కొత్త వ్యవసాయ విధానంలో రైతే రాజుగా మారుతాడని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి శుక్రవారం పటాన్‌చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేశారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్‌ యా ర్డులో నిర్మించిన 30 దుకాణాలను వారు ప్రారంభించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కలెక్టర్‌ హనుమంతరావు పాల్గొన్నారు. కొత్త మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా బీ.హారిక విజయ్‌కుమార్‌తో, వైస్‌ చైర్మన్‌గా బీ.మల్లారెడ్డితో, ఆత్మకమిటీ కమిటీ చైర్మన్‌గా రెండోమారు ఎంపికైన గడీల కుమార్‌గౌడ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సమగ్రవ్యవసాయ విధానంతో రైతులు అన్ని రకాలుగా లబ్ధిపొందుతారన్నారు. సీఎం కేసీఆర్‌ రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు.

ఆదర్శంగా పటాన్‌చెరు మార్కెట్‌: మంత్రి నిరంజన్‌రెడ్డి

ప్రజల డిమాండ్‌ను తీర్చే దిశగా మార్కెటింగ్‌కు మనం ఆలోచన చేయాలి. హైదరాబాద్‌ మహానగరంలో నలుదిక్కులా పటాన్‌చెరులాంటి మార్కెట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు ఆహార సామగ్రీని ప్రజలకు అందజేసేందుకు కొత్త ప్రణాళికలు అమలు చేద్దాం. పటాన్‌చెరు మార్కెట్‌ను దేశంలోనే ఆదర్శ మార్కెట్‌గా చేద్దాం. జిన్నారం, గుమ్మడిదలలో గోదాంలను మంజూరు చేస్తున్నాం. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆదర్శం మార్కెట్‌గా పటాన్‌చెరును అభివృద్ధి చేసేందుకు చేస్తున్న కృషి అభినందనీయం.

సీఎం ఆశీస్సులతోనే..: - ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు, మంత్రి హరీశ్‌రావు సహకారంతోనే అభివృద్ధి పనులు చేశాం. పటాన్‌చెరు మార్కెట్‌ స్థలం ఓ ప్రైవేటు పరిశ్రమ ఆధీనంలో ఉంటే ఎంతో కష్టపడి తిరిగి సాధించాం. రైతులకు మేలు జరుగాలని 14ఎకరాల స్థలాన్ని వ్యవసాయ మార్కెట్‌కు కేటాయించాం. వ్యవసాయ మార్కెట్‌ను ఆదర్శమార్కెట్‌ చేసేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి సహాయం కోరుతున్నాం.

ఆదర్శంగా సీఎం నిర్ణయాలు: ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి

అభివృద్ధికి మారుపేరుగా పటాన్‌చెరు నియోజకవర్గం మారింది. పటాన్‌చెరులో ఏర్పాటు చేసిన మార్కెట్‌యార్డుతో రైతులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. పారిశ్రామికవేత్తలనుంచి ఈ స్థలం సేకరించి వ్యవసాయ మార్కెట్‌యార్డుగా చేసుకున్నాం. భవిష్యత్‌లో మార్కెట్‌యార్డు మరింత అభివృద్ధి చెందాలి. సీఎం కేసీఆర్‌ రైతుల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఆదర్శంగా ఉన్నాయి.

పటాన్‌చెరు అభివృద్ధి కనిపిస్తుంది: ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్‌ను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేసే సత్తా  ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి ఉంది. సీఎం కేసీఆర్‌, మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆశీస్సులతో ఎమ్మెల్యే కోరుకున్న అభివృద్ధిని చేయగలుగుతున్నారు. ఎప్పుడు కాలుష్యంతో సతమతమయ్యే పటాన్‌చెరులో ఇప్పుడు అభివృద్ధి కండ్లకు కట్టినట్టుగా ఉంది.

పటాన్‌చెరుకు కొత్త కాంతులు

పటాన్‌చెరు/ రామచంద్రాపురం: పటాన్‌చెరుకు కొత్త విద్యుత్‌కాంతులు రూ.51 కోట్లతో జంక్షన్‌గా ఏర్పాటు చేస్తున్నామని ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం పటాన్‌చెరు పట్టణంలో రూ.21.69 కోట్లతో 132/33 కేవీ సబ్‌స్టేషన్‌కు మంత్రి హరీశ్‌రావు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్‌రెడ్డితో కలిసి  శంకుస్థాపన చేశారు. అలాగే, అమీన్‌ఫూర్‌ మండలం సుల్తాన్‌ఫూర్‌లో రూ.19.89 కోట్ల ఖర్చుతో నిర్మించిన 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. 

బస్తీదవాఖానలు ప్రారంభం

పటాన్‌చెరు పట్టణంలోని అంబేద్కర్‌ కాలనీలో, బండ్లగూడలో, కానుకుంట పరిధిలో మూడు బస్తీ దవాఖానలను మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న బల్దియా కార్మికులతో మంత్రి హరీశ్‌రావు ముచ్చటించారు. జాగ్రత్తలు పాటిస్తూ పని చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజర్షి షా, ఆర్డీవో నగేశ్‌, డీఎంహెచ్‌వో మోజీరాంరాథోడ్‌, డీఎంఈ రమేశ్‌రెడ్డి, కార్పొరేటర్లు అంజయ్యయాదవ్‌, సింధూఆదర్శ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పుష్పానగేశ్‌, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 

ముస్లింలకు రంజాన్‌ తోఫా..

గజ్వేల్‌: గజ్వేల్‌ ఐవోసీ సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ముస్లింలకు మంత్రి హరీశ్‌రావు రంజాన్‌ తోఫా, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకీయొద్దీన్‌ పాల్గొన్నారు. 


logo