శనివారం 06 జూన్ 2020
Medak - May 23, 2020 , 00:29:12

రైతు వేదిక.. రంది

రైతు వేదిక.. రంది

ఉమ్మడి జిల్లాలో 322 రైతు వేదికల నిర్మాణం

మరో 26ఏఈవో పోస్టుల నియామకం

ఉమ్మడి జిల్లాలో 69 రైతు బంధు సమితులు

నేటి నుంచి నియంత్రిత సాగుపై గ్రామ సభలు

సీఎం కేసీఆర్‌ సొంత ఖర్చులతో ఎర్రవల్లిలో రైతు వేదిక

అదే బాటలో మరికొందరు ప్రజాప్రతినిధులు, పెద్ద రైతులు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మెతుకు సీమ రైతాంగం ఇక నియంత్రిత వ్యవసాయ సాగు చేయనున్నది. అందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ వారికి అవగాహన కల్పించనున్నది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతులు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా సర్కారు ఈ విధానానికి శ్రీ కారం చుట్టింది. ఈ విధానం అమలులో రైతు బంధు సమితులు, వ్యవసాయ విస్తరణ(ఏఈవో)అధికారులు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న 26 ఏఈ వో పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 322 క్లస్టర్లలో రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం అధికారులు స్థలాలు గుర్తిస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్‌ సొంత ఖర్చుతో ఎర్రవల్లిలో రైతు వేదిక నిర్మించనున్నారు. సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సొంత ఖర్చులతో రైతు వేదికల నిర్మించేందుకు ముందుకొచ్చారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరికొంత మంది ప్రజాప్రతినిధులు ముందుకొచ్చే అవకాశాలున్నాయి. నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఈ వానకాలంలో ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్నకు అధికారులు క్రాప్‌ హాలీడే ప్రకటించారు. మిగతా ప్రధాన పంటలు కూడా అధికారులు సూచించిన విధంగానే సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించనున్నారు. శనివారం నుంచి గ్రామ సభల ద్వారా అన్నదాతలకు అవగాహన కల్పించనున్నారు..

రైతు బాగు కోసమే నియంత్రిత సాగు విధానం

సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ సర్కారు రైతు సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నది. ఇందులో భాగంగానే రైతుల కోసం వివిధ పథకాలు కూడా ప్రవేశపెట్టింది. వేల కోట్లు వెచ్చించి కాళేశ్వరం జలాలను పంటలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలు రాగా, సిద్దిపేట శివారులోని రంగనాయకసాగర్‌ గోదావరి జలాలతో కళకళలాడుతున్నది. ఈ వారం రోజుల్లో కొండపోచమ్మసాగర్‌లోకి నీరు చేరనున్నది. అయితే ఎలాంటి సాగు నీటి వనరులు లేకుండానే గడిచిన యాసంగిలో ఉమ్మడి జిల్లాలో సాగు చేసిన వరి పంటలో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్ల దిగుబడి వచ్చింది. ఇప్పటికే 4లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. కాళేశ్వర జలాలు ఉమ్మడి జిల్లాకు అందితే పంటల పరిస్థితి ఎలా ఉండనున్నదో ఊహించుకోవచ్చు. అయితే సాగు నీటి వసతి వచ్చిన తర్వాత ఎవరిష్టమున్న పంటలు వారు సాగు చేస్తే అనుకున్న ధరలు లేక నష్టపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేస్తున్నది. నేలల స్వభావాన్ని బట్టి ఏయే పంటలు వేయాలో అధికారులు సూచించనున్నారు. అధికారులు సూచించిన పంటలు వేసిన వారికే రైతుబంధు అమలు కానున్నది.

26 ఏఈవోల పోస్టుల నియామకం..

నియంత్రిత వ్యవసాయ సాగు విధానంలో వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో) కీలక పాత్ర పోషించనున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో పోస్టుల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని సర్కారు ఆదేశించింది. దీనితో తాత్కాలిక పద్ధతిలో పోస్టుల భర్తీకి వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 322 వరకు ఏఈవో పోస్టులుండగా, ప్రస్తుతం 296 మంది పనిచేస్తున్నారు. 26 వరకు ఖాళీలున్నాయి. సిద్దిపేట జిల్లాలో 15, మెదక్‌ 7, సంగారెడ్డి జిల్లాలో 4 పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు.

ఉమ్మడి జిల్లాలో 322 రైతు వేదికలు

ఉమ్మడి జిల్లాలో ప్రతి ఐదు వేల ఎకరాలను ఓ క్లస్టర్‌గా విభజించారు. ఒక్కో క్లస్టర్‌కు ఏఈవో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి క్లస్టర్‌లో రైతు వేదిక ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో కలెక్టర్లు స్థలాల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. 5వేల ఎకరాలకు క్లస్టర్‌ చొప్పున సిద్దిపేట జిల్లాలో 127, సంగారెడ్డి జిల్లాలో 118, మెదక్‌ జిల్లాలో 77 రైతు వేదికలు ఏర్పాటు కానున్నాయి. ఈ వేదికలతో స్థానికంగా రైతులకు అన్ని రకాల సూచనలు, సలహాలు అందనున్నాయి. నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై ఈ వేదికల నుంచే వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించనున్నారు. రైతు వేదికలో ఏఈవోకు ప్రత్యేక కార్యాలయం ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించుకోవడానికి వీలుగా టీవీ, కంప్యూటర్‌ ఉంటాయి. ఈ క్లస్టర్‌ పరిధిలోని రైతుల వివరాలు ఈ కార్యాలయంలో అందుబాటులో ఉండేలా చూస్తారు. 

సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో ముందుకు..

సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో ఉమ్మడి జిల్లాలో సొంత ఖర్చులతో ‘రైతు వేదిక’ల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, పెద్ద రైతులు ముం దుకొచ్చే అవకాశాలున్నాయి. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్‌ సొంత ఖర్చులతో రైతు వేదిక నిర్మించనున్నట్లు ప్రకటించగా, అదే స్ఫూర్తితో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తన స్వగ్రామం హవేలిఘనపురం మండలం కూచన్‌పల్లిలో సొంత ఖర్చుతో రైతు వేదిక నిర్మించనున్నారు. అలాగే, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తన స్వగ్రామం సిద్దిపేట రూరల్‌ మండలం ఇర్కోడు గ్రామంలో రైతు వేదిక నిర్మించేందుకు ముం దుకొచ్చారు. వీరి స్ఫూర్తితో మరికొందరు ప్రజాప్రతినిధులు ముందుకు రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లాలో 50 రైతు వేదికలకు రెవెన్యూ అధికారులు స్థలాలను గుర్తించారు. మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో కూడా గుర్తింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది.

నేటి నుంచి గ్రామ సభలు...

నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఇందుకోసం వ్యవసాయ అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామాల్లోని రైతులు, ప్రజా ప్రతినిధులు, రైతు సమితి సభ్యులందరూ ఈ సభల్లో పాల్గొననున్నారు. ఏఈవోలు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొని నియంత్రిత సాగుపై అవగాహన కల్పించనున్నారు. ఏ పంటలు సాగు చేయాలి? ఎందుకు సాగు చేయాలి? మొక్కజొన్న వంటివి ఎందుకు సాగు చేయొద్దు? విత్తనాలు, ఎరువుల సరఫరా, రైతు బంధు, రైతుబీమా లాంటి అన్ని అంశాలపై సభల్లో చర్చించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు సూచించిన పంటలే సాగు చేసేలా రైతులను ఒప్పించనున్నారు. కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతు బంధు సమితి జిల్లా, మండల కో-ఆర్డినేటర్లు పాల్గొని అన్నదాతలకు సూచనలివ్వనున్నారు.


logo