సోమవారం 19 అక్టోబర్ 2020
Medak - May 22, 2020 , 01:23:23

వివాహం.. నిరాడంబరం

వివాహం.. నిరాడంబరం

మెదక్‌ : కరోనా నేపథ్యంలో హంగు ఆర్భాటాలు లేకుండా పెండ్లిండ్లు.. శుభకార్యాలు.. ఇతర వేడుకలు ఇండ్లల్లోనే జరుగుతున్నాయి. గతంలో వివాహాలు, సీమంతం వంటి వేడుకలు ఇండ్లలోనే జరిగేవి. లాక్‌డౌన్‌తో పాత పరిస్థితి మళ్లీ వచ్చింది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో మెదక్‌ జిల్లాలో సుమారుగా 600 నుంచి 800 వరకు పెండ్లిండ్లు జరిగేవి. కానీ, వైరస్‌ ప్రభావంతో చాలా మంది వివాహాలను వాయిదా వేసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 450 పెండ్లిండ్లు జరిగినట్లు సమాచారం. కొంత మంది మంచి మహూర్తాలు ఉన్నా, వివాహాలు వాయిదా వేసుకున్నారు. మరికొంత మంది ఇండ్లలోనే భౌతిక దూరం పాటిస్తూ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. గ్రామ పంచాయతీల్లో జరిగే పెండ్లిండ్లను గ్రామ కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు. 20మంది కంటే ఎక్కువ మంది హాజరు కావద్దనే నిబంధనలు విధిస్తున్నారు.

రెండు శాఖల సమన్వయంతో..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పెండ్లిండ్లకు రెండు శాఖల సమన్వయంతో అనుమతులు ఇస్తున్నారు. ఎవరు పెండ్లి చేసుకున్నా, ముందుగా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత పెండ్లి కార్డుతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వోను కలిస్తే ఆయన ఎస్పీ కార్యాలయానికి లేఖ ద్వారా సిఫార్సు చేస్తున్నారు. మళ్లీ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అనుమతులు పొందాల్సి ఉంటుంది. దీంతో రెండు శాఖల సమన్వయంతో పెండ్లిండ్లకు అనుమతులు ఇస్తున్నారు. పెండ్లిండ్లు చేసే వారు అనుమతి పొందిన తర్వాతే ఇండ్లల్లో పెండ్లిండ్లు చేసుకుంటున్నారు.logo