గురువారం 09 జూలై 2020
Medak - May 22, 2020 , 00:38:31

సాగుకు సన్నద్ధం

సాగుకు సన్నద్ధం

మొక్కజొన్న వద్దేవద్దు 

మెదక్‌లో 2.60 లక్షల ఎకరాల్లో పంటలు 

సిద్దిపేట జిల్లాలో 4,99,963 ఎకరాలు.. 

కంది, పప్పు, వాణిజ్య పంటలకు ప్రోత్సాహం  

నియంత్రిత పంటల సాగుపై డ్రాఫ్ట్‌ మ్యాపింగ్‌ సిద్ధం 

సిద్దిపేట జిల్లాలో 4,99,963 ఎకరాల్లో..

సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో వానకాలంలో ఏయే పంటలు వేయాలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వానకాలం నుంచి నియంత్రిత పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఈ సారి మొక్కజొన్న సాగు చేయవద్దని రైతులకు సూచించింది. అందుకనుగుణంగా రైతాంగం సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు వ్యవసాయ శాఖ వానకాలం పంటల సాగుపై సమగ్ర నివేదిక తయారు చేయగా, త్వరలోనే సర్కారుకు అందించనున్నది. రెండు మూడు రోజుల్లో రోహిణి కార్తె ఆరంభం కానున్నది. రోహిణిలో విత్తితే దిగుబడులు అధికంగా వస్తుందని రైతుల నమ్మకం. ఒక వైపు వేసవి దుక్కులు సిద్ధం చేస్తూ, మరో వైపు నార్లు పోస్తున్నారు. 

 సిద్దిపేట/మెదక్‌, నమస్తే తెలంగాణ

సిద్దిపేట జిల్లాలో ఈ వానకాలంలో 4,99,963 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నాయి. ఆయా మండలాల్లో ఏయే పంటలు సాగు చేయాలో వ్యవసాయాధికారులు రైతాంగానికి అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో వ్యవసాయ అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు.

జిల్లాలో ప్రధానంగా వరి, కంది, పత్తి, జొన్న, పెసర్లు, మినుములు, ఆముదం, ఇతర పంటలను సాగు చేయాలని రైతులకు ప్రభుత్వం సూచించింది. వానకాలంలో మొక్కజొన్న పంట వేయవద్దని దీనికి బదులుగా పత్తి, కంది పంటలను సాగు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం సూచించింది. జిల్లాలో గత వానకాలంలో 4,99,127 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈసారి 4,99,963 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత సంవత్సరం వరి పంట 1,27,020 ఎకరాల్లో ఉండగా, ఈ వానకాలం 1,50,368 ఎకరాల్లో సాగు చేయాలన్న లక్ష్యం పెట్టారు. గతేడాది కన్న ఈ ఏడాది వరి పంట సుమారుగా 25 ఎకరాలు పెరుగనున్నది. గతేడాది కంది పంట 15,249 ఎకరాలుండగా, ఈ వానకాలంలో 70,120 ఎకరాలు సాగు చేయాలని లక్ష్యం పెట్టారు. కంది పంట జిల్లాలో ఎక్కువ సాగు కానున్నది. పత్తి పంట గత వానకాలంలో 2,32,514 ఎకరాలు సాగు కాగా, ఈ వానకాలం 2,73,401 ఎకరాల్లో సాగు చేసే లక్ష్యం. సుమారుగా 40 వేల ఎకరాల సాగు విస్తీర్ణం పెరుగనున్నది. ఇలా పెసర్లు, మినుములు, ఆముదం తదితర పంటల సాగు విస్తీర్ణం కూడా పెరుగనున్నది. ప్రభుత్వ సూచన మేరకు మొక్కజొన్న పంట సాగు చేయవద్దని వ్యవసాయ శాఖ అధికారులు రైతులను కోరుతున్నారు. ఈ మేరకు రైతు ఆగ్రోస్‌ సెంటర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

మెదక్‌లో 2.60 లక్షల ఎకరాల్లో..

మెదక్‌ జిల్లాలో 2.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకు వ్యవసాయ అధికారులు అంచనాలు తయారు చేశారు. ఇందులో అత్యధికంగా 1.35 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యే అవకాశముంది. ఇందులో కచ్చితంగా 40శాతం సన్నరకాల వరి 60 వేల ఎకరాల్లో సాగుకు రైతన్నలను సమాయత్తం చేస్తున్నారు. మొక్కజొన్న స్థానంలో పత్తి విస్తీర్ణం పెంచనున్నారు. 79 వేల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసేందుకు అంచనాలు తయారు చేశారు. 10 వేల ఎకరాల్లో పెసర్లు, 4వేల ఎకరాల్లో జొన్నలు, 3వేల ఎకరాల్లో మినుములు, 1500 ఎకరాల్లో చెరుకు, 500 ఎకరాల్లో ఆముదం పంటసాగుకు అంచనాలు తయారు చేశారు. గత వానకాలంలో అన్ని పంటలు కలిపి 2.47 లక్షల ఎకరాల్లో సాగైంది. అదనంగా 13 వేల ఎకరాల్లో ఈ వానకాలం సంబంధించిన పంటల సాగు పెరిగింది.

మొక్కజొన్న స్థానంలో పత్తి 

మెదక్‌ జిల్లాలో వానకాలం పంటల సాగు అంచనాలను ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. మొక్కజొన్న పంట స్థానంలో పత్తి పంట విస్తీర్ణం గణనీయంగా పెంచుతున్నాం. 79 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేసేలా ప్రోత్సహిస్తాం. రైతులంతా ఒకే రకమైన పంటల సాగుతో పండించిన పంటలకు ధరలేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలి.

- పరశురాం నాయక్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మెదక్‌

ప్రభుత్వం సూచించిన పంటలే వేయండి

జిల్లాలో ఏయే పంటలు వేయాలో ప్రభుత్వం సూచించింది. ఆ విధంగానే రైతులు విత్తనాలు కొనుగోలు చేసుకోవాలి. గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు పంటలపై అవగాహన కల్పించనున్నాం. జిల్లాలో మొక్కజొన్న పంటను ఏ ఒక్క రైతు కూడా సాగు చేయవద్దు. పత్తి, కంది పంటలను ఎక్కువగా సాగు చేయాలని జిల్లా రైతాంగానికి సూచిస్తున్నాం.

- శ్రావణ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, సిద్దిపేట


logo