శుక్రవారం 30 అక్టోబర్ 2020
Medak - May 20, 2020 , 23:36:26

మంజీరపై 15 చెక్‌డ్యామ్‌లు: మంత్రి హరీశ్‌రావు

మంజీరపై 15 చెక్‌డ్యామ్‌లు: మంత్రి హరీశ్‌రావు

మెదక్‌, నమస్తే తెలంగాణ/ మెదక్‌ రూరల్‌: మంజీర నదిపై రూ.1,200 కోట్లతో నిర్మిస్తున్న 15 చెక్‌డ్యామ్‌ల ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం హవేళీఘణపూర్‌ మండలం సర్దన గ్రామ శివారులో 12.50 కోట్లతో మంజీర నదిపై చెక్‌డ్యామ్‌ను నిర్మించేందుకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు మెదక్‌ మండలం ర్యాలమడుగు శివారులో నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ పనులను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం మరికొద్ది రోజుల్లో మెదక్‌ జిల్లాకు అందుతుందన్నారు. కొండపోచమ్మ సాగర్‌కు నీరు వచ్చిన వెంటనే హల్దీ ద్వారా బొల్లారం మత్తడికి వస్తాయన్నారు. అక్కడి నుంచి సర్దన చెక్‌డ్యామ్‌, కూచన్‌పల్లి చెక్‌డ్యామ్‌కు కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. బొల్లారం మత్తడి కింద 13 వేల ఎకరాలకు ఆయకట్టుకు కాళేశ్వరం జలాలు ఇవ్వవచ్చని మంత్రి తెలిపారు. మంజీర నదిపై సమైక్యపాలకులు 60 ఏండ్ల నుంచి చెక్‌డ్యామ్‌ లు నిర్మించలేదని, 15 చెక్‌డ్యాంలు మంజూరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఫసల్వాది నుంచి సర్దన వరకు మంజీరపై చెక్‌డ్యాం పనులు చేపట్టామన్నారు. రూ.12.50 కోట్లతో నిర్మిస్తున్న సర్దన చెక్‌డ్యాం వల్ల పాపన్నపేట మండలంలో 3 గ్రామాలు, ఘణపురంలో 2 గ్రామాలు లబ్ధి పొందుతాయన్నారు. 2 వేల ఎకరాలకు ఈ ఆయకట్ట వల్ల నీరందుతుందని మంత్రి తెలిపారు.   

సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు

మెదక్‌ / మెదక్‌ టౌన్‌ / రామాయంపేట: తలసేమియా బాధితులు, గర్భిణుల సహాయార్థం బుధవారం మెదక్‌ టీఎన్జీవో భవన్‌లో టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంరావు, నరేందర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మంత్రి హరీశ్‌రావు స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మెదక్‌ పట్టణంలోని 7, 8, 9 వార్డుల్లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రామాయంపేట మండలంలోని ఝాన్సీలింగాపూర్‌లో సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం రామాయంపేట పట్టణంలోని బాలాజీ గార్డెన్‌లో రేషన్‌ కార్డులు లేని నిరుపేదలకు నిత్యావసరాలు, బియ్యం పంపిణీ చేశారు. 

చింతమడకను మోడల్‌గా నిలుపుదాం 

సిద్దిపేట కలెక్టరేట్‌ / సిద్దిపేట రూరల్‌: చింతమడక గ్రామాభివృద్ధి దేశంలోనే మోడల్‌గా నిలుపాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్‌ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డితో కలిసి చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్‌, దమ్మచెరువు, అంకంపేట ప్రజాప్రతినిధులతో గ్రామ పునర్నిర్మాణ ప్రగతి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వారం రోజులలోపు ఆయా గ్రామాల్లోని ఇండ్లను తొలిగించి ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. బుధవారం చింతమడకకు చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు హనుమగారి మల్లేశం కూతురు వివాహానికి ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. 

వానకాలంలోనే చెరువులు నింపుకుందాం 

దుబ్బాక: ఈ వాన కాలంలోనే చెరువులన్నీ నింపుకుందామని కాల్వల నిర్మాణాలకు రైతులు సహకరించాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హసన్‌మీరాపూర్‌లో బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీలోని డిస్ట్రిబ్యూటరీ -1, 6 ఆర్‌ కాల్వ నిర్మాణ పనులు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఈ వానకాలంలోపే మన ప్రాంత చెరువులు నింపుకుందామన్నారు. స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు ముందుకొచ్చి పనుల వేగవంతానికి సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఆనంద్‌, డీఈ రవీందర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.