ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - May 20, 2020 , 23:33:20

పేదలు ఆత్మగౌరవంతో బతకాలి:మంత్రి హరీశ్‌రావు

పేదలు ఆత్మగౌరవంతో బతకాలి:మంత్రి హరీశ్‌రావు

హవేళిఘనపూర్‌లో డబుల్‌ బెడ్రూం ఇండ్లు ప్రారంభం

మెదక్‌, నమస్తే తెలంగాణ: పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే సదుద్దేశంతో వారికి డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం ఆయన మండల కేంద్రమైన హవేళిఘనపూర్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్‌ నగేశ్‌తో కలిసి 40 డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించాలనే సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల నిర్మాణాలు చేపట్టారన్నారు. నిరుపేదలైన గంగిరెద్దుల కుటుంబాలకు 40 డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లను నిర్మించి ఇవ్వడం సంతోషకరమన్నారు. కాగా, హవేళిఘనపూర్‌ మండలానికి 5వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యంగల గోదాంలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

అవసరమైన స్థలాన్ని కేటాయించాలని సంబంధిత అధికారుల ను మంత్రి ఆదేశించారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో వర్షాకాలంలో మొక్కజొన్న సాగు చేయొద్దని మార్కెట్‌లో అంతగా డిమాండ్‌ లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నియంత్రిత పద్ధతిలో పంటలను పత్తి, కందులు రైతులు పంట మార్పిడి విధానంగా వేయాలని సూచించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను సన్మానించారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, ఎంపీపీ అధ్యక్షుడు శేరి నారాయణరెడ్డి, జడ్పీటీసీ సుజాతశ్రీనివాస్‌ రెడ్డి, ఆర్డీవో సాయిరాం, ఎమ్మార్వో, ఎంపీడీవోలు పాల్గొన్నారు. 

కల నెరవేరుతున్నది..

పేదవారికి సొంత ఇల్లు ఉండాలనే సీఎం కేసీఆర్‌ కల నెరవేరుతున్నది. హవేళిఘనపూర్‌ 40 డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. హవేళిఘనపూర్‌లో మరో 50 డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లను మంజూరు చేస్తున్నాం.

- ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ పేదల ప్రభుత్వం..

పేదలకు లబ్ధి చేకూరే పథకం డబుల్‌ బెడ్రూమ్‌ పథకం. హవేళిఘనపూర్‌లో నిరుపేద కుటుంబాలకు 40 ఇండ్లు ప్రభుత్వం నిర్మించి ఇవ్వడం సంతోషంగా ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, అన్ని వర్గాల వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. 

- ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి 


logo