శనివారం 24 అక్టోబర్ 2020
Medak - May 04, 2020 , 00:43:56

సైబర్‌ నేరగాళ్లతో జర భద్రం

సైబర్‌ నేరగాళ్లతో జర భద్రం

  •  సీపీ జోయల్‌ డెవిస్‌

సిద్దిపేట టౌన్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ పరిధిలో లాక్‌డౌన్‌ అమలు, నిబంధనల ఉల్లంఘన లు, సైబర్‌ నేరస్తులపై జాగ్రత్తలు, అనవసర పుకార్లు తదితర అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ సీపీతో ఇంటర్వ్యూ నిర్వహించింది.

జిల్లాలో లాక్‌డౌన్‌ ఎలా అమలవుతుంది?

సిద్దిపేట కమిషనరేట్‌లో లాక్‌డౌన్‌కు ప్రజలందరూ బాగా సహకరిస్తున్నారు. 889 పోలీసు బలగాలు గట్టి గస్తీని చేపడుతున్నాయి. రాత్రివేళ కర్ఫ్యూ పటిష్టంగా అమ లు చేస్తున్నాయి. నిరంతరం వాహనాల తనిఖీ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, బ్యాంకుల వద్ద ప్రజలు గుమిగూడకుండా సామాజిక దూరం పాటించేలా చూస్తున్నాం. విదేశాల నుంచి వచ్చిన 197మంది పాసుపోర్టులను సీజ్‌ చేశాం. 464 మందిని హోంక్వారంటైన్‌లో ఉం చాం. ఇటీవలే వారి క్వారంటైన్‌ ముగిసింది. అయినా జాగ్రత్తలు పాటించాలి. 

లాక్‌డౌన్‌ ఉల్లంఘనులపై ఎలా వ్యవహరిస్తున్నారు?

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ప్రధానంగా జిల్లా లో నాలుగు ప్రాంతాల్లో బార్డర్‌ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాం. రాజీవ్హ్రదారి పొడవునా బెజ్జంకి, వంటిమామిడి, చేర్యాల పోలీసుస్టేషన్‌ ఎక్స్‌రోడ్‌, భూంపల్లి వద్ద నిరంతరం తనిఖీలు చేస్తున్నాం. వీటితో పాటు లాక్‌డౌన్‌లో నిబంధనలు ఉల్లఘించి దుకాణాలు, పరిశ్రలను తెరిచిన వారితో పాటు రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై కేసులు నమోదు చేశాం.

నేరాల నమోదు ఎలా ఉంది?

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నేరాల సంఖ్య బాగా తగ్గింది. కరోనా నిరోధానికి ప్రజలందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. అదే సమయంలో పోలీసు శాఖ గట్టి బందోబస్తు చేపడుతున్నది. దీంతో జిల్లాలో దొంగతనాలు 4, రోడ్డు ప్రమాదాలు 21, ఆత్మహత్యలు 7.. ఇలా లాక్‌డౌన్‌ పిరియడ్‌లో 31 కేసులు నమోదయ్యాయి. 

లాక్‌డౌన్‌లో నమోదైన కేసులు ఎన్ని? 

ఇప్పటివరకు జిల్లావ్యాపంగా 2,266 వాహనాలను సీజ్‌ చేశాం. నిబంధనలకు విరుద్ధ్దంగా షాపులను తెరిచిన 198 మంది పై కేసులు నమోదయ్యాయి. అలాగే, అక్ర మంగా మద్యం విక్రయిస్తున్న 62 మందిపై కేసులు నమోదు చేసి, రూ.9,10,600 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. దీంతోపాటు 52 మంది పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసి, రూ.3,34,280 నగదును సీజ్‌ చేశాము.

జిల్లాలో సైబర్‌ నేరగాళ్ల వలకు ఎవరైనా చిక్కారా?  

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ చెల్లింపులు బాగా పెరిగాయి. సిద్దిపేట జిల్లాలో సైబర్‌ నేరాలు నమోదు కాలేదు. ముందు నుంచి వాటిపై ప్రజలను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేశాం. ఇతర జిల్లాల్లో ఇలాంటి కేసులు నమోదైనట్లు తెలుస్తున్నది. సైబర్‌ కేటుగాళ్లు అమాయకులను టార్గెట్‌ చేస్తూ ముగ్గులోకి దించుతున్నారు. బ్యాంకు అధికారులమంటూ ఓటీపీ, బ్యాం కు ఖాతా నంబర్లు, ప్రభుత్వం ఇటీవల రేషన్‌కార్డుదారులకు వేసిన రూ.1500 నగదు పడ్డాయా? అంటూ ఆరా తీస్తున్నారు. వా రు అడిగివన్నీ చెబితే క్షణాల్లో మీ ఖాతాలో ఉన్న డబ్బులు మాయమవుతాయి. ఏ బ్యాంకు అధికారి కూడా ఫోన్‌ చేసి ఖాతా నంబరు, ఓటీపీ నంబరు అడుగరని చెబుతున్నాం. అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం.

వదంతులు, పుకార్లు పుట్టించే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

కరోనా వచ్చిందని తప్పుడు ప్రచారాలు చేస్తున్న వదంతులను ప్రజలెవరు నమ్మవద్దు. వాట్సాప్‌ గ్రూపులు, సామాజిక మా ధ్యమాల్లో పోస్టులు చేసే వారిపై గట్టి నిఘా పెట్టాం. గ్రూపు అడ్మిన్‌పైన కఠిన చర్యలు తీసుకుంటాం. అధికారికంగా ప్రభుత్వం ధ్రువీకరించిన వాటిని మాత్రమే నమ్మాలి.

మాస్క్‌లు ధరించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

రోడ్లపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్ము, పానుపరాగ్‌లు ఉమ్మే వారిపై డ్రోన్‌ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టాం. ఇంటి నుంచి బయటకు వెళ్లే వారు మాస్క్‌లు, కర్చీఫ్‌లు తప్పకుండా కట్టుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తాం. 

లాక్‌డౌన్‌ పై ప్రజలకు ఏ విధమైన సూచనలు ఇవ్వనున్నారు?

ప్రజలందరూ స్వీయనియంత్రణ పాటించి ఇంట్లోనే ఉండాలి.  కుటుంబంలో ఒకరు మాత్రమే బయటకొచ్చి, కావాల్సిన నిత్యావసర సరుకులను తీసుకెళ్లాలి. ఆపత్కాలంలో వైద్య సేవల కోసం డయల్‌ 100, కమిషనరేట్‌ వాట్సాప్‌ 79011 00100, పోలీసు కంట్రోల్‌ రూం 83339 98699, సిద్దిపేట ఏసీపీ 9409617009, గజ్వేల్‌ ఏసీపీ 8333998684, హుస్నాబాద్‌ ఏసీపీ 7901640468ను సంప్రదిస్తే వెంటనే  స్పందించి సహకరిస్తామన్నారు. 

ఆన్‌లైన్‌లో లాక్‌డౌన్‌ పాసులు 

సిద్దిపేట టౌన్‌ : లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న క్రమంలో ఇతర రాష్ర్టాలకు వెళ్లే విద్యార్థులు, వలస కార్మికులతోపాటు వైద్యసేవలు అవసరమయ్యేవారికి  ప్రత్యేక పాసులు ఇస్తున్నం. లాక్‌డౌన్‌ పాసులు ఇవ్వడానికి పోలీసుశాఖలో ఈ- పాస్‌ విధానం అమలు చేస్తున్నట్లు సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట కమిషనరేట్‌లో చిక్కుకున్న విద్యార్థులు, వలస కార్మికులు, ఇతర ప్రాం తాల వెళ్లేవారు tsp. koopid. ai/epass లేదా tspolice.gov.in వెబ్‌సైట్‌ల్లోని లాక్‌డౌన్‌ ఈ-పాస్‌ ఆప్షన్‌ ద్వారా పాసులను పొందవచ్చన్నారు. ఈ- పాసులు కావాల్సిన వ్యక్తులు 48గంటలు ముందుగా వెబ్‌సైట్‌లో సూచించిన గుర్తింపు పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన వివరాలు ఆమోదం పొందిన తర్వాత ఈ-పాసులను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఈ- పాసుల కోసం కమిషనరేట్‌ కార్యాలయానికి ఎవరూ రావొద్దని సీపీ సూచించారు. సైబర్‌ నేరస్తులతో అప్రమత్తంగా ఉండాలని గూగుల్‌, ఫోన్‌పే ఇతర యూపీఐ నంబర్లు చెప్పి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. అపరిచిత వ్యక్తులు పంపిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయవద్దని, ఎనీడెస్క్‌, QUICK, VIEWR యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయొద్దన్నారు. 


logo