గురువారం 22 అక్టోబర్ 2020
Medak - May 04, 2020 , 00:32:58

గోదావరి పరుగులు

గోదావరి పరుగులు

  • చెక్‌డ్యామ్‌లు, చెరువుల్లోకి చేరుతున్న గోదావరి జలాలు 
  • నీళ్లను చూసి మురిసిపోయిన జనం  
  • ఎక్కడికక్కడ పూజలు, పుష్పాభిషేకాలు 
  • కాల్వలు, చెరువులను పరిశీలించిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు 
  • 20 ఏండ్ల తర్వాత నిండిన దానంపల్లి చెరువు

సిద్దిపేట కలెక్టరేట్‌/చేర్యాల,నమస్తేతెలంగాణ/సిద్దిపేట అర్బన్‌/నారాయణరావుపేట/నంగునూరు /చిన్నకోడూరు : రంగనాయకసాగర్‌ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేయడంతో గోదారమ్మ గలగలమంటూ ఊళ్లకు చేరుతున్నాయి. కాల్వల ద్వారా చెక్‌డ్యామ్‌లు దాటుకుంటూ చెరువుల్లోకి ప్రవేశిస్తున్నాయి. నిండు వేసవిలోనూ చెరువులు మత్తడి దుంకుతుండడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆదివారం సిద్దిపేట అర్బన్‌ మండలం మందపల్లి-నర్సాపూర్‌ గ్రామశివార్లలోని కుడికాల్వ, చెక్‌డ్యాంల ద్వారా పారుతున్న నీటిని, మత్తడి దుంకుతున్న చేర్యాల మండలం దానంపలిల్లో చెరువు, నారాయణరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో కాల్వలను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. గ్రామస్తులతో కలిసి పూజలు నిర్వహించి జలహారతి పట్టారు. మం త్రికి మహిళలు బోనాలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. నంగునూరు మండలం రాజగోపాల్‌పేట, ముం డ్రాయి, కోనాయిపల్లి, తిమ్మాయిపల్లి, నర్మెట, వెంకటాపూర్‌, సిద్ధన్నపేట గ్రామాల నుంచి వెళ్తున్న గోదారమ్మను చూసి మంత్రి ఉప్పొంగిపోయారు. గోదావరి జలాలకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పూజలు చేశారు. వెంకటాపూర్‌ శివారులో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి శివారులో నంగునూరు మండలానికి వెళ్లే కుడికాలువ, పైప్‌లైన్‌ ద్వారా ప్రవహిస్తున్న నీటిని పరిశీలించారు. అక్కడినుంచి చేర్యాల మండలం దానంపల్లి చెరువును పరిశీలించి రైతులతో మంత్రి మాట్లాడారు. పైప్‌లైన్‌ ద్వారా మందపల్లి చెరువులు,కుంటలు నింపుతూనే సిద్దిపేట వాగులోకి నీళ్లు చేరుతాయన్నారు. వీటితోపాటు 28 చెక్‌డ్యాంలు, 11 గ్రామాల్లో చెరువులు,కుంటలు నింపడమే కాకుండా కోహెడ మండలం శనిగరం చెరువు పూర్తిగా నిండనుందని చెప్పారు. గతంలో చేర్యాల మండలం దానంపల్లి చెరువు నీళ్లు లేక ఎండిపోయిందని, ఇకనుంచి నిండుడే తప్ప ఎండదని స్పష్టం చేశారు. ఆయకట్టు చివరి రైతులకు నీటిని అందించేందుకు భూసేకరణ జరుగుతుందని, దీనికి సహకరించాలని కోరారు.మంత్రితో సెల్ఫీలు తీసుకునేందుకు గ్రామస్తులు పోటీపడ్డారు. ఆయా కార్యక్రమాల్లో సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, సిద్దిపేట పట్టణ కౌన్సిలర్లు నర్సింలు, వేణుగోపాల్‌రెడ్డి, చంద్రకాంత్‌, సర్పంచ్‌ రాజయ్య, మాజీఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి,  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సోంరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కిష్టారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, సీనియర్‌ నాయకులు మల్లయ్య, పురేందర్‌, సారయ్య, చిట్యాల సర్పంచ్‌ ఎర్రవెల్లి రామ్మోహన్‌రావు, నాయకులు బుర్ర శ్రీనివాస్‌, శ్రీనివాస్‌రెడ్డి, సుధీర్‌, కనకయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. 


తూములకు యుద్ధప్రాతిపదికన గేట్లు బిగించాలి : రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ కుడి,ఎడమ కాల్వల పరిధిలోని రైతులు గోదావరి నీటిని వృథా చేయకుండా నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని తన నివాసంలో ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కుడి,ఎడమ కాల్వల ద్వారా గ్రామాల వారీగా చెరువులు, కుంటలు, వాగులు నింపనున్న అంశాలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కుడి,ఎడమ కాల్వల తూములకు యుద్ధప్రాతిపదికన గేట్లు బిగించాలని ఆదేశించారు. చివరి ఆయకట్టు రైతులకు సాగు నీరందేలా రైతులు సహకరించాలని, ఇందుకు తహసీల్దార్లు, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు. రైతుల అవసరాలు గుర్తించి నీటి విడుదలలో హెచ్చుతగ్గులు చేయాలని, ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతి ద్వారా నీటి విడుదల చేసి రైతులు అవసరమున్నంత వాడుకొని తూములను మూసివేసేలా చొరవ చూపాలని కోరారు. త్వరలో రైతులకు నీటి పొదుపుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు సిమెంట్‌-కాంక్రీట్‌ లైనింగ్‌ అసంపూర్తి పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్‌ డీఈ గోపాలకృష్ణ, చిన్నకోడూరు, నంగునూరు తహసీల్లార్లు పాల్గొన్నారు.  

అద్దె బస్సుల డ్రైవర్ల కుటుంబాలకు సరుకుల పంపిణీ : 140 మంది అద్దె బస్సుల డ్రైవర్ల కుటుంబాలకు మంత్రి నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు.సిద్దిపేట వైశ్య ఫ్యామిలీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 600 మంది వైశ్య కుటుంబాలకు నిత్యావసరాల కిట్లు, శానిటైజర్లు, మాస్క్‌లు పంపిణీ చేశారు. కరోనా నివారణ చర్యల కోసం అసోసియేషన్‌ రూ.25 వేల విరాళాన్ని మంత్రికి అందించింది. అలాగే  సిద్దిపేటకు చెందిన జర్నలిస్టు చంద్రమౌళి సతీమణి ఇటీవల మృతిచెందడంతో మంత్రి హరీశ్‌రావు ఆయన ఇంటికెళ్లి పరామర్శించారు.  

రంగనాయకసాగర్‌ను చూసిన సిద్దిపేట వైద్యులు : రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ను మంత్రి హరీశ్‌రావుతో కలిసి సిద్దిపేట ప్రైవేట్‌ వైద్యులు, సీనియర్‌ వైద్యులు సందర్శించారు. ఇది కలా..నిజమా.. అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంత్రి వారికి నీటిని చూపుతూ ప్రాజెక్టు గురించి వివరించారు. సీనియర్‌ డాక్టర్‌ రామచందర్‌రావు చిన్నకోడూరు చెరువులకు నీళ్లొచ్చినయా అడుగగా..చిన్నకోడూరు చెరువుకే కాదు..అన్ని చెరువులకు నీళ్లొస్తున్నాయి.. రేపోమాపో మత్తడి దుంకుతది అని చెప్పారు. 


logo