శనివారం 31 అక్టోబర్ 2020
Medak - May 01, 2020 , 00:42:03

ఆపత్కాలంలో ఆసరా..

ఆపత్కాలంలో ఆసరా..

  • నేటి నుంచి మరో విడుత బియ్యం, నగదు పంపిణీ

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకు మరో విడుత బియ్యం, నగదు పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడుత పంపిణీ చేసింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్న క్రమంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఆహార భద్రత కార్డులున్న ప్రతి కుటుంబానికి రూ.1500 నగదుతో పాటు కార్డులోని కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం అందిస్తున్నది. కాగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని సంగారెడ్డిలో 845, సిద్దిపేటలో 680, మెదక్‌ జిల్లాలో 521 రేషన్‌ దుకాణాలున్నాయి. ఇందులో మొత్తం తెల్లకార్డులు 8,15,458, అంత్యోదయ 59,756, అన్నపూర్ణ 278 కార్డులతో కలిసి మొత్తం 8,75,492 ఆహారభద్రత కార్డులున్నాయి. ఈ కార్డుల్లో 28,50,599 సభ్యులున్నారు. మొత్తం కార్డుల ద్వారా పంపిణీకి 3,43,27,188 కిలోల బియ్యం, నగదుకు రూ. 131,32,38,000 ప్రభుత్వం వెచ్చిస్తున్నది. మొదటి నెలలో బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తి కాగా, నగదు పంపిణీ కొనసాగుతున్నది. వివిధ కారణాలతో బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడని వారికి పోస్టాఫీసుల నుంచి రూ.1500 అందిస్తున్నారు. ఆపత్కాలంలో ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలుస్తుండడంతో ఉమ్మడి జిల్లాలోని అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇదిలాఉండగా, కార్డుదారులతో పాటు ఎలాంటి కార్డు లేని వారికి అంటే వలస కార్మికులకు కూడా ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ 5 కిలోల బియ్యం, రూ. 500 అందిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా జిల్లాల్లో ఉన్న వలస కార్మికులకు రెండో విడుత కూడా బియ్యం, నగదు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.

రేషన్‌తో పాటు కంది పప్పు..

మెదక్‌, నమస్తే తెలంగాణ: ఈ నెలలో సరఫరా చేసే రేషన్‌ బియ్యంతో పాటు కంది పప్పు, చక్కెర, గోధుమలు, ఉప్పును అందజేయనున్నట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్‌ గురువారం తెలిపారు. అంత్యోదయ కార్డుదారులకు కిలో చక్కెర రూ.13.50కు, మున్సిపల్‌ పరిధిలో కిలో గోధుమలు రూ.7, ఉప్పు కిలో రూ.5కు అందజేస్తామన్నారు.