సోమవారం 26 అక్టోబర్ 2020
Medak - Apr 24, 2020 , 02:17:39

రూ.౩౦ వేల కోట్లతో ధాన్యం కొనుగోళ్లు..

రూ.౩౦ వేల కోట్లతో ధాన్యం కొనుగోళ్లు..

  • వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  కరోనా విపత్తులోనూ రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ ఇబ్బందులు పడకూడదన్న సదుద్దేశంతో  సీఎం కేసీఆర్‌ రూ.30వేల కోట్లతో ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, గిడ్డంగుల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌లోనూ దేశంలోనే మొదట రైతులకు మినహాయింపు తెలంగాణ రాష్ట్రమే ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారిందన్నారు. గురువారం మెదక్‌ జిల్లా కొల్చారం, అప్పాజిపల్లి, చిన్నఘనపూర్‌, మెదక్‌ మండలంలోని మంబోజిపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పరిశీలించారు. కొల్చారంలో రైస్‌మిల్లును పరిశీలించారు. కలెక్టరేట్‌లో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డితో కలిసి పారిశుధ్య కార్మికులు, ద్వారకా గార్డెన్‌లో క్యాబ్‌ డ్రైవర్లకు రూ.500 నగదు, 12 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని నమ్మిన సీఎం కేసీఆర్‌ ఆశలు, ప్రస్తుతం సజీవమయ్యాయన్నారు. ఇప్పటి వరకు కాళేశ్వరం కాలువలతో నీరు సరఫరా అయిన గ్రామాల్లో ధాన్యపు రాశుల గలగలతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. గతంలో కంటే అదనంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 5 లక్షల 90 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైందన్నారు. దిగుబడి అంచనాలకు తగ్గట్టుగా 1027 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. రూ.3,213 కోట్లు మార్క్‌ఫెడ్‌కు సమకూర్చి రైతులు పండించిన మొక్కజొన్న పంటకు కొనుగోలుకు సీఎం కేసీఆర్‌ అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. ఇప్పటికే 70శాతం మక్కల కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు. శనగలు, జొన్నలు, పొద్దుతిరుగుడు పంటలను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినప్పటికీ సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ సమావేశంలో చర్చించి, తీర్మానించి చర్యలు తీసుకున్నారని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయశాఖ గ్రామీణాభివృద్ధిశాఖ, మార్కెటింగ్‌శాఖ, ఇతర శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనుగోలు జరుపుతున్నారని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో సంచార వాహనాలతో కూరగాయల అమ్మకాలు ప్రారంభించామన్నారు. ఫోన్‌ చేస్తే కేవలం రూ.300కే ఆరు రకాల స్వచ్ఛమైన పండ్లను డోర్‌ డెలివరీ చేసే సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. గడ్డిఅన్నారం మార్కెట్‌ను తిరిగి తెరుస్తామన్నారు. బత్తాయి రైతులకు న్యాయం చేసేందుకు నల్లగొండలో మార్కెట్‌ను ప్రారంభించామన్నారు. కోల్‌కత్తా, నాగ్‌పూర్‌, హైదరాబాద్‌ ఇతర ప్రాంతాల నుంచి ట్రేడర్లను పిలిపించి కొనుగోలు చేయిస్తామన్నారు. 

అనంతరం మెదక్‌ పీఏసీఎస్‌ భవనాన్ని మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, జిల్లా వ్యావసాయ శాఖ అధికారి పరుశురాం నాయక్‌, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ రమ్య, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ చిలుముల హనుమంత్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


logo