గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Apr 19, 2020 , 00:51:24

వలస కూలీలకు అండగా..

వలస కూలీలకు అండగా..

వెల్దుర్తి/పెద్దశంకరంపేట/ మెదక్‌, నమస్తే తెలంగాణ/ రేగోడ్‌ /మెదక్‌ రూరల్‌/ రామాయంపేట/ నిజాంపేట /వెల్దుర్తి/తూప్రాన్‌ రూరల్‌ : ఇతర రాష్ర్టాల కూలీలను అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయం, బస్వాపూర్‌లోని ఇటుక బట్టీల వద్ద వలస కూలీలకు ఒక్కొక్కరికి రూ.500 నగదు, 12కిలోల బియ్యం చొప్పున 12 మందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రమేశ్‌గౌడ్‌, సర్పంచ్‌ మల్లేశంగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

 పెద్దశంకరంపేటలోని 81 మంది వలసకూలీలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.500 నగదును ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, సర్పంచ్‌ ప్రకాశ్‌, తహసీల్దార్‌ మనోహర్‌ చక్రవర్తి పంపిణీ చేశారు. మెదక్‌లోని వలస కార్మిక కుటుంబాలను టీపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో 10కిలోల బియ్యం, 12రకాల నిత్యావసరాలు, మాస్కులు పంపిణీ చేశారు. రేగోడ్‌లోని వలస కార్మికులకు తహసీల్దార్‌ సత్యనారాయణ 12 కిలోల బియ్యం, రూ.500 నగదును అందజేశారు. కార్యక్రమంలో ఎంఆర్‌ఐ శ్యాంరావు, గ్రామకార్యదర్శి భాగయ్య, మాజీ సర్పంచ్‌ గోపాలకృష్ణ పాల్గొన్నారు. 

మెదక్‌ చర్చి కాంపౌండ్‌కు చెందిన విక్రం, రాజు, మెహన్‌, దయాసాగర్‌, నర్సింగ్‌ ఉదయ్‌కిరణ్‌ తదితరులు మెదక్‌లోని వలస కార్మికులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. రామాయంపేట లోని ఎస్సీ, బీసీ కాలనీల్లోని పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న  బియ్యం, నగదును తహసీల్దార్‌ శేఖర్‌రెడ్డి, చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, పుట్టి విజయలక్ష్మి, సరాఫ్‌ యాదగిరి, బాదె చంద్రం అందజేశారు. కౌన్సిలర్‌ శారద రాజు సొంత ఖర్చులతో ఇంటికో బ్యాగు, సరుకులను అందజేయగా లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు. 

నిజాంపేట మండలంలో కూలి పనుల నిమిత్తం మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి మండల కేంద్రంతో పాటు బచ్చురాజ్‌పల్లి, కల్వకుంట, నార్లపూర్‌ గ్రామాలకు వలస వచ్చిన 90 మంది వలస కూలీలకు  తహసీల్దార్‌ జైరాములు, నిజాంపేట పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కిష్టారెడ్డి, ఉప సర్పంచ్‌ బాబు ప్రభుత్వం అందిస్తున్న 12 కిలోల బియ్యం, నగదును అందజేశారు. తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌ శివారులోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సొరంగం పనులు చేపడుతున్న మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్‌ రాష్ర్టాల వలస కార్మికులకు  సర్పంచ్‌ మహాదేవి, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, వార్డు సభ్యులు ఆంజనేయులుగౌడ్‌, వీఆర్వో ప్రవీణ్‌కుమార్‌ 12కిలోల బియ్యం, రూ.500 నగదు, మాస్కు లు అందజేశారు.


logo