మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Apr 12, 2020 , 00:02:55

27 ఏండ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌

27 ఏండ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌

  • మెదక్‌ జిల్లాలో మరో కరోనా కేసు  
  • సంగారెడ్డి వ్యక్తి పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లికి రావడంతో వైరస్‌ వ్యాప్తి 
  • అతడి కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలింపు 
  • గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్‌, డీఎంహెచ్‌వో, అధికారుల బృందం
  • ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న 10 ప్రత్యేక బృందాలు

మెదక్‌ ప్రతినిధి,నమస్తేతెలంగాణ/పాపన్నపేట: ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన సంగారెడ్డికి చెందిన వ్యక్తి ద్వారా మెదక్‌ జిల్లాలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5కు చేరింది. సంగారెడ్డికి చెందిన ఓ బాధితుడు అమ్మమ్మ ఇల్లు పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లికి ఇటీవల వచ్చి ఉండడంతో ఆ ఇంట్లోని యువకుడికి (27)కి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు ధ్రువీకరించారు. నాగ్సాన్‌పల్లిలో ఈ ఇంటికి సంబంధించిన ఐదుగురిని క్వారంటైన్‌లో ఉంచి రక్త నమూనాలను పరీక్షలకు పంపించగా శుక్రవారం రాత్రి ఒకరికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. దీంతో ఆ యువకుడిని అధికారులు హుటాహుటిన హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడితో సన్నిహితంగా మెలిగిన ఏడుగురిని ఏడుపాయల హరిత రెస్టారెంట్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. పాపన్నపేట మండలంలో మొదటి సారి కేసు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ ధర్మారెడ్డి, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు, డీపీవో హనోక్‌, జిల్లా సర్వైలెన్స్‌ అధికారి డాక్టర్‌ నవీన్‌ ఆధ్వర్యంలో 10 వైద్య బృందాలు గ్రామానికి చేరుకొని ఇంటింటి సర్వే నిర్వహించాయి. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని, లాక్‌డౌన్‌ను పూర్తిగా పాటించాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. 

గ్రామంలో పారిశుద్ధ్య పనులు: పాజిటివ్‌ కేసు నేపథ్యంలో నాగ్సాన్‌పల్లి గ్రామంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అన్ని వీధుల్లో వైరస్‌ నిరోధక రసాయన ద్రవాలను పిచికారీ చేశారు. ప్రజలెవరూ బయటకు రాకుండా ఇంటింటికీ నిత్యావసర సరుకులు అందించేలా కలెక్టర్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. నాగ్సాన్‌పల్లితోపాటు పక్కనే ఉన్న శేరిపల్లిని కూడా హాట్‌స్పాట్‌గా ప్రకటించారు. గ్రామస్తులు బయటకు రాకుండా ఇండ్లల్లోనే ఉండాలని, బయటకొస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళితే పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గుమిగూడవద్దని, ఇతర గ్రామాలవారెవరూ నాగ్సాన్‌పల్లి, శేరిపల్లికి రావద్దని ఆయన సూచించారు. మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి, రూరల్‌ సీఐ రాజశేఖర్‌, పాపన్నపేట ఎస్సై ఆంజనేయుల ఆధ్వర్యంలో గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. 


logo