గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Apr 12, 2020 , 00:01:18

15 రోజులు కీలకం

15 రోజులు కీలకం

  • కరోనా నియంత్రణకు సర్కారు పకడ్బందీ ప్రణాళిక 
  • పోలీసుల పక్కా వ్యూహంతో విజయవంతంగా లాక్‌డౌన్‌  
  • వచ్చే రెండు వారాలు మరింత కీలకం
  • సిద్దిపేట జిల్లాలో 4 బార్డర్‌ చెక్‌పోస్టులు, పట్టణాల్లో 24 పికెట్లు  
  • నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు  
  • 688 వాహనాలు సీజ్‌

సిద్దిపేట ప్రతినిధి,నమస్తే తెలంగాణ: కంటికి కనిపించని శత్రువుపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున యుద్ధమే కొన సాగుతున్నది. కరోనా వైరస్‌ విస్తరించకుండా పక్కా ప్రణాళికతో సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. సీపీ జోయల్‌ డెవిస్‌ నేతృత్వంలో ప్రజాచైతన్య రథం డిజైన్‌ చేయించి ఎల్‌ఈడీ తెరల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, సిబ్బందికి రక్షణ కల్పించడంతోపాటు సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన, సురభి వైద్య కళాశాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. నిత్యావసరాల దుకాణాలు తప్పా ఇతర దుకాణాలు తెరిచి ఉంటే సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘాను మరింత పెంచారు. విదేశాల నుంచి వచ్చిన 464 మంది ఇండ్లను జియో ట్యాగింగ్‌ చేశారు. 190 పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. ఇప్పటివరకు జిల్లాలో మోటారు సైకిళ్లు 638, ఆటోలు, కార్లు 28, డీసీఎంలు, లారీలు 22 మొత్తం 688 వాహనాలు సీజ్‌ చేశారు. ఈ రెండు వారాలు మరింత కీలకం కావడంతో జిల్లాలో నిఘాను మరింత పటిష్టం చేశారు. మార్చి 21 నుంచి ఈనెల 8వ తేదీవరకు పేకాట స్థావరాలపై దాడులు చేసి 18 కేసులు నమోదు చేసి 101 మంది పేకాటరాయుళ్ల నుంచి రూ.99,990 స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం దుకాణాలు నడిపిన వారిపై 28 కేసులు నమోదు చేసి 32 మంది నుంచి రూ.5,25,000 విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్చి 1 నుంచి విదేశాల నుంచి వచ్చిన 464 మంది ఇండ్లను జియోట్యాగింగ్‌ చేశారు.16 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గజ్వేల్‌లో ఒకరికి కరోనా వైరస్‌ సోకగా కాలనీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.   

జిల్లాలో 4 బార్డర్‌ చెక్‌పోస్టులు : సిద్దిపేట జిల్లాలో 4 బార్డర్‌ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. రాజీవ్‌ రహదారిపై వంటిమామిడి చౌరస్తా, మెదక్‌ రోడ్‌ భూంపల్లి పోలీసుస్టేషన్‌, మద్దూరు ఎక్స్‌రోడ్‌ చేర్యాల పోలీసుస్టేషన్‌, బెజ్జంకి కమాన్‌ వద్ద చెక్‌పోస్టులున్నాయి. సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్‌ పట్టణాల్లో 24 పికెట్లు ఏర్పాటు చేసి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటలకు వరకు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్‌ పోలీసులు నిరంతరాయంగా గస్తీ నిర్వహిస్తున్నారు.

వెంటనే 100కు ఫోన్‌ చేయండి.. 

కర్ఫ్యూ సమయంలో వైద్యపరంగా ఏదైనా సమస్య వస్తే డయల్‌ 100, సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ వాట్సాప్‌ నంబరు 7901100100, పోలీసు కంట్రోల్‌ రూమ్‌ 833998699, సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్‌ 9409617009, గజ్వేల్‌ ఏసీపీ నారాయణ 8333998684, హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ 79016402468 నంబర్లకు ఫోన్‌చేసి సహాయం పొందవచ్చు. 

పోలీసులకు ఆరోగ్యమూ ముఖ్యమే 

కరోనా నివారణకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి అభినందనలు. సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 880 మంది అధికారులు, సిబ్బంది కరోనా వ్యాధి నివారణకు పనిచేస్తున్నారు. సిబ్బందికి మాస్క్‌లు, హ్యాండ్‌గ్లౌజ్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశాం. అధికారులు, సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రాధాన్యమివ్వాలి. మనకు ఏం కాదులే అన్న నిర్లక్ష్యం సరికాదు. డ్యూటీ ఎంత ముఖ్యమో..మనల్ని మనం కాపాడుకోవడం అంతే ముఖ్యం.  

- జోయల్‌ డెవిస్‌, సిద్దిపేట పోలీసు కమిషనర్‌


logo