శుక్రవారం 05 జూన్ 2020
Medak - Apr 05, 2020 , 23:45:04

రైతులకు ఇబ్బందులు రావొద్దు

రైతులకు ఇబ్బందులు రావొద్దు

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : రైతులకు ఇబ్బందులు రావొద్దని, వరికోతలు, ధాన్యం అమ్మకాల్లో అవస్థలు పడకుండా చూడాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో కరోనా నివారణ చర్యలు, ఉపాధి హామీ పథకం, పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, నర్సరీల నిర్వహణ, డంప్‌యార్డు, శ్మశాన వాటికల నిర్మాణం, వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, వాటి నిర్వహణపై 160 మందితో హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, జడ్పీ సీఈవో శ్రావణ్‌, డీఆర్‌డీఏ పీడీ గోపాల్‌రావు, డీపీవో సురేశ్‌బాబు, ఎంపీడీవోలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వ్యవసాయ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్‌ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్నటువంటి డంప్‌యార్డు, శ్మశాన వాటికల పనులను వేగవంతం చేయాలన్నారు. ఈజీఎస్‌ కూలీలు పనిచేసే సమయంలో ఒకటిన్నర మీటరు దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో కూలీల సంఖ్య తగ్గిందని, ఆ సంఖ్యను పెంచాల్సిన అవసరముందన్నారు. వేసవి దృష్ట్యా నర్సరీల నిర్వహణపై అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ వహించాలని సూచించారు. సీసీ రోడ్ల నిర్మాణానికి సిమెంట్‌ ఉందని మంత్రి దృష్టికి తేగా, కలెక్టర్‌తో మాట్లాడి సిమెంట్‌ కొరత లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నెల 6,7 తేదీల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు రైతులు అప్రమత్తంగా ఉండేలా సూచనలు చేయాలని కోరారు. వరికోతలు, ధాన్యంలో తేమ శాతంపై రైతులకు అవగాహన కల్పిస్తూ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వరి, మొక్కజొన్న కేంద్రాలను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం పరిమాణాన్ని బట్టి రైతులకు టోకెన్లు జారీ చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో సోడియం హైపో క్లోరైడ్‌ స్ప్రే చేసేలా చూడడంతో పాటు ప్రజలు గుమికూడకుండా చూడాలని ప్రజాప్రతినిధులను మంత్రి హరీశ్‌రావు కోరారు.


logo