సోమవారం 25 మే 2020
Medak - Mar 31, 2020 , 23:19:01

అన్నార్తులకు బాసట...

 అన్నార్తులకు బాసట...

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌:   ఉమ్మడి మెదక్‌జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అన్నదానాలు నిర్వహించి ఉదారతను చాటుకుంటున్నారు.  మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ బంగారమ్మ ఆలయం వద్ద ఎంపీపీ పురం నవనీత కూలీలకు అన్నదానం, రామాయంపేటలో రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ రాజశేఖర్‌రెడ్డి చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, పంచాయతీ కార్మికులకు అన్నదానం చేశారు. గుమ్మడిదల మండలంలోని అన్నారంలో వెల్డింగ్‌ పరిశ్రమలో కూలీలుగా పనిచేస్తున్న 20 మందికి సర్పంచ్‌ తిరుమలవాసు, ఎంపీడీవో చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ భిక్షపతి, ఎంపీవో శ్రీనివాస్‌రావు అన్నదానం చేశారు. గజ్వేల్‌ పట్టణంలోని బీడీ కాలనీలో ఉంటున్న గోండూ సంచార జాతి కుటుంబాలకు  శేషమా ఇండియన్‌ గ్యాస్‌ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అల్వాల బాలేశ్‌, బబ్బూరి రజిత పాల్గొన్నారు. పరిశ్రమ కార్మికులకు సీఐ ప్రశాంత్‌ ఆధ్వర్యంలో బొల్లారం ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోని సర్వీస్‌ రోడ్డు వద్ద మంగళవారం ఇతర రాష్ట్రాలకు చెందిన 100మంది కార్మికులకు పోలీసులు అన్నదానం నిర్వహించారు. సంగారెడ్డి మున్సిపల్‌ పరిధిలో ఆకలి ఫౌండేషన్‌, జై శ్రీమన్నారాయణ చారిటబుల్‌ ట్రస్ట్‌, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో అనాథలు, కూలీలు, రహదారిన వెళ్లే వారికి, పోలీసు సిబ్బంది, మున్సిపల్‌ శానిటేషన్‌ సిబ్బంది, యాచకులకు ఆహారం (పులిహోర, పెరుగు అన్నం) పంపిణీ చేశారు. సంగారెడ్డి పట్టణంలోని బీఎస్‌ఆర్‌, హెల్పింగ్‌హ్యాండ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సొంత ఊర్లలోకి బయలుదేరిన ప్రజలకు మంగళవారం పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు. పటాన్‌చెరు మండలంలోని కర్ధనూర్‌ చౌరస్తాలో పాదచారులకు, గ్రామ ఉపసర్పంచ్‌ వడ్డేకుమార్‌ భోజనం అందజేశారు.  మెదక్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి మజ్జిగ పంపిణీ చేశారు. అలాగే పెద్దశంకరంపేటలోని టీటీడీ కల్యాణ మండపంలో పాదచారులకు అధికారులు, ప్రజాప్రతినిధులు, వసతి, భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయగా చిన్నశంకరంపేటలో బీజేపీ నాయకులు పేదలకు అన్నదానం చేశారు. 


logo