గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Mar 29, 2020 , 02:46:53

కరోనా కట్టడికి టాస్క్‌ఫోర్స్‌

కరోనా కట్టడికి టాస్క్‌ఫోర్స్‌

  • అహర్నిశలు ప్రజా రక్షణకు కృషి చేస్తున్న పోలీసులు
  • 10 వేల శానిటైజర్లు తెప్పించి పంపిణీ చేయండి
  • ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులకు కరోనాపై శిక్షణ తరగతులు
  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా నియంత్రణపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంది. సిద్దిపేట జిల్లాలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్‌ నేతృత్వంలో రెండు కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్‌లో శనివారం  టాస్క్‌ఫోర్స్‌ ప్రతినిధులతో మంత్రి సమీక్షించారు. జిల్లా దవాఖాన, ప్రైవేటు దవాఖానల వైద్యులకు కరోనా నివారణకు పలు సూచనలు చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో చేపట్టిన, చేపట్టాల్సిన విధులు, జిల్లాలో ఎంతమంది వైద్యులున్నారు ? మందులు ఏం ఉన్నాయి?తదితరాంశాలపై ఆరాతీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాల, సిద్దిపేట ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులకు విడుతల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొదటి విడుతలో ప్రభుత్వ వైద్యులు, రెండో విడుతలో ప్రైవేటు వైద్యులకు కరోనా నియంత్రణకు శిక్షణ తరగతులుంటాయని చెప్పారు. జిల్లాలో మూడు వైద్య కళాశాలలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని టాస్క్‌ఫోర్స్‌ సమితికి సూచించారు. కరోనా నివారణలో భాగంగా సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌ నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై మంత్రి చర్చించి కలెక్టర్‌ అధ్యక్షతన రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. మొదటి కమిటీకి సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలు, రెండో కమిటీకి అదనపు కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ నేతృత్వంలో మందుల కొనుగోలు, రోగులకు వైద్య సదుపాయం తదితర అంశాలను పర్యవేక్షిస్తారని తెలిపారు.  ప్రజా రక్షణకు పనిచేస్తున్న పోలీసులు, అత్యవసర సేవల అధికారుల కోసం మరో 10 వేల శానిటైజర్లను తెప్పించి పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, సీపీ జోయల్‌ డెవిస్‌, అదనపు కలెక్టర్లు పద్మాకర్‌, ముజమ్మిల్‌ఖాన్‌, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ తమిళ్‌ అరసు, వివిధ శాఖల జిల్లా అధికారులు మనోహర్‌, సురేశ్‌బాబు, గోపాల్‌రావు, కాశీనాథ్‌, చరణ్‌దాస్‌, వైద్యులు పాల్గొన్నారు.

సిద్దిపేటలో రసాయన మందు పిచికారీ... 

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా శనివారం సిద్దిపేటలో సోడియం హైపోక్లోరైడ్‌ మందును కలిపి అగ్నిమాపక సిబ్బంది పిచికారీ చేశారు. పాత బస్టాండ్‌, సుభాష్‌ రోడ్‌లో ఫైరింజన్ల సాయంతో స్ప్రే చేయించారు. ఈ పనులను మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు పద్మాకర్‌, ముజమ్మిల్‌ఖాన్‌ పర్యవేక్షించారు. సిద్దిపేట పట్టణ ప్రజలందరూ నిబంధనలు పాటించి ఇండ్లల్లోనే ఉండాలని, నిత్యావసర సరుకులను ఉదయమే కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవాలని మంత్రి సూచించారు. మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది పైచిలుకు లీటర్ల సోడియం హైపోక్లోరైడ్‌ మందును కొనుగోలు చేసి స్ప్రే చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. 

వంటిమామిడి మార్కెట్‌ సందర్శన 

గజ్వేల్‌ అర్బన్‌ : గజ్వేల్‌ నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాల రైతులు పండించిన కూరగాయలన్నింటినీ వ్యాపారులు కొనుగోలు చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. శనివారం ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌ను సందర్శించిన ఆయన రైతులు, వ్యాపారులతో కాసేపు మాట్లాడారు. పండించిన పంటలన్నింటినీ మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేశామని, సీఎం కేసీఆర్‌ ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చారన్నారు. రైతులు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు సరైన ధరను చెల్లించాలని, మోసం చేస్తే సహించేది లేదని వ్యాపారులను హెచ్చరించారు.  


logo