శుక్రవారం 23 అక్టోబర్ 2020
Medak - Mar 29, 2020 , 02:40:45

బాటసారికి బాసట

బాటసారికి బాసట

  • కాలినడకన వెళ్లేవారికి పోలీసుల ఆసరా 
  • సేవాగుణాన్ని చాటుతున్న స్వచ్ఛంద సంస్థలు
  • ప్రజలకు అండగా నిలిస్తున్న ప్రజాప్రతినిధులు
  • భోజన, తాగునీటి సౌకర్యాన్ని కలిస్తూ ఆదర్శంగా..
  • కరోనా కట్టడికి ఐక్యంగా ముందుకు...

కరోనా కోరలు చాస్తున్న వేళ.. దేశమంతా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ.. పొట్టకూటి కోసం పట్నం బాట పట్టిన ప్రజలు ఇప్పుడు మళ్లీ సొంతగూటికి చేరుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు..వందల కిలోమీటర్ల దూరమైనా.. వెళ్లేందుకు వాహనాలు లేక కాలిబాటనే నమ్ముకున్నారు. భానుడు నిప్పులు కక్కుతున్నా...కడుపు మాడుతున్నా..నెత్తిన ముల్లెమూటలు...చంకలో చంటి బిడ్డలతో అలుపెరుగని ప్రయాణం కొనసాగిస్తున్నారు. గమ్యం చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ బహుదూరపు బాటసారులకు మానవత్వం ఉన్న మనుషులు బాసటగా నిలుస్తున్నారు. పోలీసులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు.. ఎవరికి వారు కాలినడకన వచ్చే వారికి అన్నం పెట్టి, తాగునీటిని అందించి తమ ఉదారతను చాటుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రహదారుల వెంట ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి మానవతా హృదయులకు ‘నమస్తే తెలంగాణ’ శతకోటి వందనాలు తెలుపుతున్నది.                         

ఉమ్మడి జిల్లా నెట్‌వర్క్‌:  లాక్‌డౌన్‌ నైపథ్యంలో రవాణా సౌకర్యం లేదు. దీంతో కొందరు పాదయాత్రగా సొంత గ్రామాలకు వెళ్తున్నవారి ఆకలిబాధను తీర్చేందుకు పలువురు సేవాభావంతో అన్నదానం, తాగునీటి వసతిని కల్పించి మానవత్వాన్ని చాటుతున్నారు. శనివారం టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు మెరజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో ఎంకే సేవాదళ్‌ ముత్తంగి జంక్షన్‌లో రెండో రోజూ బాటసారులకు అన్నదానం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలోనూ ముత్తంగి జంక్షన్‌ వద్ద అన్నదానం ప్రారంభించగా, పటాన్‌చెరు తహసీల్దార్‌ మహిపాల్‌రెడ్డి, సీఐ నరేశ్‌, ఈశ్వరయ్య, పుణ్యవతి, రాంప్రసాద్‌ పాల్గొన్నారు.

ఎస్‌ఐ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో 

కంది : సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎస్‌ఐ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో పని చేస్తున్న మహారాష్ట్ర దెగ్లూర్‌ గ్రామానికి చెందిన సుమారు 20 మందిని పోలీసు ప్రత్యేక వాహనంలో వారి స్వగ్రామానికి పంపించారు. పెద్దశంకరంపేట మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన కుటుంబానికి ఎస్‌ఐ ప్రసాద్‌ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించి స్వగ్రామానికి పంపించారు. 

ఇక్రిశాట్‌ వద్ద..

రామచంద్రాపురం : హైదరాబాద్‌ నుంచి ముంబాయి, సోలాపూర్‌, కర్ణాటక, పూణే తదితర ప్రాంతాలకు కాలినడకన వెళుతున్న వారికి బండ్లగూడ గ్రామ ముఖద్వారంలోని ఇక్రిశాట్‌ వద్ద  సేవా యూత్‌ అధ్యక్షుడు సంజీవ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సుమారుగా 150 మందికి భోజనం ఏర్పాటు చేశారు.  

కంకోల్‌ టోల్‌ ప్లాజావద్ద...

మునిపల్లి : వాహనాల డ్రైవర్లకు, కాలినడకన వెళ్తున్న ప్రయాణికులకు శనివారం మండలంలోని కంకోల్‌ టోల్‌ ప్లాజావద్ద మునిపల్లి మండలం టీఆర్‌ఎస్‌ పార్టీ మైనార్టీ శాఖ అధ్యక్షుడు కుతుబోద్దిన్‌ సుమారు 250 మందికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడంపై మునిపల్లి ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి అభినందించారు. మండల కో-ఆప్షన్‌ సలోదిన్‌, ఏఎస్‌ఐ మల్లయ్య ఉన్నారు. 

నారాయణఖేడ్‌లో... 

నారాయణఖేడ్‌ టౌన్‌ : నారాయణఖేడ్‌లో శనివారం కౌన్సిలర్‌ దారం శంకర్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కౌన్సిలర్లు వివేకానంద, రాజేశ్‌, హన్మండ్లు, సద్దాం, నర్సింహులు పాల్గొన్నారు. 

సంగారెడ్డి పట్టణంలో...

సంగారెడ్డి మున్సిపాలిటీ : సంగారెడ్డి పట్టణంలోని శనివారం పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండు వరకు రోడ్డుకు ఇరువైపులా నివసిస్తున్న అనాథలు, ప్రభుత్వ దవాఖానలో ఉన్నవారికి ఆకలి అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుమారు 100 మందికి భోజనం అందజేశారు. ఆకలి సంస్థ అధ్యక్షుడు రాజశేఖర్‌, సి.రాజశేఖర్‌, అశ్వంత్‌, ద్వారక రవి, శివరాజ్‌ పాల్గొన్నారు. 

హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆధ్వర్యంలో...

హెల్పింగ్‌ హ్యాండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలోనూ 50 మందికి భోజనం అందజేశారు. సంఘం అధ్యక్షుడు రాహుల్‌, కంది ఎంపీడీవో జయలక్ష్మి, సభ్యులు చింటూ, అఖిల్‌, బిల్లా, పురుషోత్తం, రోహిత్‌, భాను, ఉదయ్‌, శ్రీకాంత్‌  పాల్గొన్నారు.

సిద్దిపేట ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో..

కలెక్టరేట్‌, నమస్తేతెలంగాణ : మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు సిద్దిపేట ధార్మిక సేవా సమితి పట్టణ వ్యాపారవేత్తల ఆధ్వర్యంలో తాత్కాలిక మార్కెట్లలో కూరగాయలు విక్రయిస్తున్న రైతులు, పోలీసులకు భోజన ప్యాకెట్లు అందజేశారు. సిద్దిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సాయిరాం, ఓఎస్‌డీ బాలరాజు, డైరెక్టర్‌ బాబుజానీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అన్నం పెట్టి ఇంటికి పంపిన పోలీసులు 

గజ్వేల్‌ రూరల్‌ : ఆదిలాబాద్‌ జిల్లా మెట్‌పల్లి గ్రామానికి చెందిన మహేష్‌... వర్గల్‌ మండలం మజీద్‌పల్లి వద్ద పెట్రోలింగ్‌ చేస్తున్న కానిస్టేబుళ్లు అనిల్‌, గణేశ్‌లకు రోడ్డుపక్కన కనిపించడంతో  భోజనం పెట్టి స్వగ్రామానికి పంపించారు. 

కోర్టు ప్రాంగణంలో భోజనవసతి

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌కు వలస వెళ్లిన వివిధ ప్రాంతాల ప్రజలు సొంతూళ్లకు కాలినడన పయనమయ్యారు. శనివారం జిల్లా కేంద్రం సంగారెడ్డికి చేరుకున్నవారికి స్థానిక కోర్టు ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి భోజనాలు ఏర్పాటు చేశారు. నారాయణఖేడ్‌, పిట్లం, జుక్కల్‌, మద్నూర్‌ ప్రాంతాల పరిసర గ్రామాలకు చేరుకోవాలని కాలినడకన కొంతమంది ఇస్నాపూర్‌ నుంచి పయనమయ్యారు. భోజనాలు చేసిన అనంతరం వారి స్వగ్రామాలకు పంపించేందుకు న్యాయమూర్తి ప్రత్యేక వాహనాలను ఏర్పాట్లు చేశారు.  జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి వాహనాన్ని ఏర్పాటు చేయగా,  డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి సహకారంతో వారిని సొంతూళ్లకు పంపించారు.  కాలినడక వెళ్లేవారికి కోర్టు ప్రాంగణంలో ఈ నెల 14 వరకు భోజానాలు అందుబాటులో ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. 


logo