బుధవారం 03 జూన్ 2020
Medak - Mar 27, 2020 , 22:39:10

కలిసికట్టుగా కరోనాపై పోరాడుదాం..

కలిసికట్టుగా కరోనాపై పోరాడుదాం..

  • ప్రజలు ఇండ్లలోనే ఉండి సహకరించాలి
  • ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేసి  వైరస్‌ను పారదోలుదాం
  • విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారం అధికారులకు ఇవ్వండి 
  • రైతులు, తాగునీటి సిబ్బంది, మున్సిపల్‌ కార్మికులు, జర్నలిస్టులకు ప్రత్యేక పాసులు ఇవ్వాలనికలెక్టర్లను ఆదేశించాం 
  • మున్సిపల్‌ కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు
  • నిత్యావసరాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు 
  • ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కలిసి కరోనా వైరస్‌ను కట్టడి చేద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం మెదక్‌ కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డిలతో కలిసి మంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు సీఎం కేసీఆర్‌ నిధులు విడుదల చేశారని, రైతులు ఆందోళన చెందొద్దని వరి, మొక్కజొన్న పంటల కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై వచ్చే నెల 2న సమీక్ష నిర్వహించి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చామన్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా సహకరించాలన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించడమే కాకుండా మండలస్థాయి అధికారులు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అందరితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 125 మందిని క్వారంటైన్‌లో ఉంచామన్నారు. 100 మందిని ఇంట్లోనే ఉండాలని క్వారంటైన్‌ నిర్వహించగా, 25 మందిని ఏడుపాయల హరితా హోటల్‌, మెదక్‌ హరితా రెస్టారెంట్లలో క్వారంటైన్‌ వార్డును ఏర్పాటు చేసి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు.

జిల్లా కేంద్ర దవాఖానలో 15 బెడ్లతో క్వారంటైన్‌ వార్డు..

జిల్లా కేంద్రమైన మెదక్‌లోని ఏరియా జిల్లా దవాఖానలో 15 బెడ్లతో క్వారంటైన్‌ వార్డు(ఐసోలేషన్‌ వార్డు)ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. 8 బెడ్లతో ఐసీయూను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతే కాకుండా రూ.10వేల నగదుతో శానిటైజర్స్‌, మాస్కులు, లిక్విడ్‌ను జిల్లాలో అందుబాటులో పెట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డీఎంతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి ఆదేశించామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి కరోనా లక్షణాలు ఉంటే గ్రామంలోని ప్రజాప్రతినిధులు మెదక్‌ ప్రాంతీయ దవాఖానకి తరలించాలన్నారు. ముఖ్యంగా విద్య, ఉపాధి ఇతర చదువుల కోసం విదేశాలు వెళ్లి తిరిగి వచ్చిన వారు స్వచ్ఛందంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలన్నారు. 

కూరగాయలు, ఎరువులకు ఇబ్బందులు లేకుండా చర్యలు.. 

ప్రజలకు, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. 3వేల ఎకరాల్లో కూరగాయలు రైతులు పండిస్తున్నారని వీటిని రైతులు నేరుగా అమ్ముకునేందుకు ప్రత్యేక పాసులు రైతులకు అందించనున్నామన్నారు. కూరగాయల రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మార్కెట్లలో అందుబాటులో ఉంచుతాన్నారు. అదేవిధంగా మండలానికి ఒక ఎరువుల దుకాణాన్ని తెరిచి ఉంచుతున్నామన్నారు. అలాగే తాగునీటి పంపులు కాలిపోతే రిపేర్‌ చేసే ఒక ఎలక్ట్రికల్‌ మెకానిక్‌ దుకాణాన్ని తెరిచే ఉంచుతామన్నారు. రైస్‌మిల్స్‌, ఫార్మాసిటికల్‌ కంపెనీలు, సీడ్‌ కంపెనీలు అన్ని తెరిచే ఉంచేందుకు అనుమతించేందుకు సమీక్షలో నిర్ణయించినట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

బియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు.. 

జిల్లాలో 521 రేషన్‌ దుకాణాల ద్వారా జిల్లాలోని పేద ప్రజలందరికీ ఉచితంగా ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే అన్ని గ్రామాలకు బియ్యం చేరుకున్నాయన్నారు. రూ.1500 నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అన్ని గ్రామాల్లో సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలన్నారు.


logo