సోమవారం 19 అక్టోబర్ 2020
Medak - Mar 23, 2020 , 00:17:33

కరోనాపై జనభేరి

కరోనాపై జనభేరి

  • ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పిలుపుతో మెతుకుసీమలో జనతా కర్ఫ్యూ సక్సెస్‌
  • కరోనాపై జిల్లావాసుల యుద్ధం
  • ఇండ్లకే పరిమితమైన జనం 
  • నిర్మానుష్యంగా రహదారులు
  • డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు 
  • మూతపడిన వ్యాపార, వాణిజ్య సముదాయాలు
  • బంద్‌ను పర్యవేక్షించిన పోలీసు సిబ్బంది
  • అప్రమత్తంగా రెవెన్యూ, వైద్య సిబ్బంది
  • సాయంత్రం 5 గంటలకు వైద్య ఆరోగ్య సిబ్బందికి సంఘీభావ సంకేతంగా చప్పట్లు కొట్టిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు 

‘కరోనా’ మహమ్మారిని పారదోలేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ జిల్లాలో విజయవంతమైంది. కరోనాపై యుద్ధాన్ని ప్రకటించేలా పట్టణాలు, పల్లెల్లోని ప్రజలంతా స్వచ్ఛందంగా గృహనిర్బంధంలో ఉన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులూ కుటుంబ సభ్యులతో ఇండ్లల్లోనే గడిపారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితంకాగా ప్రైవేటు వాహనాలు సైతం రోడ్డెక్కలేదు. దీంతో జనసంచారం లేక రోడ్లన్నీ బోసిపోయాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే 44వ జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది. జిల్లా కేంద్రం మెదక్‌, రామాయంపేట, తూప్రాన్‌, నిజాంపేట తదితర ప్రాంతాల్లో పోలీసు అధికారులతో కలిసి కలెక్టర్‌ జనతాకర్ఫ్యూను పర్యవేక్షించారు. కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్సలు అందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి సంఘీభావ సంకేతంగా జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టారు. ఈ నెల 31 వరకు జనతా కర్ఫ్యూను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన సందర్భంగా కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. 

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆదివారం 24 గంటల జనతా కర్ఫ్యూతో మెదక్‌ జిల్లాలో సకలం బంద్‌ జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ గృహనిర్బంధంలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జనతా కర్ఫ్యూ పిలుపుతో సబ్బండ వర్ణాలు కరోనా కట్టడికి సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. గ్రామ, పట్టణస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా వీధులు, రహదారులు జనసంచారం లేక బోసిపోయాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పెట్రోల్‌ బంక్‌లు, మెడికల్‌ దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌, కిరాణ దుకాణాలు బంద్‌ నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ వారు దుకాణాలు మూసివేసి జనతాకర్ఫ్యూలో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. జిల్లాలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అదే విధంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో  రైల్వేస్టేషన్లు వెలవెలబోయాయి. ఉదయం 6 గంటల నుంచే పోలీసులు జిల్లా కేంద్రంతో పాటు అన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో పోలీసులు గస్తీ నిర్వహించారు.  

ఆట, పాటలతో చిన్నారులతో గడిపిన కుటుంబాలు    

అన్ని కుటుంబాలు ఇండ్లలోనే చిన్నారులతో ఆట, పాటలతో గడిపారు. మరికొంత మంది టీవీలతో కాలక్షేపం చేశారు. తాత, అమ్మమ్మలు చిన్నారులతో కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఇండ్లలోనే ఉండి కాలక్షేపం చేశారు. 

నిర్మానుష్యంగా రహదారులు

జిల్లా కేంద్రం నుంచి మొదలుకొని జాతీయ రహదారులు వాహనాల రాకపోకలు లేక నిర్మానుష్యంగా మారాయి. ఎప్పుడు రద్దీగా ఉండే 44వ జాతీయ రహదారి బోసిపోయి కనిపించింది.   

జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కుటుంబ సభ్యులతో ఇండ్లలోనే గడిపారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో ఇంటికే పరిమితమయ్యారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌లోని తన  గృహంలో గడిపారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి కుటుంబ సభ్యులతో ఇంటికే పరిమితమయ్యారు. 

బంద్‌ను పర్యవేక్షించిన కలెక్టర్‌ ధర్మారెడ్డి

కలెక్టర్‌ ధర్మారెడ్డి జనతాకర్ఫ్యూను పర్యవేక్షించారు. జిల్లా కేంద్రమైన మెదక్‌లో ఆర్టీసీ బస్టాండ్‌, చర్చి ప్రధాన గేట్‌ తదితర ప్రాంతాల్లో కలెక్టర్‌ పోలీస్‌ అధికారులతో కలిసి గస్తీ తిరిగారు. అదే విధంగా రామాయంపేట, తూప్రాన్‌, నిజాంపేట తదితర ప్రాంతాల్లో కలెక్టర్‌ అధికారులతో కలిసి జనతాకర్ఫ్యూను పర్యవేక్షించారు. ప్రజలు 24 గంటల వరకు ఇండ్లలోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

చప్పట్లతో డాక్టర్లకు సంఘీభావం 

కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్సలు అందిస్తున్న డాక్టర్ల బృందానికి కృతజ్ఞతగా జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు చప్పట్లతో సంఘీభావం తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు.


logo