శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medak - Mar 23, 2020 , 00:11:59

జిల్లాలో జనతా కర్ఫ్యూ ప్రశాంతం

జిల్లాలో జనతా కర్ఫ్యూ ప్రశాంతం

  • అప్రమత్తంగా ఉన్న రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బంది
  • ప్రభుత్వ పిలుపునకు ప్రజల సహకారం బాగుంది
  • మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి
  • జిల్యావ్యాప్తంగా జరిగిన బంద్‌ను పర్యవేక్షించిన  కలెక్టర్‌ ధర్మారెడ్డి

చేగుంట : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తమై స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారని కలెక్టర్‌ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చేగుంట, నార్సింగి మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం బంద్‌ ప్రశాంతంగా జరిగింది.  కలెక్టర్‌ ధర్మారెడ్డి చేగుంటలో బంద్‌ను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ధర్మారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్‌ను కట్టడిచేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రజల సహకారం బాగుందని, రెవెన్యూ, పోలీసులు, వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పనిచేస్తున్నారని కలెక్టర్‌ తెలిపారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వెంటనే 15రోజుల పాటు బయటకు రాకుండా ఉండటం మంచిదని, జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు.  కార్యక్రమంలో చేగుంట తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌, వివిధ గ్రామాలకు చెందిన వీఆర్‌వోలు ఉన్నారు.

పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలి..

రామాయంపేట : దేశ వ్యాప్తంగా బంద్‌ ప్రకటిస్తే కొంత మంది వ్యక్తులు తమ ఆరోగ్యాలను పక్కన బెట్టి రోడ్డెక్కడం మంచి పద్ధతి కాదని కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం రామాయంపేటలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన కలెక్టర్‌ విలేకరులుతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా బంద్‌ సంపూర్ణంగా ఉందన్నారు. ఇతర దేశాల నుంచి రాష్ర్టాల నుంచి వచ్చే వ్యక్తులపై మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు కఠినంగా వ్యవహరించాలన్నారు. వారి డాటాను సేకరించి కలెక్టర్‌ కార్యాలయానికి పంపించాలన్నారు. బంద్‌ ఉన్నా రామాయంపేటలో కొంత మంది కావాలనే రోడ్డెక్కుతున్నారని వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. రామాయంపేటలో ఓ వ్యక్తి వెళ్తుంటే ఆ వ్యక్తిని కలెక్టరే స్వయంగా వివరాలు తెలుసుకుని అక్కడే ఉన్న పోలీసులను ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. 

మహారాష్ట్రీయులకు.. వైద్య చికిత్సలు

రామాయంపేట: మహారాష్ట్ర నుంచి అక్కన్నపేట రైల్వేస్టేషన్‌కు విచ్చేసిన వారికి రామాయంపేటలో వైద్య చికిత్సలు చేశారు. ఆదివారం మహారాష్ట్రకు చెందిన 13 మంది వ్యక్తులు తమ బంధువు మెదక్‌ పట్టణంలో అనారోగ్యంతో మృత్యువాత పడటంతో దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైల్‌లో వారు అక్కన్నపేటలో దిగారు. విషయం తెలుసుకున్న రామాయంపేట పోలీసులు, రెవెన్యూ సిబ్బంది రైల్వేస్టేషన్‌కు వెళ్లి సీఐ.నాగార్జునగౌడ్‌, తహసీల్దార్‌ శేఖర్‌రెడ్డిలు వారికి కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. అనంతరం వారందర్నీ అంబులెన్స్‌లో రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్య చికిత్సలను అందజేసి మెదక్‌కు తరలించారు. కరోనాపై జాగ్రత్తగా ఉండాలని కచ్చితంగా మాస్కులను ధరించి ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నారు.

నేటి నుంచి తాత్కాలికంగా ప్రజావాణి రద్దు

మెదక్‌, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నేటి నుంచి తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా ప్రజలు ఎవరూ ప్రజావాణి కార్యక్రమం కోసం కలెక్టరేట్‌ కార్యాలయానికి రావొద్దని ఆయన సూచించారు.

శానిటేషన్‌కు పెద్దపీట వేయండి

పాపన్నపేట : పాపన్నపేటలో ఆదివారం కొనసాగిన జనతా కర్ఫ్యూను జిల్లా పంచాయతీ అధికారి హనోక్‌ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా  సంబంధిత అధికారులతో మాట్లాడుతూ శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రతి గ్రామంలో క్లోరినేషన్‌ చేయాలని బయట నుంచి వచ్చే వ్యక్తులపై దృష్టి పెట్టి అధికారులకు తెలియజేయాలని ఆయన సూచించారు. ఆయన వెంట పాపన్నపేట సర్పంచ్‌ గురుమూర్తిగౌడ్‌, తహసీల్దార్‌ బలరాం ఎస్‌ఐ ఆంజనేయులు ఎంపీవో లక్ష్మీకాంతరెడ్డి, పాపన్నపేట గ్రామ కార్యదర్శి రాకేశ్‌ ఉన్నారు.logo