శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Mar 21, 2020 , 23:33:13

ఆర్టీసీ బస్సులు బంద్‌

ఆర్టీసీ బస్సులు బంద్‌

  • నేటి ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు  
  • జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆర్టీసీ నిర్ణయం 
  • నిలిచిపోనున్న ప్రజా రవాణా వ్యవస్థ 
  • ఉమ్మడి జిల్లాలో 8 డిపోల్లో 668 బస్సులు
  • అన్ని బస్టాండ్లు, బస్సుల్లో శానిటైజర్లు 
  • ఉమ్మడి జిల్లా ఆర్‌ఎం రాజేశేఖర్‌ 

సంగారెడ్డి టౌన్‌:  కరోనా వైరస్‌ నిర్మూలనకు తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంటున్నది. దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సేవలను నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ రాజశేఖర్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో బస్సులు మొత్తం బంద్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. ఉదయం 6.00 గంటల నుంచి సోమవారం ఉదయం 6.00 గంటల వరకు బస్సులను బంద్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 8 డిపోలు ఉన్నాయన్నారు. మెదక్‌ రీజియన్‌ పరిధిలోని మెదక్‌, నారాయణఖేడ్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌, సిద్దిపేట, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, దుబ్బాక, హుస్నాబాద్‌ డిపోలు ఉన్నాయని తెలిపారు. వీటి పరిధిలో 668 బస్సులు ఉన్నాయన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రతి రోజు ఆర్టీసీ బస్సులు 2.60 కిలో మీటర్ల మీరు ప్రయాణికులను వారి వారి గమ్య స్థానాలకు చేర్చనున్నట్లు తెలిపారు. సుమారు 2.10 లక్షల ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఆర్టీసీకి ప్రతి రోజు రూ.89.10 లక్షల ఆదాయం వస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సేవలను నిలిపివేస్తున్నామన్నారు.  ప్రభుత్వం జనతా కర్ఫ్యూకు ఇచ్చిన పిలుపుకు ప్రజలు సహకరించాలన్నారు. కరోనా వ్యాధి నివారణకు ఆర్టీసీ బస్టాండ్లు, ఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచామన్నారు. శానిటైజర్లను ఆర్టీసీ స్వయంగా తయారు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రతి బస్సును ప్రతిరోజు శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. బస్సుల్లో వ్యాధి నివారణకు కోసం ప్రయాణికులు శానిటైజర్‌ ఉపయోగించి చేతులు శుభ్రం చేసుకునేందుకు అందిస్తున్నామన్నారు.


logo