శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Medak - Mar 21, 2020 , 23:28:07

24గంటలు కరోనా కర్ఫ్యూ

24గంటలు కరోనా కర్ఫ్యూ

  • ప్రధానమ్ంరత్రి, ముఖ్యమంత్రి పిలుపుతో ఇంట్లోనే ఉండేందుకు సిద్ధమైన ప్రజలు
  • కరోనాను గెలిచేందుకు జనతా కర్ఫ్యూ పాటిద్దామన్న మంత్రి హరీశ్‌రావు
  • 24గంటల పాటు బయటకు రావొద్దని సూచించిన కలెక్టర్‌, ఎస్పీ
  • బస్సులు తిరగవని ప్రకటించిన అధికారులు
  • అనధికారిక కర్ఫ్యూను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ప్రజాప్రతినిధులు
  • పట్టణాల నుంచి సొంతగ్రామాలకు చేరుకున్న జిల్లావాసులు
  • ఆదివారానికి కావాల్సిన సరుకులు ముందే తెచ్చి పెట్టుకున్న ప్రజలు

ప్రధానమ్ంరత్రి, ముఖ్యమ్ంరత్రుల పిలుపుమేరకు ఆదివారం జనతాకర్ఫ్యూను విజయవంతం చేసేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. ప్రధానమంత్రి ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంటిలోనే ఉండాలని సూచించారు. కాగా, సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయం 6 నుంచి  సోమవారం ఉదయం 6 వరకు  ఇంట్లోనే  ఉండి కరోనాను తరిమికొట్టడానికి సహకరించాలని సూచించారు. దీంతో జిల్లావాసులు ఆదివారానికి కావాల్సిన సరుకులను ముందే తెచ్చి పెట్టుకున్నారు. మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి,ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందనదీప్తిలు కరోనాపై పోరులో భాగస్వాములమవుదామని పిలుపునిచ్చారు.జిల్లావ్యాప్తంగా పలుచోట్ల నిర్వహించే వారాంతపు సంతలు కూడా బంద్‌ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు తిరగవని ఆర్‌ఎంఓ రాజశేఖర్‌ ప్రకటించారు. పట్టణాల నుంచి ఇప్పటికే పల్లెలకు చేరుకున్న అనేకమంది ఈ రోజంతా స్వీయ నిర్బంధంలో ఉండేందుకు  సిద్ధమయ్యారు. 

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌పై యుద్ధానికి మెతుకు సీమ సిద్ధమైంది. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు ఆదివారం 24 గంటల పాటు జరిగే జనతాకర్ఫ్యూకు ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కుటుంబ సభ్యులతో సహా ప్రజలు ఇండ్లలోనే ఉండి, కరోనాపై స్వీయ నియంత్రణ పాటించేందుకు అందరూ ఏకమయ్యారు. దీనికి తోడు వ్యాపార, వాణిజ్య వర్గాలు జిల్లా మొత్తం బంద్‌ను పాటించాలని నిర్ణయించాయి. ఇప్పటికే గ్రామ, గ్రామాన జిల్లా అధికార యంత్రాంగం చాటింపు చేయించి, అవగాహన కల్పిస్తుంది. ప్రజలను అప్రమత్తం చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారిపై అధికార యంత్రాంగం నిఘా పెట్టింది. జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించి, వైరస్‌ సోకకుండా గుంపులుగా ఉండొద్దని పెండ్లిళ్లు, పేరంటాలకు దూరంగా ఉండి స్వీయనియంత్రణ పాటించాలని సూచిస్తున్నారు.  స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని, వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్‌ను పాటించాలని నిర్ణయించాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతోపాటు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. జిల్లా కేంద్రంతో పాటు ప్రతి పల్లె జనతాకర్ఫ్యూలో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోషల్‌ మీడియాతోపాటు అన్ని ప్రసార మాధ్యమాలతో జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం చేసింది. గాలిలో ఉన్న కరోనా వైరస్‌ను నశింపజేయాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పం.  ప్రపంచ దేశాలను గడ గడలాడిస్తున్న కరోనా వైరస్‌ మెతుకు సీమ దరిచేరకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని ఇండ్లలోనే ఉంచి క్వారంటైన్‌ చేస్తున్నారు. ప్రతి వ్యక్తి సమాచారం సేకరించి ప్రత్యేక నిఘా ఉంచారు. ఇప్పటికే జిల్లా, మండల స్థాయిలో అధికారులతో కమిటీలు ఏర్పాటు అయ్యాయి. మరోవైపు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఇంటలిజెన్సీ అధికారులు గ్రామాల్లో పరిస్థితులను అంచనా వేస్తున్నారు. గ్రామానికి ఒక పోలీస్‌ అధికారిని నియమించారు. కొత్త వ్యక్తులు గ్రామానికి వచ్చిన వెంటనే సమాచారం సేకరించి సంబంధిత జిల్లా అధికారులకు తెలియజేస్తున్నారు. వెంటనే వైద్య, రెవెన్యూ అధికారులు గ్రామాన్ని సందర్శించి వారికి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి ముగ్గురు అనుమానితులను గాంధీ దవాఖానకు పంపించారు. వారికి ఎలాంటి కరోనా వైరస్‌ సోకలేదని అధికారులు ప్రకటించారు. ప్రతి పల్లెలో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ప్రజలు గుమికూడి ఉండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ నెల 31 వరకు బార్లు, సినిమా థియేటర్లు బంద్‌ను పొడిగించింది. అంతే కాకుండా ఫంక్షన్‌ హాల్‌లో సైతం 1 వంద నుంచి 2 వందల వరకు ప్రజలు హాజరయ్యేలా మార్గదర్శకాలు జారీచేసింది. ఇవి ముందుగా బుకింగ్‌ అయిన వాటికి మాత్రమే అనుమతించిన విషయం తెలిసిందే. దేవాలయాల్లో దర్శనాలను నిలిపివేశారు. యథాతథంగా ఆలయాల్లో పూజలు నిర్వహించి బంద్‌ను పాటిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్‌ కేథడ్రల్‌ చర్చిలో భక్తుల రాకను నిలిపివేస్తున్నట్లు బిషప్‌ ప్రకటించారు. జగ్నీకే రాత్‌ను నిర్వహించకుండా ముస్లింలు బంద్‌ పాటిస్తున్నారు. కేవలం ఇండ్లలో మాత్రమే నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. ఇలా సంబ్బండ వర్ణాలు ముఖ్యమంత్రి పిలుపునకు స్పందించి సహకరిస్తున్నాయి. 

వారాంతపు సంతలు బంద్‌..     

జిల్లాలో వారాంతపు సంతలు బంద్‌ చేయాలని నిర్ణయించారు. అధికారుల, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. టేక్మాల్‌, తూప్రాన్‌, వెల్దుర్తి తదితర ప్రాంతాల్లో వారాంతపు సంతలు నిర్వహించరాదని, బంద్‌ పాటించాలని నిర్ణయించారు. 


 నేటి కర్ఫ్యూను 24 గంటలు పాటిద్దాం.. 

  • ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నేడు జనతా కర్ఫ్యూను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చిన రీతిలో 24 గంటలు పాటించి... విజయవంతం చేద్దామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఒక ప్రకటనలో  తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్గొన్నామో అదే స్ఫూర్తితో కరోనాను ఎదుర్కొందామన్నారు. కరోనాపై యుద్ధంలో విజయం సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్‌ను అడ్డుకోవచ్చన్నారు. నేటి ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఆరు గంటల వరకు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఈ 24 గంటలకు అవసరమైన ఆహార పదార్థాలు, మందులు, ఇతర వస్తువులను ముందే సమకూర్చుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు మీదకు రాకుండాఉండాలన్నారు. సరైన స్వీయ నియంత్రణ లేకపోవడం వల్లే కొన్ని దేశాల్లో కరోనా వైరస్‌ విజృంభించి ప్రజల ప్రాణాలను తీస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యంతోనే  వైరస్‌ను అరికట్టగలమన్నారు. సబ్బు, శానిటైజర్స్‌తో చేతులు శుభ్రపర్చుకోవాలని సూచించారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనబడితే అలక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. సమాజ సేవ అందరి బాధ్యత, నేడు ఇంటిలో ఉండటమే మనం సమాజానికి చేసే సేవ అని హరీశ్‌రావు చెప్పారు.

విదేశాల నుంచి ఎవరైనా వస్తే  సమాచారం ఇవ్వండి..

కరోనా వైరస్‌ విదేశాల నుంచి వచ్చే వారి నుంచే వస్తున్నది..  విదేశాల నుంచి వస్తే సమాచారం ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రజలు, సర్పంచులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సైతం తమ పరిధిలో జాగ్రత్తగా ఉండాలన్నారు.

స్వచ్ఛందంగా పాటిద్దాం

స్వచ్ఛందంగా జనతాకర్ఫ్యూని పాటిద్దాం. వైరస్‌ నివారణకు కృషి చేద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైరస్‌ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా దవాఖానల్లో క్వారంటైన్‌ వార్డుల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ప్రజలు సహకరించాలి. జనతాకర్ఫ్యూలో భాగస్వాములు కావాలి.

-ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి

ప్రతి ఒక్కరం పాటిద్దాం

 ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు చేపడుతున్న జనతాకర్ఫ్యూను ప్రతి ఒక్కరం పాటిద్దాం. కరోనా వైరస్‌ను నివారించి, ఆరోగ్యాలను కాపాడుకుందాం. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి  సోమవారం ఉదయం 6 గంటల వరకు జనతాకర్ఫ్యూలో ప్రజలంతా పాల్గొనాలి. 

-ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి 

ప్రజలు భాగస్వాములు కావాలి 

ప్రజలందరూ జనతా కర్ఫ్యూలో భాగస్వాములు కావాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు ఆదివారం  ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఇండ్ల నుంచి బయటకు రావద్దు. ఇండ్లకే పరిమితమై స్వచ్ఛందంగా గృహనిర్బంధం చేసుకోవాలి.  కరోనా వైరస్‌ నివారణకు జనతాకర్ఫ్యూను విజయవంతం చేద్దాం. 

- ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి 

జిల్లా ప్రజలంతా పాల్గొనాలి 

జనతా కర్ఫ్యూలో జిల్లా ప్రజలందరూ పాల్గొనాలి. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు ఇండ్లలోనే ఉండాలి. ప్రభుత్వం కరోనా వైరస్‌ కట్టడికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి.

- జెడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌


logo