బుధవారం 01 ఏప్రిల్ 2020
Medak - Mar 21, 2020 , 00:55:30

రెండో రోజు సజావుగా పరీక్షలు

 రెండో రోజు సజావుగా పరీక్షలు

  • జిల్లావ్యాప్తంగా పరీక్షలు రాసిన 11457 మంది విద్యార్థులు
  • 22 మంది గైర్హాజరు
  • పలుచోట్ల మాస్కులతో హాజరైన విద్యార్థులు
  • పరీక్షకేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ ధర్మారెడ్డి
  • గుంపులుగా ఉండొద్దని విద్యార్థులకు సూచన
  • అనేకచోట్ల ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ తనిఖీలు

మెదక్‌ రూరల్‌: పదో తరగతి పరీక్షలు రెండో రోజు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 66 పరీక్ష కేంద్రాలలో పేపర్‌-2  పరీక్షకు 11,479 మంది విద్యార్థులకు 11,457 మంది హాజరు కాగా 22 మంది  గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారి రమేశ్‌బాబు తెలిపారు. జిల్లాలో మొత్తం 99.81శాతం హాజరైనట్లు చెప్పారు. జిల్లాలోని చేగుంట, వడియారం పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ ధర్మారెడ్డి, జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాల పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ సందర్శించారు. చేగుంట, టేక్మాల్‌, పాపన్నపేట, శివ్వంపేట, వెల్దుర్తి మండలాలలోని 16 పరీక్ష కేంద్రాలను ప్లయింగ్‌ స్కాడ్స్‌ తనిఖీలు చేశారు. మెదక్‌, కొల్చారం, కౌడిపల్లి మండలాల్లోని 7 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడలేదన్నారు. 

పాపన్నపేటలో...

పాపన్నపేట: కరోనా నివారణలో భాగంగా మండల పరిధిలోని వివిధ పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో శానిటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

శుక్రవారం ఉదయం విద్యార్థులు పరీక్ష హాల్‌లోకి ప్రవేశించకముందే అన్ని డ్యూయల్‌ డెస్క్‌లను శుభ్రం చేశారు. ఇందులో భాగంగా పాపన్నపేట కుర్తివాడ యూసుఫ్‌పేట, కొత్తపల్లి, కొడపాక కేంద్రాల్లో పూర్తి స్థాయిలో శానిటేషన్‌ చర్యలు చేపట్టారు.

గుంపులుగా ఉండొద్దు: కలెక్టర్‌

చేగుంట: విద్యార్థులు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని, గుంపులుగా ఉండ కూడదని కలెక్టర్‌ ధర్మారెడ్డి పేర్కొన్నారు. చేగుంట, వడియారం  పరీక్ష కేంద్రాల పరిసరాలను శుక్రవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ధర్మారెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలు రాసే విద్యార్థులు అనారోగ్యం పాలు కాకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తగా రోజూ టేబుళ్లను శుభ్రం చేహించాలని అధికారులకు చెప్పారు. కరోనా వైరస్‌పై ఆందోళన అవసరం లేదని, విదేశాల నుంచి వచ్చే వారిపైన ఎక్కువ ప్రభావం ఉంటుందని, వారు 14రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. జలుబు, దగ్గు ఉన్న వారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి హనోక్‌ పాఠశాల హెచ్‌ఎం గంగాబాయి ఉన్నారు.


logo
>>>>>>