బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Mar 21, 2020 , 00:50:18

పూజలు యథాతథం.. దర్శనానికి విరామం

పూజలు యథాతథం.. దర్శనానికి విరామం

  • నిత్య పూజలు యథాతథం 
  • భక్తులకు దర్శనాలు నిలిపివేత
  • నిర్మానుష్యంగా మారిన ఆలయ ప్రాంగణాలు
  • పలు దేవాలయాల్లో జరుగాల్సిన ఉత్సవాలు నిలిపివేత

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా  ఆలయాలు, మసీదులు, చర్చిలు అన్ని ప్రార్థనా మందిరాలు మూసేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఏడుపాయల దేవాలయం, తునికి నల్లపోచమ్మ ఆలయం తదితర చోట్ల భక్తులు లేకుండానే నిత్యపూజలు చేశారు.   కొన్ని ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ వాటిని భక్తులు లేకుండా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మెదక్‌ చర్చి గేటు కూడా మూసివేసే వుంచారు.  జిల్లాలోని అన్ని ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు మూసి ఉంచుతున్నందున  పూజలు, ప్రార్థనల కోసం ఎవ్వరూ రావొద్దని జిల్లా ఎస్పీ చందనదీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.

మెదక్‌ నెట్‌వర్క్‌: జిల్లాలో సుప్రసిద్ధశైక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలను కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా నిలిపి వేశారు. దేవాదాయ, ధర్మాదాయశాఖ హైదరాబాద్‌ ఆదేశాల మేరకు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ గటాటి భద్రప్ప, ఈవో శశిధర్‌తో కలిసి పాలకమండలి సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. చైనా నుంచి ప్రబలిన కరోనా వైరస్‌  ప్రపంచ దేశాలకు వ్యాపించడంతో ప్రజల రక్షణార్థం వీరభద్రస్వామి రథోత్సవాలతో పాటు ఆదివారం వరకు జరిగే బ్రహ్మోత్సవాలను పూర్తిగా నిలిపి వేయాలని తీర్మానం చేశారు. అలాగే, ఆలయంలో భక్తుల దర్శనాలు, ఆర్జిత సేవలు పూర్తిగా నిలిపివేసినట్లు చైర్మన్‌ వెల్లడించారు. భక్తుల అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. 

దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాలు అందేవరకు తదుపరి దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నామని తెలిపారు. వీరభద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిలిపి వేయడం మొదటిసారని చెప్పారు. కరోనా వైరస్‌ను తరమికొట్టడానికి ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలని కోరారు. కార్యక్రమంలో జూనియర్‌ అసిస్టెంట్‌ సోమయ్య, ప్రధాన అర్చకుడు శివనాగులు, ధర్మకర్తలు తదితరులు ఉన్నారు.

వైకుంఠపుర ఆలయం 

కరోనా ప్రభావంతో పట్టణ శివారులోని మహాలక్ష్మీ గోదా సమేత విరాట్‌ వేంకటేశ్వర దివ్యక్షేత్రం (వైకుంఠపురం)ను శనివారం మూసివేశారు. కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వైకుంఠపుర ఆలయం కూడా ఈ నెల 31వ తేదీ వరకు మూసివేయనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకుడు కందాడై వరదాచార్యులు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు వైకుంఠపుర ఆలయంలో అర్చనలు, ఆర్జిత సేవలు, దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించినట్టు జై శ్రీమన్నారాయణ చారిటబుల్‌ ట్రస్టు సభ్యులు తెలిపారు. అంతరాయానికి భక్తులు సహకరించాలని కోరారు. 

పలుగుపోచమ్మ ఆలయం

మండలంలోని శేర్కాన్‌పల్లి శివారులోని పలుగుపోచమ్మ దేవాలయం వద్ద దర్శనం, ఆర్జిత సేవలు నిలిపివేశామని ఆలయ ఈవో శశిధర్‌ తెలిపారు. ప్రభుత్వం కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం తీసుకుంటున్న నేపథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేయడంతో అమ్మవారి సేవలు నిలిపివేసినట్లు తెలిపారు. ఆలయ అర్చకులు నిత్యం అమ్మవారికి పూజలు చేసి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా, అమ్మవారి ఉత్సవాల సందర్భంగా చేపట్టే కార్యక్రమాలను సైతం మధ్యంతరంగా నిలిపివేశామన్నారు. కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండడంకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆలయ ప్రాంగణంలో ఫ్లెక్సిలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

సిద్ధివినాయక దేవాలయం

ప్రజలు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాలకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో సిద్ధివినాయక దేవాలయాన్ని మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం న్యాల్‌కల్‌ మండలంలోని రేజింతల్‌ శివారులో ఉన్న సిద్ధివినాయక దేవాలయంలో నిర్వాహకులు, అధికారులతో సమావేశం నిర్వహించి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు మార్చి 31వరకు దేవాలయం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో తాసీల్దార్‌ రాధాబాయి, ఎంపీడీవో రాజశేఖర్‌, ఎస్‌ఐ. విజయ్‌రావు ఉన్నారు.

ఏడుపాయల ఆలయంలో దర్శనాలు రద్దు

కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయంలో భక్తులకు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో సార శ్రీనివాస్‌ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆలయ గర్భగుడికి ఈవో ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులు తాళం వేసి మూసి వేశారు. నిత్యం వేకువజామున అభిషేక పూజలు నిర్వహించి మళ్లీ మూసి వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం ఈ నెల 31 వరకు నిలిపి వేస్తున్నట్లు  తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులెవ్వరూ ఏడుపాయల దుర్గామాత దర్శనానికి రావొద్దని సూచించారు.

తునికి నల్లపోచమ్మ ఆలయంలో..

కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న కారణంగా ముందస్తు జాగ్రత్తగా తునికి నల్లపోచమ్మ ఆలయంలో భక్తులకు దర్శనాన్ని నిలిపివేస్తునట్లు ఆలయ ఈవో మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మోహన్‌రెడ్డి మాట్లాడుతూ దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

కేతకీ దేవాలయం 

అష్టలింగాలకు నిలయమైన కేతకీ సంగమేశ్వర స్వామి  దేవాలయం ప్రతి రోజు భక్తులతో రద్దీగా ఉండడంతో పాటుగా ఆలయ ఆవరణలో కేశఖండన, వివిధ కార్యక్రమాలు జరిగేవి. కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావంతో భక్తులు ఆలయానికి రాక పోవడంతో భక్తులు లేక నిర్మానుష్యంగా కన్పిస్తున్నది. ఆలయ అధికారులు శుక్రవారం ఆలయ గేట్లు,  అమృతగుండానికి తాళం వేశారు. ఆలయ గర్భగుడిలో స్వామి వారికి ఉదయం, రాత్రి పూజలు యథావిధిగా చేపట్టనున్నట్లు ఆలయ ఈవో మోహన్‌రెడ్డి తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సుబ్రహ్మణ్యం, విలాశ్‌, అర్చకులు దిలీప్‌ మహారాజ్‌, వీర్‌సంగయ్యస్వామి, అంజయ్యస్వామి, బసవయ్యస్వామి, శివలింగయ్యస్వామిలున్నారు. 

బీరంగూడ ఆలయంలో.. 

కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న తరుణంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా శుక్రవారం మున్సిపల్‌ పరిధిలోని బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున దేవాలయాన్ని మూసివేశారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు దేవాలయం మూసివేతతోపాటు ఆర్జిత సేవలు, అన్నదానం, ప్రసాదాలు తదితర కార్యక్రమాలను నిలిపి వేశామని ఆలయ కమిటీ చైర్మన్‌ తులసిరెడ్డి, ఈవో వేణుగోపాల్‌రావు పేర్కొన్నారు.  

ఆలయాల్లో ఆర్జిత సేవలు నిలిపివేత

చేర్యాల, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారించేందుకు ముందస్తుగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు మల్లన్న ఆలయంలో ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలివేస్తున్నట్లు ఈవో టంకశాల వెంకటేశ్‌ ప్రకటించారు. శుక్రవారం మల్లన్న ఆలయ కార్యాలయంలో పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ మేక సంతోష్‌, చేర్యాల సీఐ రఘుతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ఆలయంలో మల్లన్న స్వామికి నిత్య కైంకర్యాలు యథావిధిగా నిర్వహిస్తామని, ఆలయంలో ఆర్జిత సేవలు (పట్నాలు, బో నాలు, అభిషేకాలు, నిత్య కల్యాణం, కల్యాణకట్ట, ప్రసాదాల విక్రయం) నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. ఆలయం లో నిర్వహిస్తున్న అన్నదానం, కోనేరులో సామూహిక స్నానాలు, ఆలయ వసతి గదులు సేవలను నిలిపివేస్తున్నట్లు వివరించారు. ఆలయ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆగమ పాఠశాలకు సెలవులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాల పరిశుభ్రతకు అధిత ప్రాధాన్యత ఇస్తున్నట్లు, శానిటరీ సేవలు మరింత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ నివారణ కోసం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి భక్తులు సహకరించాలని కోరారు. దీంతో పాటు ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న వేలం పాటలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

  అగ్నిగుండాలకు కరోనా కాటు

మల్లన్నస్వామి ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న అగ్నిగుండాల కార్యక్రమాన్ని సాదాసీదాగా ఆలయవర్గాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేవలం 100 మందితో అగ్నిగుండాల నిర్వహణ ఉంటుందని, భక్తులు మాత్రం కొమురవెల్లికి రావొద్దని కోరారు. పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య ఉత్సవాన్ని పూర్తి చేసి బ్రహ్మోత్సవాలను ముగిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఈవో సుదర్శన్‌, సూపరింటెండెంట్‌ శేఖర్‌, ప్రధానార్చకుడు మల్లికార్జున్‌, ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు నర్సింహులు, అమర్‌గౌడ్‌, బొంగు నాగిరెడ్డి, ఎగుర్ల మల్లయ్య, ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి ఉన్నారు.

ఆలయ ప్రధాన ద్వారం మూసివేత

ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈవో ప్రకటించిన కొంత సమయంలో ఆలయ ప్రధాన ద్వారాన్ని మూసి వేశారు. దీంతో భక్తులు ప్రధాన ద్వారం వద్దే మొక్కులు చెల్లించుకున్నారు. 

 కొండపోచమ్మ ఆలయలో..

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కలెక్టర్‌ ఆదేశాలతో కొండపోచమ్మ దేవాలయంలో ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహన్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగానే ఆలయంలో సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు అమ్మవారి ఆలయానికి భక్తులు రావొద్దని సూచించారు. అదేవిధంగా ఆలయంలోని దుకాణాదారులు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఈవో, చైర్మన్‌లు సూచించారు.

వర్గల్‌ంలోని ఆలయాలన్నీ మూసివేత 

మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు నాచగిరి లక్ష్మీనరసింహస్వామి, విద్యాధరి సరస్వతీక్షేత్రాల్లో నేటినుంచి  ఆర్జిత సేవలు, ప్రత్యేక పూజలను రద్దు చేస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ నియంత్రణపై పటిష్ట చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. నిత్యపూజలు  యథావిధిగా జరుగుతాయని తెలిపారు.


logo